| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె న ట్లమరనదీనందనున కుదకకర్మం బాచరించి ధర్మనందనుండు ధృతరాష్ట్రపురస్సరంబుగ భాగీరథి యుత్తరించి తత్తీరదేశంబున. | 002 |
| ఉ. |
ఉమ్మలికంబునం బొగులు నుల్లముతోఁ బొరి లోచనంబులం గ్రమ్మఁగ నశ్రువారి ధృతిగౌరవ మేద మహోగ్ర బాణపా తమ్మున మ్రొగ్గు నేనుఁగు విధమ్మున నేలకు వ్రాలఁ బెట్టె వే గమ్మ వృకోదరుండు మురఘస్మరుపంపున నమ్మహీశ్వరున్. |
003 |
| ఆ. |
పట్టి యతఁడు దనదు పై చీర యాస్తర | ణంబు సేసి భూస్థలంబునందుఁ బెట్టె మానసములు పెద్దయు నలఁదురి | యర్జునాది సోదరాలి వొదివె. |
004 |
| వ. | కృష్ణుం డుచితవచనంబుల నా భూపాలుం బ్రబోధించె; నప్పుడు ధృతరాష్ట్రుండు గదిసి కూర్చుండియక్కురుపతితోడ. | 005 |
| సీ. |
‘క్షత్రధర్మంబునఁ గైకొంటి మేదిని | యుమ్మలికింపక లెమ్ము వత్స! యనుజవర్గము నీవు ననుభవింపుము శోక | కాలంబు గా దిది యేల వగవ?’ నని పల్కి ‘విదుర’ హితాలాపములు దన | విన కుండుటయు సుయోధనుని కీడు నద్దుష్టబుద్ధిఁ దా ననుసరింపఁగ ధర్మ | మెడలిన కతమున నింత పుట్టె’ |
|
| ఆ. |
ననియుఁ దెలియనాడి తనకు గాంధారికి | వగలు మిగులఁ బొగులవలయుటయును నుగ్గడించి ‘మమ్ము నొంటి వగ్గులఁ గనుం | గొనుము నంత దీర్పు’ మనయె నధిప! |
006 |
| వ. | అనిన విని యూరకున్నం గని శౌరి యక్కౌరవపతితో ‘బంధువులు శోకంబు నొందిన మృతకోటికిం బరితాపంబు వాటిల్లు; నట్లుంగాక భవదీయజ్ఞాతులు సమరంబున ననివర్తులై యూర్ధ్వలోక వర్తులైరి; వారికి శోకింపం బని యేమి? శోకించిన వారలు మగిడివత్తురే?’ యని పలికి వెండియు. | 007 |
| క. |
‘వినవలయు వాని నెల్లను | జననాయక! వింటి నీవు శాంతనవునిచే వనట యుడుగు; మిఁక దుర్మతి | యునుబోలెను వగచుచుండు టుచితమె నీకున్? |
008 |
| వ. | వ్యాసనారదాదులును నిన్ను బోధించిరి. వారి వాక్యంబు లూహింపుము. | 009 |
| చ. |
అతులిత దక్షిణాన్విత మహాధ్వరకర్తవు గమ్ము, దేవతా పితృనివహంబులం గరము ప్రీతియు భక్తియు నుల్లసిల్ల న ర్చితములు సేయు, ముర్విఁ బ్రజఁ జేకొని రక్ష ఘటింపు, బంధు సు స్థితు లొనరింపు, మెపు నతిథివ్రతపూజ లొనర్పు భూవరా!’ |
010 |
| వ. | అనిన విని ధర్మనందనుండు సాత్యవతేయు మొగంబు గనుంగొని ‘దేవా! భవదీయ దయాప్రేమంబులు నాపై’ నెప్పుడు నత్యంత గాఢంబులై యుండు; నన్నుఁ బెక్కుభంగుల రక్షించితి; రిట మీఁద వనంబున కరుగ ననుజ్ఞ యిచ్చుట నాకుం బ్రియం; బరుగనియట్లయినం బితామహకర్ణులం జంపించిన క్రూరకర్మునకు శాంతి యెట్లుగలుగు? నమ్మహాకల్మషం బేమిటం బాయు? నయ్యనుష్ఠానంబు విధియింపుం’డని పలుకుటయు నా ధర్మధుర్యునకుఁ బారాశర్యుం డిట్లనియె. | 011 |
| సీ. |
‘నిష్ఠించి యిబ్భంగి నీ కేము చెప్పిన | వాక్యంబు లెల్లను వరదఁ గలిసి పోయెనే? నీ దగు బుద్ధి యిం తొప్పదో | కాక మర్తు ంండు గాఁడు కర్త యీశ్వ రు నియోగమున మేలును గీడు నొనరించుఁ | గాన నీ మదిఁ బాపకర్మ శంక గలిగె నేనియును యాగముల దానంబుల | నది వాపికొనరాదె? యశ్వమేధ |
|
| తే. |
మధికదక్షిణాన్వితముగ ననఘ | చేయు; | మంతతో భవదీయచిత్తానుతాప మంతయును బాయు; రఘురాము నట్లు పూరు | భరతులును బోలె దానతత్పరుఁడ వగుము.’ |
012 |
| చ. |
అన విని యమ్మునీశ్వరున కా నృపుఁ డిట్లను ‘నశ్వమేధయా గనిరతి భూమిపాలు గతకల్మషుఁ జేయఁగ జాలు నాఁగ ము న్నును వెడ వింటి సజ్జన! మనోజ్ఞ వచోమహనీయ! నీవు చె ప్పిన పలు కూఁది యా క్రతువు ప్రీతి నొనర్చెద నెల్లభంగులన్. |
013 |
| వ. | అని పలికి ‘మునీంద్రా! యొక్క విన్నపం బవధానంబుతో నవధరింపు; మశ్వమేధం బధికదక్షిణాన్వితంబుగావలయు ననుట దెల్లంబుగా మీరు నానతిచ్చితిరి; నా కర్థంబు లేదు; కయ్యంబున మృతులయిన నరపతుల సతులు శిశువులును శోకాక్రాంతులునుం గావున వారలవలన ధనాహరణం బత్యంతాకరణీయంబును దుర్లభంబును నైనది; తొల్లి దుర్యోధనుండు మాతోడి యీసునం జేసి పెక్కండ్రు రాజులను మ్రుక్కడి మూకలనుం గూడఁ బెట్టి ధనంబు వ్యయపెట్టి భూమియు బండారంబునుం బాడు చేసె; నివ్విధంబున నిర్ధనత్వంబు వాటిల్లె; ధనార్జనంబునకు నొండొక వెరవు దొరకొన దిట్టిది కర్తవ్యం బని యెఱుంగకున్నవాఁడ; మంత్రలరై నాకుఁ గార్యం బెఱింగింపవలయు’ నని ప్రార్థించిన నమ్మహాత్ముం డమ్మహీపతిం బరమాదరంబున నాలోకించి కొండొక విచారించి. | 014 |
| సీ. |
‘అనఘ! మరుత్తుండు యజ్ఞంబు సేసి మ | హాధనరాసుల నవనిసురుల కిచ్చె; వా రవి కడు నెక్కుడై యుండుటఁ | ద్రవ్వితండంబులు దమ గృహముల నిడికొని పెఱధన మెల్లను నిధియుఁగా | నిమ్మైన నెలవున నిడుచు నుండి యందఱు నేకవాక్యత దీని నెవ్వరు | గనినను నిది వారి ధనమ యనిరి |
|
| ఆ. |
మానవేంద్ర! యమ్మహానిధానము దెచ్చి | వలసినట్లు నీవు వ్యయము సేయు మనిన ధర్మతనయుఁ ‘డతఁ డె ట్లుపార్జించె | నంత కాంచనము? మహాత్మ! చెపుమ.’ |
015 |
| క. |
అనుటయు నా సత్యవతీ | తనయుండు ‘మరుత్తు పుణ్యతరచరితంబున్ వినఁ గోరుట మే లెంతయు; | వినిపించెద వీను లలర వినుము నరేంద్రా! |
016 |
| వ. | అని పలికి యిట్లనియెఁ ‘గృతయుగంబున దండనీతి ప్రవర్తకుం డగు మనువునకుఁ బ్రజాని యను తనయుం డుదయించె; నతనికి క్షుతుం డుద్భవించె; నాతనికి నిక్ష్వాకుండు ప్రభవించె; నా భూపతికి నూర్వురు సుతు లుదయించి; రం దగ్రజుండగు వింశునకు వివింశుం డుదయించె; నప్పుడమిఱేనికిం బదియేవురు గొడుకులు పుట్టిరి; వారిలోనం బెద్దవాఁ డగు ఖనీనేత్రుం డధికబలశౌర్యుండును నకార్యపరుండును నై సోదరులం గలిసికొని నడవక పదునలువురం జెఱచి సామ్రాజ్యంబుఁ గైకొని యుండి.’ | 017 |
| సీ. |
మంత్రివిద్వేషంబు మాన్యపరాభవం | బును బ్రజాపీడనంబులును గలిగి మొక్కలీఁ డగుటయు మ్రుచ్చిలి మంత్రు లా | తనిఁ బాపి యతని నందనుని రాజ్య మునకుఁ బట్టము గట్టికొని; రక్కుమారుండు | దమ యయ్య చేటు చిత్తమునకుఁ దలఁచి సచివప్రభృతు లగు సర్వజనంబుల | యాత్మల ననురాగ మావహిల్ల |
|
| తే. |
సత్యమును బాడియును నొప్పి నిత్యధర్మ | పరత వర్తిల్లె నమ్మహీశ్వరుఁడు సతత దానతత్పరుఁడై కల ధనములెల్లఁ | విప్రులకు నిచ్చి దారిద్ర్యవికలుఁ డయ్యె. |
018 |
| క. |
దానఁ గడు డస్సె నాతని | సేన; యరాతు లది యెఱిఁగి చెచ్చెర బలసం తానముతోడం బైకొని | యా నరపతిఁ జెఱిచి; రాతఁ డాప్తులుఁ దానున్. |
019 |
| క. |
వనమునకు నేఁగె; సంయమి | జనములు నచ్చెరువు నొందు చందంబున న జ్జనవిభుఁడు నియతి నట తప | మొనరించి మహాప్రభావ మొంది కడంకన్. |
020 |
| క. |
అమలమతిఁ గరముఁ గోలఁగ | నమరిచి మానితతపోమయాధికశక్తిన్ దమన క్రియ యొనరించిన | నమితగుణా! చెప్పఁ జిట్టలయ్యెను దానన్. |
021 |
| వ. | ఆకర్ణింపుము. | 022 |
| క. |
భటతురగసామజరథో | ద్భట సేనాసముదయములు బహుళరుచిసము త్కటకాంచన రాసులు న | చ్చటఁ బొడమెం జూడ నక్కజం బగు భంగిన్. |
023 |
| వ. | ఇట్లు బలంబును ధనంబును గల్గుటయును. | 024 |
| క. |
ఆ నరపతి రయమున రిపు | భూనాథులమీఁద నడచి పోరుల వారిన్ సేనాయుతముగఁ జంపియుఁ | గానలకుం దోలియును బ్రకాశత నొందెన్. |
025 |
| క. |
కరదమనంబున నాతఁడు | కరంధముఁ డనంగఁ బరఁగి గౌరవమున వి స్ఫురణము విభవము శౌర్యముఁ | గరుణయు ధైర్యంబు వెలయఁగా నిల యేలెన్. |
026 |
| తే. |
శమము దమమును సత్యశౌచములుఁ గలిగి | యజనశీలత నశ్వమేధాధ్వరంబు లంగిరసుఁ డుపదర్శకుండై నయింపఁ | బెక్కొనర్చె లోకములు సంప్రీతిఁ బొగడ. |
027 |