| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| సీ. |
ఆదికాలమునఁ బ్రజాభిసర్గమునకు | నారాయణుఁడు నిజనాభిపద్మ మున బ్రహ్మఁ గల్పింప భూతసంఘమ్ముల | నెల్ల నాతఁడు సృజియించె నతని ముఖమున బహువేదములు ప్రసరింపఁగఁ | జేసి వానికి మేలుసేఁత బుద్ధిఁ దలఁచి యవ్విష్ణుండు నలఘుబోధుని నపాం | తరతముం డనియెడు తనయుఁ జిత్త |
|
| తే. |
మునన కల్పించి యతిభక్తి మ్రొక్కి నిలిచి | యున్న యక్కుమారుని శ్రుతు లన్నియును దృ ఢావధానుండవై విని నీవు వాని | నంచితవ్యాస మొందింపు మనియెఁ బ్రీతి. |
520 |
| ఆ. |
అనిన నట్లకాక యని యయ్యపాంతర | తముఁడు వేదభేదనము నొనర్చె దాని కవ్విభుండు దద్దయుఁ బ్రీతుఁడై | వత్సలత్వ గౌరవం బెలర్ప. |
521 |
| క. |
వేదవ్యాసుఁడ! రమ్మని | యాదరమునఁ బిలిచి నాకు నాత్మజుఁడై సం పాదించువాఁడ వధికా | హ్లాదము మన్వంతరంబు లన్నిటియందున్. |
522 |
| క. |
అని యానతిచ్చి మఱియును | జననంబులు నీకుఁ గల్గు సంయమిమాన్యా! యనియుఁ బలికి వెండియు ని | ట్లనియెను విష్ణుండు పేర్చు నర్మిలితోడన్. |
523 |
| క. |
‘నా చరితంబులుఁ ద్రైలో | క్యాచరణంబులును ధర్మ మఖిలంబు మదిం జూచి త్రికాలజ్ఞత్వస | మీచీనత వెలయు - మునులు మేటి యనంగన్. |
524 |
| క. |
ఉత్తరకాలంబున లో | కోత్తరుఁడు వసిష్ఠపౌత్రుఁ డుదితజ్ఞానో దాత్తుఁడు పరాశరుండను | నుత్తమసంయమికిఁ బుట్టు దుజ్జ్వలతేజా! |
525 |
| క. |
నీ వలనన కలిగి కురు | క్ష్మా వలయం బేలునట్టి జనపతు లన్యో న్యావిష్టరోషులై రణ | సేవనమునఁ గులము తఱచు సెఱుతురు వత్సా! |
526 |
| తే. |
కాలముల కీడు కతమునఁ గలఁగఁ బడిన | వేదముల నీవు నాఁడును విమలబుద్ధి నంచితవ్యాస మొందించి యఖిల దివిజ | మునిగణముల కొనర్తు సమ్మోద మనఘ! |
527 |
| తే. |
ధర్మసందేహములు నీవు నిర్మలంపు | వాక్యములఁ బాపి జగములవార లెల్ల నఖిల సంశయచ్ఛేత్త పుణ్యాత్మకుండు | లోకహితవాణి యనఁగ సుశ్లోకుఁ డగుదు. |
528 |
| క. |
రాగిత్వము విడువదు నిను, | రాగవిదూరుఁడగు సుతుఁడు ప్రభవించును నీ, కాగమ విధానబుద్ధియు | యోగము సాంఖ్యంబు మది సముదితంబు లగున్. |
529 |
| వ. | అని నిర్దేశించి నీవు నిజేచ్ఛం బ్రవర్తింపు మని పలికి యద్దేవుం డంతర్హితుం డయ్యె నిది మదీయ నారాయణసంభవత్వంబు తెఱం గేను యమనియమనిరూఢి నిర్మలతపఃకరణంబు చిరకాలం బాచరించి యప్పురుషోత్తము కారుణ్యంబు నామీఁద నంతకంతకు నెక్కుడగునట్లు సేసితి నని మద్గురుండును త్రికాల వేదియు నగు వేదవ్యాసుండు సెప్పె నని చెప్పి వైశంపాయనుండు జనమేజయునితో వెండియు నిట్లనియె. | 530 |
| సీ. |
అట్లు ధర్మజుఁడు నారాయణనారద | సంవాదకథ విన్న సమయమునను నారదుఁ డచ్యుతు కారుణ్య మమ్మెయిఁ | బడసి క్రమ్మఱి వచ్చి బదరికాశ్ర మమున నారాయణు మన్ననతోడి సం | భాషణంబును గాంచి పరమతపము దాఁ జేఁత యెఱిఁగించి తదనంతరంబ య | య్యమరమునీంద్రుఁ డే మడిగినట్ల |
|
| ఆ. |
యడుగ ధర్మనందనాదులుఁ గృష్ణుండు | వినఁగ మద్గురుం డతనికిఁ జెప్పె సురలు మోక్షధర్మపరులు గా కధ్వరా | యత్తచిత్తులైన యత్తెఱంగు. |
531 |
| వ. | ఇట్లు సెప్పి. | 532 |
| క. |
వేదవ్యాసుఁడు సుముఖత | నా దైవతమునికిఁ జెప్పె హయశిరుఁడగు దా మోదరుని దివ్యలీల స | మాదరమున ధర్మనందనాదులు వినఁగన్. |
533 |
| వ. | అని చెప్పి వెండియు. | 534 |
| క. |
నిజనామ నిర్వచనములు | విజయుం డడుగంగ నెల్లవియు నెఱిఁగించెం ద్రిజగద్భజనీయపదాం | బుజుఁ డగు కృష్ణుండు భరితపుణ్యచరిత్రా! |
535 |
| వ. | ఇ ట్లగుట ము న్నెఱింగించితి. | 536 |
| క. |
వేదాదులైన పథము ల | భేదప్రాప్యంబు లగుట ప్రియ మెసఁగఁగ న వ్వేదవ్యాసుఁడు సెప్పె స | మాదరమునఁ బార్థుఁ డడుగ నందఱు వినఁగన్. |
537 |
| క. |
ఏకాంతికధర్మము సు | శ్లోకుండగు నాతఁ డడుగ లోకోత్తర! యా లోకారాధ్యుఁడు సెప్పె ద | యాకరమతి కృష్ణధర్మజాదులు వినఁగన్. |
538 |
| క. |
దైవవశంబున నేఁడును | నీ వడుగఁగ నింతవట్టు నిస్సందేహం బై వఱలఁగ నేఁ జెప్పితిఁ | బావన మిది యసదృశంబు పౌరవముఖ్యా!’ |
539 |
| వ. | అని పలికి నారాయణ నారద సంవాదాదికంబైన యివ్వాఙ్మఙయం బంతయుం బేర్కొని. | 540 |
| క. |
నారాయణీయమగు నీ | సారాఖ్యానంబు వినినఁ జదివిన సంప త్తారోగ్యాయుస్సద్గతు | లేరికినైనం గురుక్షితీశ్వర! కలుగున్. |
541 |
| వ. | అనిన విని యత్యంతాహ్లాద భరితాంతఃకరణుం డయిన యక్కౌరవేంద్రుతో నమ్మునీంద్రుం డిట్లను నిట్లు సకలలోకసంభావనీయ సత్కథ లాకర్ణించి సముదీర్ణ సంప్రీతుండగు నప్పాండవాగ్రజుండు. | 542 |
| తే. |
అమరతటినీసుతున కిట్టు లనియె రాజ | ధర్మముఖ్యంబులగు సర్వధర్మముల ను దాత్తకృప నెఱిఁగించి తత్యుత్తమంపు | ధర్మమెయ్యది సెప్పుము ధర్మనిత్య! |
543 |
| వ. | అనుటయు నా దేవవ్రతుం డన్నరదేవోత్తమున కిట్లనియె. | 544 |
| చ. |
అరయఁగ ధర్మతంత్రములయందు నిరర్థములే దొకండు, నె వ్వరిమది యెందు వ్రాలెఁ దగ వారలు దానిని పూని యాచరిం తు, రదియ వారి కిష్టఫల దోహనకార్య మొనర్చు, నెల్లెడం బురుషులఁ జూడమే తమకుఁ బోలిన ధర్మములన్ వెలుంగఁగన్? |
545 |