పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
ఏకతద్వితత్రితులు బృహస్పతికి విష్ణుదేవుమహిమ సెప్పుట (సం. 12-323-19)
సీ. ‘అలుక మానుము హరికై సముద్యతమైన | భాగంబు హరిగొన్నఁ బదరనేల?
యతని దర్శింప శక్యమె నీకు మాకును? | నజుని మానస పుత్రు లైన యేము
హరిదర్శనముఁ గోరి యధికతపం బాచ | రించుచుండఁగ నశరీరవాణి
దుగ్ధార్ణవంబునందు విశాల రమణీయ | మగు నొక్కదీవి దెల్పారియుండు
 
తే. నచటి కరుగుఁ డనుచు నతి సితవర్ణుల | స్వేదు లింద్రియప్రవృత్తి విముఖు
లధిక సురభిదేహు లాహార రహితులు | హరిపరాత్ములైన నరులు గలరు.
365
క. వారలకుఁ జూపు నిజతే | జోరూపము విష్ణుఁ డపుడు సూడఁగనైనన్‌
మీరును జూతు రనినఁ బ్రియ | మారిన చిత్తములతోడ నందఱము వెసన్‌.
366
వ. శ్వేతద్వీపంబునకుం జని యశరీరవాణి సెప్పిన చందంబు మానవులం గంటి మట్టి దీప్తి విశేషంబు లే లోకంబుల నెజ్జాతులకు లేవు. వారలు మానసజప పరాయణులైయున్నవా రే మయ్యెడ నేకాంతిజనుల కింతనంత నున్నంత భాను సహస్ర ప్రభాభాసితంబగు నొక్కదివ్య తేజోరూపంబు వారి యగ్రభాగంబునం దోఁచిన వారు గూడుకొని భక్తిమయ ప్రణామంబులు సేయుచుం జేరి జయ పుండరీకాక్ష! జయ హృషీకేశ! జయ విశ్వభావన! నమస్తే నమస్తే యను నెలుంగులు నింగిముట్టం గొల్పి రట్టియెడ. 367
క. మా నయనంబులు దత్తే | జోనిహతము లగుడుఁ దెలియఁ జూడ నశక్యం
బైనం జేడ్పడి యుండం | గా నొక భూతంబు వలికె గగనతలమునన్‌.
368
క. ఈ దేవునిఁ గన్నట్టుల | కాదే? యిప్పురుషవరులఁ గాంచుట మీకున్‌
ఖేదంబు వలదు నియమ త | పోదానము లితనిఁ జూపఁ బూఁటవడియెనే?
369
క. ఏకాంతిక భక్తిరతి న | నేకములగు వత్సరముల కివ్విష్ణుని నా
లోకింపంగా దొరకొనుఁ | గా కిటు వేగపడ మీకుఁ గానఁగ వశమే?
370
క. అని పలికిన విని క్రమ్మఱఁ | జనుదెంచితి మేము విష్ణు చందం బిది నీ
కనఘా! యలుగం బనిలే | దనూనములు గాఁగ నడపు మధ్వరవిధులన్‌.’
371
వ. అని యిట్లేకతద్వితత్రితులు సెప్పినం బ్రశాంతుండై పురుహూతపురోహితుం డయ్యాగంబు సుప్రయోగంబుగాఁ జెల్లించె నా భూవల్లభుం డట్లు పుణ్యపరుం డగుచుఁ బ్రజాపరిపాలనం బొనరించె నట్టియెడ నాకలోకంబునన సురమునిగోష్ఠి యందు సుర లధ్వరంబుల నజంబుల విశసింపవలయు నని పలికిరి మును లజంబు లన్నంతన యెల్లయుగంబులను ఛాగంబులఁగాఁ గొనరాదు. కృతయుగ విషయంబుగా వేదంబు లజంబు లోషధులని చెప్పెంగాన యని రిట్లు వివాదంబైన సమయంబున నలవోక నుపరిచరవసు వయ్యెడకుం జనిన నా రెండు దెఱంగులవారును జయాపజయంబులకు నతనిమాట పాటిగా నూఁది యడిగిన నాతండు. 372
క. ఛాగమ విశసనయోగ్యము | యాగంబుల నెల్ల యుగములందు ననియెం
దా గీర్వాణుల పక్షం | బై గెలు పది యపుడు వారి కగుటకు నధిపా!
373
వ. అనిన విని వేదార్థాపలాపంబునకుం గోపంబు నొందిన మునుల శాపంబున నతండు భూవివరపతితుండై యుండ నమరు లేతెంచి యతని యంతరంగంబునకుం దెలివును నంగంబునకు డప్పి లేకునికియు నొసంగి విష్ణుప్రసాదంబునఁ బ్రత్యాపన్నుండ వగు దని యూఱడించి యరిగి రన్నరవరుండును విష్ణుధ్యాన జపపరాయణుం డగుచుండ నచిరకాలంబునకు విష్ణుండు విహగపతిం బుత్తెంచి యెత్తించికొనిపోయి శరీరంబుతోడన బ్రహ్మలోకగతుం గావించి సంభావించిన నమ్మహానుభావుండు పరమానందంబునొంది వెలింగె. 374
క. కురునాథ! యుపరిచరవసు | చరితంబు ప్రసంగకలన సంప్రాప్తంబై
బెరసెను నీ వడిగిన య | ప్పురుషుల దివ్యానుభావముం జెప్పంగన్‌.’
375
వ. అని పలికి భీష్ముం డా భూపతితో ‘నారదు వృత్తాంతంబు వివరించెద నాకర్ణింపుము.’ 376
సీ. అని చెప్పి యిట్లను ‘నధిప! నారదుఁ డట్టు | లద్దీవియును నద్భుతాంగులైన
యమ్మానవులుఁ దన యంతరంగంబునఁ | దోఁచినఁ బ్రీతి నందులకు నేఁగి
యమ్మహాత్ములు దన్ను నాత్మల నాదరిం | పంగఁ దా నత్యంతభక్తిఁ బ్రణతుఁ
డై పరమైకాంతులగువారి కింతింత | నిలిచి దుష్కరతపోనిష్ఠఁ బూని
 
తే. యూర్ధ్వబాహుతఁ గదలకయుండి వివిధ | గూఢ దివ్యనామోక్తి సంప్రౌఢి యచటి
సకలజీవుల నానంద సంభృతములఁ | జేయుచుండ విష్ణుస్తుతి సేయుచుండె.
377
వ. ఇవ్విధంబున నేకాంతియై సంస్తుతింప సితాసితపీతారుణ పిశంగ హరిత వర్ణంబులను బహుశిరోబాహుపాదంబులను వేది - కమండలు - స్రుక్స్రు వాగ్ని ధారణంబున నోంకారసావిత్రీ చతుర్వేదో చ్చారణంబులను మహాద్భుతంబయిన నిజదివ్యరూపంబు నారదునకు దర్శనగోచరంబుగా నిలిచి విష్ణుండు వినయ సంభ్రమోపేతభక్తి ప్రణతుండగు నప్పరమముని నాదరించి యిట్లనియె. 378
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )