పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
వైశంపాయనుఁడు జనమేజయున కేకాంతికధర్మ మెఱింగించుట (సం. 12-336-8)
క. నిర్మలమగు నేకాంతిక | ధర్మము నారాయణోదితంబై క్రియలం
గర్మఠుఁడగు బ్రహ్మమతిని | ధార్మికవర! యొలసె, నతఁడు దయ సిగురొత్తన్‌.
495
క. దక్షునకు నెఱింగించిన | దక్షుఁడు బోధించెఁ దనదు దౌహిత్రు జగ
చ్చక్షుని నా సవితృండు మ | నుక్షితిపతి కిచ్చె నవ్వినుతధర్మంబున్‌.
496
క. మను విక్ష్వాకున కొసఁగె న | తని వలనఁ దదీయ యోగ్యతా కలితులు స
జ్జనములు వడసి రనేకులు | విను నారాయణునిచేత విని నారదుఁడున్‌.
497
క. తగియెడు శిష్యుల కొసఁగెను | జగతీశ్వర! యిట్టు లది ప్రశస్తంబై యి
జ్జగములను గలిగె విను మ | య్యగాధ ధర్మంబు దుష్కృతాప్రాప్యమగున్‌.
498
క. దాని కహింసయ మూలము | దానన హరి ప్రీతుఁ డగు నతం డన ధరణీ
జానీ! క్షేత్రజ్ఞుం డనఁ | గా నొక్కఁడ యగుట దెలియఁగా వలయుఁ గడున్‌.
499
క. ఏకద్విత్రిచతుర్వ్యూ | హాకారతఁ దోఁచుచుండు హరి భక్తజనా
లోకమున వాసుదేవా | ద్యోకః ప్రాప్తముగఁ దత్తదుచితస్ఫూర్తిన్‌.
500
తే. వాసుదేవుండు ప్రథమంబు వసుమతీశ! | యోలి సంకర్షణుండుఁ బ్రద్యుమ్నుఁడును ద్వి
తీయకంబుఁ దృతీయంబుఁ దెల్ల మచ్చ | తుర్థ మనిరుద్ధుఁ డిట్లు చతుర్విధములు.
501
క. ఈ నెలవులఁ దోఁచును హరి | దా నొక్కఁడ; యింద్రియప్రతతి కందం; డే
కానూనభక్తి కగపడు; | దానికిఁ దపమును శమంబు దమమును వలయున్‌.
502
క. శాంతిపరినిష్ఠునకు నే | కాంతికధర్మంబు గరతలామలక మగుం
జింతాతంతుత్రుటనా | త్యంతవిదగ్ధంబు సూవె యది మనుజేంద్రా!
503
క. అనిన నతఁ ‘డిట్టి ధర్మముఁ | గొనియాడక వ్రతము లొండు గోరి నడపఁగాఁ
బని యేమి? యెఱింగింపుము | జనముల చందంబు నాకు సంయమివర్యా!’
504
క. అని యడిగిన వైశంపా | యనుఁ డతనికి నిట్టు లనియె ‘నది గల దధిపా!
విను సాత్త్వికమును రాజస | మును దామసమును వికారములు మానసముల్‌.
505
తే. వికృతు లందును సత్త్వస్థ విధము మేలు | దాన హరిఁ బొందవచ్చు నతండు నడపుఁ
దత్ప్రకారుల కుశలంపుఁ దంత్ర మెల్ల | వార లేకాంతికులు పెఱవారి వినుము.
506
క. కలగొన రాజసతామస | ము లయిన భావములు వికృతిఁ బొందింపఁగ మ
ర్త్యుల కేకాంతికవృత్తిని | నెలకొనఁగా నెట్లువచ్చు? నిర్మలధిషణా!
507
క. వారికిఁ బ్రవృత్తి లక్షణ | తారూఢంబైన ధర్మ మలవడు హరికిం
గారుణ్య పాత్రములు గా | రారయ వా రన్యపథసమాశ్రితు లగుటన్‌.
508
క. ఏకాంతికజనంబులు సు | శ్లోకుండగు హరిమనంబులో నుండుదు రా
లోకింప వారి కతనికి | నేకత్వము గలదు దెల్లమిది వేదములన్‌.
509
క. ఈ తెరువు మద్గురుఁడు సం | ప్రీతిని దయ నన్ను నాదరించుచుఁ జెప్పెం
జేతశ్శుద్ధికలనమెయి | వీతదురితమైన భంగి విన్నది యధిపా!
510
క. చాలిన నీవును హరి ని | ట్లాలోకింపుము నిరంతరానందశ్రీ
శాలివగు దనిన నా భూ | పాలోత్తముఁ డా తపస్విపతి కిట్లనియెన్‌.
511
తే. ‘వేదములు సాంఖ్యమును యోగవిధియుఁ బాశు | పతముఁ బాంచరాత్రంబు నా బహువిధములఁ
జెల్లు బోధసాధనముల కెల్ల నిష్ఠ | యొక్కటియొ? యివి భిన్ననిష్ఠోదితములొ?
512
వ. నా కెఱింగింపవే వీనికిఁ బ్రవర్తకు లెవ్వరు? వారలం జెప్పు’మని యడిగిన జనమేజయునకు వైశంపాయనుండు. 513
ఉ. ద్వీపమునం బ్రబోధపరిదీప్తుని వేదనిధానమున్‌ జగ
ద్వ్యా పకతేజు గంధవతియందుఁ బరాశరసంయమీశ్వరుం
డే పురుషోత్తముం బడసి యీడ్యతమోన్నతి నొందె లోకశి
క్షాపరు భారతాధ్యయన కారకుఁ గొల్చెద నమ్మహాత్మునిన్‌.
514
వ. అనుచుం గృష్ణద్వైపాయనధ్యానపరాయణుం డగుచుం బలికి యా భూవిభున కభిముఖుండై. 515
క. విను మీ తంత్రంబుల కె | ల్లను నరయ బరాయణం బలఘుతరసంవి
త్తనుఁడగు నారాయణుఁడ, య | తనిఁ బొందఁగ ఋజువులగు పథములివి యధిపా!
516
వ. వేదంబులకుం బ్రవర్తకుండు నారాయణనందనుం డపాంతరతముం డనుపేరం బ్రసిద్ధుండగు వేదవ్యాసుండు, సాంఖ్యంబునకుం గపిలుండును, యోగంబునకు హిరణ్యగర్భుండును, బాశుపతంబునకు శివుండును బాంచరాత్రంబునకు విష్ణుండును బ్రవర్తకులు. పాంచరాత్రంబు వైష్ణవం బనం బరఁగు’ ననిన విని యజ్జనపతి యమ్మునిపతితో ‘వేదవ్యాసుండు పరాశరపుత్రుండని చెప్పి తప్పరమమునికి నారాయణనందనత్వం బెట్లు వచ్చె? ననుటయు నతం డతని కిట్లనియె. 517
సీ. హిమవన్నగంబు పాదమున మహాభార | తం బొనర్చి పరిశ్రమంబు దోఁప
భావించి శిష్యులు గావించు పరిచర్యఁ | దద్వినోదనపరత్వమున నొంది
వారికి వేదార్ధభారతార్థంబులు | సాత్యవతేయుండు సదయబుద్ధి
నెఱిఁగించు చున్నట్టియెడ నేను లోనుగాఁ | గొందఱు దత్పాదవందనంబు
 
తే. భక్తిఁ జేసి నారాయణప్రభవుఁ డండ్రు | నిన్నుఁ గృపఁ జెప్పవే మాకు నిర్మలాత్మ!
యత్తెఱం గని యడిగిన నమ్మహాను | భావుఁ డత్యంతకరుణార్ద్రభావుఁ డగుచు.
518
వ. మాతోడ నిట్లనియె. 519
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )