| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | ‘కృష్ణద్వైపాయన పుత్రుండను మాత్రమ కాని శుకుని జన్మంబు తెఱంగును నతని తల్లిని నతండు బాల్యంబున మహానుభావుం డగుటకుం గతంబును నతండు సిద్ధివొందిన భంగియు నెఱుంగ నవియెల్ల నెఱింగింపుము.’ | 246 |
| సీ. |
అనవుడు నతఁడిట్టులను నాతనికిఁ గర్ణి | కారవనం బనఁ గలదు మేరు తటమున నం దద్రితనయయుఁ దానును | పశుపతి లీలమైఁ బ్రమథగణము గొలువనుండఁ దనూజుఁగోరి వేదవ్యాస | సంయమి దత్ప్రదేశమున యోగ బలమూర్జితముగఁ దపంబొనరించె యో | గమునకు రాజసూయములు నశ్వ |
|
| తే. |
మేధములును నపరిమితములైనను సరి | గావు సూవె వినుము కౌరవేంద్ర! తత్తపోవిశిష్టతకు మెచ్చి శివుఁడు ప్ర | త్యక్షమై యభీష్టమడుగు మనిన. |
247 |
| వ. | అ మ్మునీశ్వరుండు భక్తి సంభ్రమభరితుం డగుచుం దండప్రణామంబు చేసి. | 248 |
| క. |
‘జల పవనాంబరవసుధా | నల సమవీర్యుఁడగు పుత్రు నా కొసఁగంగా వలయు’ ననుడు నిచ్చితి నని | పలికి చనియె నమ్మహాకృపామూర్తి నృపా! |
249 |
| వ. | ఇట్లు లబ్ధవరుం డగుచు సత్యవతీసుతుం డగ్నికార్యపరుండై యరణి వుచ్చికొని మథింపం దొడంగిన ఘృతాచి యను నప్సరోవనిత లోచనగోచరం బగుటయుఁ దానునుం గామగోచరత్వంబు నొందిన నయ్యిందువదన యమ్ముని తెఱం గెఱింగి వంచనం జిలుకయై యుండె నతండును ధైర్యం బవలంబించి యరణికార్య ప్రవణుండై యుండం బ్రబలుండగు నంగజుని చెయ్ది నప్సరోరూపాతిశయసక్తచిత్తుండైన యా సంయమి శుక్లం బయ్యరణియందుఁ బడియె. నవ్విప్రుండు నిర్విశంకంబగు నంతఃకరణంబుతో నరణిమథనం బొనరించిన. | 250 |
| తే. |
అయ్యరణిఁ బుట్టి జనకసమాకృతియును | భూరి కాంతియు వెలుఁగంగఁ బొలిచె శుకుఁడు యాగకాల సుసంభృత హవిరవాప్తి | మహితతేజస్కుఁడగు హుతవహుని మాడ్కి. |
251 |
| సీ. |
అపుడు మందాకిని సాకారయై వచ్చి | మంగళస్నాన సమన్వితుఁడు గ నొనరించె నాకసంబుననుండి పడియెఁ గృ | ష్ణాజినదండంబు లతని యెదుర దివ్యదుందుభులును దేవాంగనాగాన | ములును వీతెంచె నద్భుతముగాఁగఁ గుసుమవర్షంబులు గురిసె నింద్రాది దే | వతలు గారవమున వచ్చి రంబి |
|
| తే. |
కాసమేతుఁడై యేతెంచి కామవైరి | యతని నుపనీతుఁ గావించె నమరనాథుఁ డుజ్జ్వలంపుఁ గమండులు వొసఁగె నిచ్చి | రమరు లెన్నండు మాయని యంబరములు. |
252 |
| క. |
మృగపక్షి సమూహము లా | దిగఁ గల్గు చరాచరముల దివ్యప్రభవుం డగు శుకుని పుట్టొనర్చెం | బ్రగాఢతమ సంప్రమోద భరితంబులుగాన్. |
253 |
| క. |
జనియించిన మాత్రన య | మ్మునిప కిశోరమును వేదములు వొందెను ద జ్జనకుని మును పొందిన తెఱఁ | గున, నబ్బాలుఁడు వరించె గురుఁడుగ ధిషణున్. |
254 |
| వ. | ఆచారపరిపాటి యవలంబించి యి ట్లుపాధ్యాయవరణంబు సేసి. | 255 |
| తే. |
అతఁడు సదివింప వేదవేదాంగధర్మ | శాస్త్రరాజనీత్యాదిక సకల విద్య లును గ్రమంబునఁ జదివి యమ్మునికుమారుఁ | డచ్చటన యుండె వ్రతచర్యలందుఁ దగిలి. |
256 |
| వ. | దేవతలకు లోనుగా నామంత్రణీయుండును మాననీయుండును నగుచు నట్లుండు నయ్యారణీయుండు నిజాశ్రమంబున నున్న తండ్రిపాలికిం జనుదెంచి తదనుసరణ ప్రక్రియం బ్రవర్తించునెడ నచ్చేరువం జరించు మునికుమారులతోడి మాటలు మరిగి లోకంబుతోడి పాటియై యాత్మానుసంధానంబు సేయలేక మెలంగుచున్నం జూచి యా సత్యవతీసుతుండు సాంఖ్యయోగశాస్త్రంబు లతనికి నధిగతంబులు గావించె మఱియు దేహంబునందలి యహంకారంబంతయు బంధులవలని మమతయుం బాయునట్టి వాక్యంబు లుపదేశించె దానం బ్రబోధం బుదయించుటం జేసి యమ్మహామతికి బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ ధర్మంబులను నాశ్రమంబులు మూఁటను బుద్ధి రమింపదయ్యె నయ్యుఁ బరమపరుం డప్పారాశర్యుతో మోక్షప్రదం బెయ్యది దాని నెఱింగింపవే యనుటయు. | 257 |
| ఆ. |
అతఁడు మోక్షదర్శి యగుట నిరూపించి | యమ్మహామునీంద్రుఁ డతనితోడ వత్స! కానఁ బొమ్ము వైదేహుఁడగు జన | క క్షితీశు వినయగౌరవమున. |
258 |
| క. |
గగనంబునఁ జను టుడుగుము | తగంగఁ బాదప్రచారితన చను మిథిలా నగరమునకు నమ్ముని మా | న్యగుణుం గను మోక్షధర్మ మతఁ డెఱిఁగించున్. |
259 |
| క. |
ఆ రాజన్యునెడ నహం | కారిత మమకారితయును గర్తవ్యముగా దేరికినైనను బూజ్యుం | డారయ నాతఁడు వినీతియ తగుం జుమ్మీ! |
260 |
| ఆ. |
అనిన నట్లకాక యని మేరుముఖనగం | బులు ననేకనదులుఁ బలుదెఱఁగుల దేశములను వివిధతీర్థంబులును జుల్కఁ | గడచి వచ్చె భరతఖండమునకు. |
261 |
| వ. | వచ్చునప్పు డెయ్యెడ నే పదార్థంబులఁ జూచినం జూడనివాఁడపోలె వచ్చె. నిట్టు వచ్చి విదేహజనపదంబు సొచ్చి మిథిలాపురంబు నుపవనంబు దఱిసి చని తదీయప్రాకారద్వారదేశంబు సేరిన సమయంబున. | 262 |
| ఆ. |
ద్వారపాలు రచట వారింప శాంతిమై | నూరకున్నఁ జూచి వారు వెఱచి లోని కెఱుకచేసి లోఁగుచు వారు ద | న్ననుప నరిగె నృపగృహంబు సేర. |
263 |
| క. |
అచటఁ బ్రతిహారు లాఁగిన | నచలిత శమవృత్తినుండె నవ్వేత్రధరుల్ ప్రచలితమతులై యా తెఱఁ | గుచితంబుగఁ జెప్ప నృపతియుఁ బురోహితునిన్. |
264 |
| తే. |
అరయఁ బుత్తెంచె నాతఁడు నరసిపోయి | నిజ మెఱింగింప భక్తి వినీతి సంభ్ర మములు ముప్పిరిగొనఁగ నమ్మనుజనాథుఁ | డఖిల మంత్రులు బుధులుఁ దో నరుగుదేర. |
265 |
| చ. |
శిరమున నర్ఘ్య పాత్రఁగొని చెచ్చెర వచ్చి ప్రియం బెలర్ప న గ్గురుసుతుఁగాంచి యంతిపురి కోటకు లోనగు నొక్క సౌమ్యమం దిరమున కమ్మునిం గొనుచు దేవసమప్రతిపత్తి నేఁగి ర త్నరుచిర కాంచ నాసనమునం దగనుంచి సునీతపాద్యుఁడై. |
266 |
| క. |
లలితాక్షతములఁ గుసుమం | బులఁ బూజితుఁ జేసి యర్ఘ్య మును గోవును న క్కులపతికి నిచ్చె విధిపరి | కలనజ్ఞుండైన యతఁడుఁ గైకొనియెఁ దగన్. |
267 |
| వ. | జనకుండు సవినయంబుగా నిలుచుండి యమ్ముని యనుమతి సేసిన మఱి మహియంద సమాసీనుండై తానును మంత్రులు విద్వజ్జనంబులు గొలిచియుండె నట్టియెడ నన్నరపతి పరివారజాతం బెల్లను గౌతుకంబునం జనుదెంచి యంతంత మ్రొక్కుచుం జూచుచుండ. | 268 |
| తే. |
రూపవిభ్రమముల నప్సరోజనంబుఁ | గ్రేణిసేయు వారాంగనాశ్రేణి గీత నృత్యనిరతి నారాధింప నిర్విశేష | యోజితేంద్రియుఁడై యతఁ డుండె నధిప! |
269 |
| చ. |
అతనికి నన్నపానముల నంచితభక్తి నొనర్పఁగాఁ బురో హితు నియమించి యవ్వసుమతీశ్వరుఁ డద్దినశేషయామినుల్ చతురము భక్తియుక్తమును సంప్రమదంబునుఁ గా నయించె స మ్మితమృదు సారభాషణసమీరణతం దదుపాంతవర్తియై. |
270 |
| వ. | మఱునాఁ డమ్మహీపాలుండు గాలోచితకృత్యంబు లాచరించి కృతకరణీయుండును సుఖాసీనుండునునై యున్న యమ్మునిపాలికి సూరిజన సమేతంబుగాఁ జని పరివేష్టించి యుండి కేలుమోడ్చి ‘మీరిట విచ్చేయుటకుం గతంబేమి?’ యని సవినయంబుగా నడిగిన నమ్మహాత్ముండు ‘మా తండ్రి పంపున మోక్షమార్గబోధార్థినై వచ్చితి విప్రునకుం గర్తవ్యం బెయ్యది? మోక్షం బేమిటం బడయవచ్చు? నెఱింగింపవే!’ యనుటయు నతండు సవిశేష సమాదరుండై - | 271 |