పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
హయగ్రీవదేవ మాహాత్మ్యాభివర్ణనము (సం. 12-335-9,10)
వ. అనిన విని సవిశేష సమ్మదుండై జనమేజయుండు వైశంపాయనుతో ‘హయశిరోభాసితుం డగు విష్ణుండు వేధకు సన్నిహితుండయ్యె నని చెప్పితి వప్పురుషోత్తముం డప్పు డేమిటికై యా మూర్తి వహించె? నత్తెఱం గెఱింగింపు’ మని యడిగిన నమ్ముని య మ్మనుజపతి కిట్లనియె.. 478
సీ. ప్రళయకాలంబున జలముల విష్ణుండు | యోగనిద్రారతి నొంది మేలు
కాంచి లోకంబులు గావింపఁ దలఁప న | హంకార మెసఁగె బ్రహ్మాభిధాన
కలితమై తన్నాభికమలంబునం దిట్లు | జనియించి యా బ్రహ్మ సకలసృష్టి
కాదిభూతములుగ వేదముల్‌ నాలుగు | గలిగించె నప్పు డక్కమలనాభు
 
తే. నందు మును లయించినట్టి గుణంబులు | మూఁటఁ దొలుత సత్త్వమునకుఁ దోఁపు
కలిమి దాననుండెఁ గమలోద్భవుఁడు రజ | స్తమము లసురలయ్యె ధరణినాథ!
479
క. విను కైటభుండు నా మధు | వనఁ బేర్చిన యద్దురాత్ము లవ్వేదములం
గొని వేగ చని రసాతల | మున వైచిరి గాఢబంధములు సేసి నృపా!
480
వ. దాన నవ్వేధ విహ్వలించి. 481
క. ‘లావును దృష్టియు గతియును | నా వేదచయంబ నాకు నవి యడఁగిన నే
నేవిధి సృజింతు లోకము? | లే వాఁ డీ యెడరు తలఁగు నిం కెట్లొక్కో?’
482
వ. అని పలవించి. 483
ఆ. విష్ణు బహువిధముల వినుతింప నజ్జల | శాయి హయశిరంబు సకలవర్ణ
భాసురంబునైన పరమాద్భుతంపు రూ | పంబు దాల్చి వేదపరత నొంది.
484
క. పాతాళమునకుఁ జని యం | దాతతమై ప్రణవరూప మగు నాదం బు
ద్ద్యోతితము సేసె నది యా | దైతేయులు విని పటుప్రతాపం బెసఁగన్‌.
485
క. ఆ నాదము దెసకుం జన | దానవరిపుఁ డొండువలనఁ దా నరిగి తదీ
యానూనబంధపీడిత | లైన శ్రుతులు విడిచి తెచ్చి యజునకు నిచ్చెన్‌.
486
తే. ఇచ్చి యెప్పటి యట్ల యహీంద్రతల్ప | శయనుఁడై యుండె నటఁ దమ చనినచోట
నెవ్వరినిఁ గాన కా దైత్యు లెచట శ్రుతులు | దారు మును వెట్టి రందు సత్వరముగాఁగ.
487
ఆ. అరిగి యచట వాని నరసి కానక రభ | సమునఁ గలయఁ దిరిగి శార్‌ఙఙ్గిఁ గాంచి
యుద్ధమునకుఁ బిల్వ నద్ధరణీధరుం | డడరి సమయఁ జూచె నసురయుగము.
488
వ. ఇట్లు విష్టరశ్రవుండు సృషఙ్టకార్యంబు నిర్విఘ్నంబుఁ జేసిన విధాత యప్పని సునీతంబు సేసె నాఁటనుండియు హయశిరోమహితయగు నమ్మూర్తి దక్కిన మూర్తులకంటె నెక్కు డయ్యె నా జగత్కర్తను వేదంబులు నాశ్రయించియుండు’నని చెప్పి వెండియు. 489
క. ‘హరి సత్త్వాదిగుణంబులఁ | బొరిఁబొరిఁ గలిగింపఁ బెంపఁ బొలియింపఁగ భూ
వర! యవి యెక్కువఁ దక్కువఁ | బొరయుచుఁ బరివర్తనంబుఁ బొందుచునుండున్‌.
490
క. గుణవంతుఁడు గుణరహితుఁడు | గుణకల్పనతత్పరుండు గుణనాశననై
పుణశాలి గుణనిబద్ధుఁడు | గుణమోక్షణకరుఁడు శార్‌ఙ్గి కురుకులముఖ్యా!
491
క. విను నారాయణపరములు | జననాయక! వేదములును జన్నంబులుఁ ద
క్కిన పుణ్యసమారంభము | లును రసముఖగోచరంబులును భూతములున్‌.
492
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనుతో ‘నేకాంతికజనులు లోకోత్తరులని చెప్పి; తయ్యేకాంతికత్వం బెట్టిది? యెఱింగింపవే?’ యనుటయు నతం డతని కిట్లనియె. 493
ఆ. ‘సాంఖ్యయోగ పరమసారభూతం బిది | మున్ను వింటి యుద్ధమునకుఁ జొరక
కరుణ నార్ద్రుఁడైన గాండీవి బోధింపఁ | గృష్ణు చెప్పినట్టి గీత లందు.
494
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )