పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
విద్యావిద్యల ప్రకార నిరూపణము (సం. 12-295-1)
ఆ. విద్యయనఁగఁ బంచవింశతితమ తత్త్వ | మైన యక్షరంబు మానవేంద్ర!
విను మవిద్య నాఁగఁ జనుఁ బ్రధానము, దేట | పఱిచెదను విశేషభంగు లెల్ల.
44
వ. కర్మేంద్రియంబులకు బుద్ధీంద్రియంబు విద్య, బుద్ధీంద్రియంబులకు మనస్సును, మనస్సునకు భూతపంచకంబును, భూతపంచకంబునకు నహంకారమును, నహంకారమునకు బుద్ధియు, బుద్ధికి నవ్యక్తంబును, నవ్యక్తంబునకుం బంచవింశతితమ తత్త్వంబును విద్య’లని చెప్పి వెండియు నమ్మునివరుం డిట్లనియె. 45
తే. ‘క్షరము నక్షరమును ననఁ గలుగు రెంటి | నేర్పఱిచి మున్ను సెప్పితి నింక నొకటి
సెప్పఁ గలదు సమగ్రవిశేషకలిత | మవహితుండవై విను విదేహాధినాథ!
46
సీ. జీవుండుఁ బ్రకృతియు భూవర! యక్షర | క్షరము లీ రెంటిని క్షరము లనియు
నార్యులు సెప్పుదు రక్షరంబులు నందు | రాద్యంతరహితంబు లగుట యీశ్వ
రత్త్వంబుగల్గుట తత్త్వాదికము లనఁ | జనుట రెంటికి సదృశంబు సూవె
ప్రకృతిగుణంబులై పరఁగెడు మహదహం | కారాదికంబులఁ గలసినపుడు
 
ఆ. క్షర మనంగ వచ్చుఁ బురుషునిఁ ప్రకృతిఁ దా | నని తలంచుఁగాన, నదియుఁ బురుషుఁ
బొంద గుణవికారములు లేమి నిర్గుణ | మక్షరం బనంగ నగును దాని.
47
వ. ఎప్పుడు పురుషుండు ప్రబుద్ధుం డయ్యె నప్పు డతండు. 48
ఆ. ఇంతకాలమేని యెఱుఁగక సంగాభి | భూతయగుచు నప్రబోధకలిత
యైనయట్టి ప్రకృతి యేనంటి నిస్సంగ | బోధమహిమఁగానఁ బోలదయ్యె.
49
క. ప్రకృతికి నాకును నుదకము | నకు మత్స్య ంబునకుఁ బోలె నైసర్గికమై
ప్రకటంబైనది వేర్పా | టకట! యహంకారవశత నది యే నంటిన్‌.
50
క. ప్రకృతి గుణంబులఁ గొని బహు | వికృతపురూపముల నట్లు వెఱ్ఱిగొలిపె నే
నకలంకుండ నరూపుఁడఁ | బ్రకృతి దొఱఁగి నిలిచెదను నిరంజనమహిమన్‌.
51
తే. ప్రకృతి సేసెనె యీ యపరాధ మరయ? | నాయదియకాక వే ఱొకండే? యసంగ
కలితుఁడగు నేను దానితోఁ గలియనేల? | కలిగె బహురూపములు దానఁగాదె నాకు.
52
క. మమతంగాదే బహు జ | న్మములయ్యెడు! దీని విడిచి నానాయోని
భ్రమణంబుం బాసెద న | త్యమలుఁడ నగు నాకుఁ బ్రకృతి యాశ్రయ మేలా?
53
తే. ఎన్ని రూపులు గొనివచ్చి యెట్లు పొడవు | సూపెనేనియుఁ బ్రకృతినేఁ జూడ మమత
నా నహంకారమనఁ గల్గు వానిఁ జేర | నీక త్రోచినఁ బ్రకృతి దానెట్లు దోఁచు?
54
క. నిశ్చేతనయును నెంతయు | దుశ్చేష్టయునైన ప్రకృతి దొఱఁగి సముద్య
న్నిశ్చయవృత్తి నిరామయ | నిశ్చలనిర్మల పదైక నిరతుఁడ నగుదున్‌.’
55
వ. అని యిట్లు పరబోధనంబునం జేసి క్షరంబగు నవ్యక్తంబు దొఱంగిన పంచవింశకుం డక్షరం బనం బరఁగు, నక్షరంబునకుం బరంబైన దానిం బెక్కండ్రెఱుంగరు, సాంఖ్యసూక్ష్మ త్వదర్శకులు గాంతురు, క్షరాక్షర పరంబు లప్రబుద్ధబుధ్యమాన బుద్ధంబులను నిర్దేశంబులు గలిగియుండుఁ, బరతత్త్వ నిర్దేశంబునం బొల్చు షడ్వింశకంబు బుద్ధంబును విమలంబును నప్రమేయంబును సనాతనంబునునై పంచవింశంబును జతుర్వింశంబునుం గనుచు వెలుంగు నని చెప్పి వెండియు. 56
క. ‘విను దృశ్యంబు నదృశ్యం | బును నగు జీవ పరతత్త్వములు బ్రహ్మసమా
ఖ్యను నెగడుఁ బ్రకృతి కది లే | దనఘా! యక్షరము తెఱఁగు నభివర్ణింతున్‌.
57
ఆ. ప్రకృతి దొఱఁగి తన్నుఁ బరికించు జీవుండు | పరముఁ గాంచునపుడు ప్రకృతి సగుణ
తానిరూఢి యడఁగి తన్మయత్వము నొంది | జీవకేవలత్వసిద్ధి యొలయు.
58
క. విను కేవలుఁడగు జీవుఁడు | దనుఁ బరముంగాఁగఁ జూచి తల్లీనత్వం
బున వెలుఁగు నది నిరామయ | మనంతమగు పదముసూవె యతులవివేకా!
59
క. ఈ నెఱి పురుషునకుం గల | నానాత్వైకత్వములును నరనాయక! శా
స్త్రానూన దృష్టిఁ గనుఁగొనఁ | గా నగుఁ దాత్పర్యశుద్ధి కలితాత్మునకున్‌.
60
క. అనఘా! మోక్షము తెఱఁ గిది | విను మోక్షణమిట్లు పంచవింశునకుఁ గాఁ
గనినది యతండు ప్రకృతిం | దనుగాఁ గొని తద్గుణములఁ దగులుట వలనన్‌.
61
తే. తగులువాసి షడ్వింశకత్వమునఁ గలియఁ | దనకు మును లేని కేవలత్వమును నిర్మ
లత్త్వ శుచితా స్వతంత్రత్త్వ సత్త్వపరత | లొందుఁ దద్ధర్మ సమవాయ మొలసి యధిప!’
62
వ. అని యిట్లు ప్రబోధించి. 63
క. ‘శివమును బరమ బ్రహ్మము | నవికృతియు సనాతనంబు నగు పదమును భూ
ధవ! యెఱిఁగించితి నిర్భయుఁ | డవు గ మ్మలవఱపు మిది దృఢంబుగ నాత్మన్‌.
64
తే. దీని నెఱిఁగించునపుడు భక్తియును శమము | దమము సంశ్రయమును వేదతత్పరతయుఁ
గలుగఁజూచి యెఱింగింపు కానివాని | కీకుమా విద్య పాత్రదానైక నిరతి
65
ఆ. అఖిల రత్నపూర్ణయగు వసుంధర యెల్ల | నొసఁగితేని నొసఁగు యోగ్యతాభి
యుక్తిలేనివాని కొసఁగకు మీ విద్య | తగిన పాత్రమైనఁ దడయ కిమ్ము.’
66
క. ‘అని చెప్పె, నియతుఁడై విని | జనకనృపాలుఁడు గృతార్థజన్ముం డయ్యెన్‌
మనుజేంద్రవర్య నీకే | వినిపించితిఁ దదితిహాస విధ మేర్పడఁగన్‌.’
67
వ. అని పలికి భీష్ముఁడు పాండవాగ్రజున కిట్లనియె. 68
క. ‘ఇది బ్రహ్మ వసిష్ఠునకున్‌ | సదయుండై చెప్పె నతఁడు నారదునకు సం
విదితంబు నేసె నమ్ముని | మదాత్మకుం దేటపఱిచె మహనీయకృపన్‌.
69
క. ఏను వసిష్ఠువచనముల | కానెఱిఁగించితి మనంబు కలఁక విడిచి యీ
జ్ఞానం బలవఱుపుము పర | మానందప్రదము కౌరవాన్వయముఖ్యా!
70
క. క్షరమును నక్షరమును ద | త్పరమును నెఱిఁగితి విశోకభయమోహుఁడవై
కురువర! యా నిశ్శ్రేయస | కరప్రబోధంబు నూఁదు గాఢాదరతన్‌.’
71
వ. అని చెప్పి వెండియు. 72
సీ. ‘వేఁట వేడుక నడవికిఁ జని వసుమంతుఁ | డనువాఁడు జనకుని తనయుఁడొక్క
చో భృగువంశతేజో వర్ధనుండగు | నొక మునీశ్వరుఁ జూచి యుచితవృత్తిఁ
జేరి వినమ్రుఁడై ‘చిత్తానువృత్తిమై | నిహపరంబుల కెద్ది హితము సెప్ప
వే’ యన్నఁ గృప నతండిట్లను - భూతహి | తాహితాచరణంబు లధిప! సౌఖ్య
 
ఆ. దుఃఖముల నొనర్చు దుర్వార తృష్ణ త | న్నిరసనంబు మేలు నరులు జుంటి
చవియకాని నెగులుఁ జఱి రయంబున నెక్కి | తారు విఱుగఁబడుటఁ దలఁప లేరు.
73
క. ధర్మంబుఁ బరిజ్ఞానము | నిర్మలమతి నభ్యసించి నృప! యనిశంబున్‌
ధార్మికసంగతి గలిగినఁ | బేర్మి యుభయలోకముల నభిష్టుత్యమగున్‌.’
74
వ. అని మఱియును. 75
తే. బ్రాహ్మణ ప్రార్థితములైన పనులు సేయు | మిమ్ము ధనము పాత్రములకు నిచ్చి వగవ
కుండు, మక్రోధకామత్వ మొలయఁ జేయు | మతికి ధృతి సాలఁ గల్గుము మనుజనాథ!
76
వ. ధృతిలేమింగాదె మహాభిషాఖ్యుండగు నృపముఖ్యుండు త్రివిష్టపంబుననుండి విభ్రష్టుండయ్యె! ధృత్యాలంబనంబునంగదా యయాతి యాపద నిస్తరించె!’ 77
క. అనిన విని యా నృపతి య | మ్ముని వచనము లూఁది కామమునకుం గ్రోధం
బునకుం దొలఁగించి తనదు | మనము ధృతికి ధర్మమునకు మరుగంజేసెన్‌.’
78
వ. అని చెప్పినం బ్రియంబంది మందాకినీనందనుతో ధర్మనందనుండు ‘ధర్మాధర్మవియుక్తంబును సర్వసంశయ విముక్తంబును జన్మమృత్యు రహితంబును నిత్యంబును శుచియును శివంబును నవ్యయంబును పరంబును ననాయాసంబును నగునట్టిదాని నెఱింగింపవే?’ యని ప్రార్థించిన నతండు యాజ్ఞవల్క్య జనక సంవాదం బితిహాస రూపంబునం బ్రవర్తిల్లు నది వినిన భవదభ్యర్థితంబైన యర్థంబు ప్రతిభాసించు మఱియు వలయునవి యెఱుంగనగుం జెప్పెదనని పలికి యతని కిట్లనియె. 79
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )