పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
జనకుఁడు శుకున కుపదేశించిన మోక్షధర్మ ప్రకారము: (సం. 12-313-9)
సీ. ‘విను ముపనీతుఁడై విప్రుండు బ్రహ్మచ | ర్యంబు వేదాభ్యసనంబు నడపి
దారసంగ్రహము సంతానసంపాదనం | బును నధ్వరక్రియయును నొనర్చి
దేవపిత్రతిథిపూజా విధిపరుఁడగు | చుండి వనమునకు హుతవహప్ర
యుతముగఁ జని యందు నతిథులఁ గొనియాడి | వ్రతము గషాయపక్వత నొనర్ప
 
తే. నగ్నులాత్మయంద యారోపితములుగఁ | జేసి వీతరాగ చిత్తవృత్తిఁ
బరమశాంతిఁ బొంది బ్రహ్మాశ్రమపదంబుఁ | బొందువాఁడు లోకపూజ్యచరిత!’
272
వ. అనిన విని యమ్మునివరుండు. 273
క. ‘జ్ఞానోదయమైయుండఁగ | మానక వెండియును నాశ్రమత్రయవాసుం
డై నిలిచి తత్క్రియాను | ష్ఠానము గ్రమవృత్తి నడపుటయు వలయు నొకో?
274
తే. జ్ఞానవిజ్ఞాన దృష్టి శాశ్వతిక తత్త్వుఁ | డయ్యెనేనియు విడువరా దాశ్రమముల
క్రమ సమారూఢి యనునె వేదములు? దీనిఁ | దెలియఁజెప్పవె మోక్షవిత్తిలకజన్మ .’
275
వ. అనవుడు నతం డతని కిట్లనియె. 276
తే. జ్ఞానవిజ్ఞానములు మోక్షసాధనములు | గురుని యుపదేశమున నవి దొరకొనంగ
వాన మోక్షంబు గాంచినవాఁడు విడుచు | నయ్యుపాయద్వయమ్మును నతులబుద్ధి.
277
క. లోకోచ్ఛేదముఁ గర్మ | వ్యాకులతయుఁగాక యుండవలయుటకై సు
శ్లోకా! చతురాశ్రమములు | గైకొని నడిపిరి దృఢంబుగాఁ బూర్వమునుల్‌.
278
తే. అందుఁ దుదముట్ట నడచిన నందవచ్చు | ముక్తి బహుజన్మ సంసిద్ధమోక్షకార
ణముల శుద్ధుఁడై ప్రథమాశ్రమమునయంద | కాంచు మోక్ష మెందేని నొక్కరుఁడు మునిప!
279
క. వానికి మూఁడాశ్రమముల | లో నిలువఁ బ్రయోజనంబులుం గలవె? తమోఽ
ధీనతను రజఃపరత | న్మానవలయుఁ గాక? సత్త్వనైష్ఠికమతియై.
280
తే. సత్త్వమార్గాభిరతి యాత్మతత్త్వదర్శ | నంబు గావింపఁ దనుఁ దాన నరుఁడు గాంచు
విశ్వమునఁ దానుఁ దనయందు విశ్వమును వ | సించుటయుఁ జూచుచును ముక్తిఁ జెందియుండు.
281
వ. ఇవ్విషయంబున యయాతి వాక్యంబులు గల వాకర్ణింపుము. 282
ఆ. జ్యోతి యాత్మయంద యున్నది కాన శ | క్యము సమాహితాత్ముఁడైన మునికి
నొరులవలనఁ దనకు నొరులకుఁ దన దెస | భయము లేకయున్నఁ బరముఁ గాంచు.
283
క. కోరికయు నొల్లమియు లే | కే రూపున భూతములకు నెగ్గగు తెఱఁగుం
జేరక యకామవృత్తిఁ ద | పోరతి నున్నతఁడు బ్రహ్మముం బ్రాపించున్‌.
284
క. వినఁ జూడం బడు నం దె | ల్లను సమతం బరముఁ గనుచు లౌల్యనిరసనం
బున సుఖదుఃఖాదిద్వం | ద్వనిరూఢుఁడు గాక యున్నతఁడు ముక్తిఁ గనున్‌.
285
క. ఇనుమును గనకము నిందయు | వినుతియు సమములుగఁ గొనుచు వివిధాంగకముల్‌
దనలోన నడఁచు కమఠము | ననువున నింద్రియము లడఁచునతఁడు గను శివున్‌.’
286
వ. అని చెప్పి. 287
తే. అవ్విశేషంబు లెల్ల నీయందుఁ గలుగు | టనఘ! భవదీయ జనకదయాసమృద్ధి
సిద్ధ దివ్యబోధంబునఁ జేసి తోఁచె | నవ్విధముకంటె నీ చంద మధికతరము.
288
క. నీ వట్టిఁడ వగు టెఱుఁగవు | భావంబున సంశయమును భయమును బాల్యం
బావేశింపఁగఁ జేయ న | భావితనిశ్చయుఁడ వగుటఁ బరముమునీంద్రా!
289
క. జ్ఞానము విజ్ఞానము నీ | మానిత గుణము లగు నవి సమగ్రములైనం
గానేరదు మోక్షపదము | గానుపు - దృఢనిశ్చయుండు గాకున్నేనిన్‌.
290
తే. ఒక్క కొఱఁతయు లేదు నీ వుదితమోక్ష | బోధుఁడవు సంశయములెల్లఁ బోవవిడిచి
నిశ్చయింపుము నీ కన్న నెలవు శాశ్వ | తంపు నెలవుగ విషయావికంపితాత్మ!’
291
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )