పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
భీష్ముని ధర్మజుండు ప్రశంసించి యక్షర క్షరంబుల నడుగుట. (సం. 12-291-1)
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు యోగసాంఖ్యవిదు లక్షరంబునొంది యానందస్వరూపు లగుదురని చెప్పిన విని ధర్మతనయుండు దేవవ్రతునితో ‘నీవు పరమజ్ఞాన నిధివని వేదసంవేదు లగు విప్రులు సెప్ప నప్పలుకులు నిన్ను సాంఖ్యయోగ ప్రవీణులయిన యతులును మునిపతులును వర్ణింప నవ్వచనంబులును నాకర్ణించుచుం బ్రమోదంబునం బొందుచుండుదుము. దక్షిణాయనశేషదినంబు లింక నల్పంబు, లర్కుండు మరలంబడినఁ బరమగతిం బ్రాపించెదవు, మఱి మేమెవ్వరిచేత వినువారము? కురువంశంబునకుం బ్రజ్ఞాఘృత ప్రదీపితంబగు దీపంబుగావె? భవత్తేజంబు నాశ్రయించెద’ మని తనవారలం గలసికొని పలికి, ‘నీవు నిర్దేశించిన యక్షరం బనునది యెట్టిది? క్షరం బెయ్యది? యెఱింగింపవే?’ యనుటయు నతండు ‘వసిష్ఠజనక సంవాదంబనంబరఁగు విశిష్టేతిహాసంబు గలదు. దాన నీయడిగిన యవియును మఱియునెఱుంగ వలయునట్టివి యనేకార్థంబులును దెలివిపడు; విను’మని సుప్రసాదభరితుండై. 2
సీ. అనఘ! సుఖాసీనుఁడైన వసిష్ఠసం | యమిఁగాంచి భక్తిఁ బాదముల కెఱఁగి
జనకభూనాథుండు వినయంబుతోడ ను | పాసించి ‘మునివర! యక్షరం బ
నాది శివంబన నపునరావృత్తి సి | ద్ధిదమగుచుండు నెయ్యది యెఱుంగఁ
జెప్పవే!’ యనుడు నాశ్రిత వత్సలుండగు | నమ్మహాత్ముఁడు దెలియంగఁ జెప్పె
 
తే. నద్దయాళుని చెప్పిన యత్తెఱంగు | ప్రస్ఫుటంబుగఁ జెప్పెదఁ బాండవాగ్ర
జన్మ! నీ కని పలికి యజ్జాహ్నవీత | నూజుఁ డిట్లను నాననాంభోజ మలర.
3
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )