పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము
వేదవ్యాస మునీంద్రుండు ధర్మజునకు మరుత్తుని చరితంబు సెప్పుట (సం. 14-4-23)
క. అతని మనుమఁడు మరుత్తుం | డతులయశుఁడు విష్ణుసదృశుఁ డనఁ దగు నాగా
యుతబలుఁడు ధర్మతత్త్వ | స్థితివిదుఁడు సమిద్ధబహుళతేజుం డధిపా!
028
ఉ. అమ్మనుజేశ్వరుండు విభవాతిశయంబు వెలుంగ నశ్వమే
ధమ్మొనరించుచుండి వివిధస్ఫురితాలయముల్‌ ప్రదీప్తభాం
డమ్ములు సత్పదార్థము లిడం దగు తక్కును గల్గు సిద్ధపా
త్రమ్ము లసంఖ్యముల్‌ పసిఁడిఁ బ్రస్తుతి కెక్క ఘటించె భూవరా!
029
వ. అట్లు సమకట్టి యతండు. 030
చ. హిమగిరిసానుదేశమున నెక్కుడు వైభవ ముల్లసిల్ల య
జ్ఞము తగఁ జేసి భూమిసురసంఘము లెల్లను దృప్తిఁ బొంద హే
మ మొసఁగెఁ గుప్పఁ గూరలు సమగ్రకుతూహలుఁడై కనత్సువ
ర్ణమయగృహక్రియోపకరణప్రకరంబులు నిచ్చె భక్తితోన్‌.’
031
వ. అని చెప్పి ‘యిది మరుత్తుని యాభిజాత్యంబును దదీయవిత్తవిశేషంబును నెఱింగించుట; యవ్విత్తం బతనికి దొరకొనిన తెఱంగును నెఱింగించెదఁ; దదంచిత క్రతుక్రియాప్రకారంబునుం జెప్పెద విను; మట్లు కరంధముఁ డనం బరఁగి మనువంశదీపకుండై పేర్చిన యా భూపతి నిజ తపఃప్రభావంబున మహానుభావుం డగునంగిరసుండు దన కుపద్రష్టయయి యనే కాశ్వమేధంబులు సేయించుటం జేసి యావహిల్లిన మాహాత్మ్యంబునను మహీపతు లెల్లఁ గొలువం బూజ్యసామ్రాజ్యం బనుభవించి తన వలచిన యప్పుడ తనువుతోడన యూర్ధ్వలోకంబునకుం జనియె; నమ్మనుజపతితనయుం డవిక్షిన్నామధేయుండు ధరాభార ధౌరేయుండై యతనిన పోలి ప్రజలం బాలించె. 032
చ. అతని సుతుండు సూవె మనుజాధిపసత్తమ! యమ్మహాత్ముఁ డా
పతి తన తండ్రి పిమ్మటఁ గృపారతుఁ డార్యుఁడు దండనీతి వి
శ్రుతమతి దానశీలుఁ డన రూఢికి నెక్కి తదీయరాజ్య సు
స్థితి వెలుఁగొందె వాసవునిఁ జీరికిఁ జేకొనఁ డీసు పెంపునన్‌.
033
క. వాసవుఁడును నవ్విభునెడ | నీసు గలిగి తన్ను మిగులనీనని తచ్చిం
తాసక్తుండై మంత్రి ని | వాసమునకుఁ జనియెఁ బూరువంశప్రవరా!
034
వ. చని యతనితోడ. 035
సీ. ‘అనఘ! మరుత్తుండు నిను వరింపఁ దలంచుఁ | దన యజ్ఞమున కుపద్రష్ట గాఁగ
నమరాధిపతి యగు నట్టి నాకును జేసి | యుపదర్శనం బింక నొక్క మర్త్యు
నకుఁ జేఁత నీ పెంపునకు హాని గాదె! నన్‌ | విడిచి యాతని యజ్ఞవిధులు నడపుఁ;
డాతనిఁ దొఱఁగి మదాప్తత మెఱయు పె | క్కాడంగ నేటికి?’ ననుడు నతని
 
తే. పలుకులకు నవ్వి యా బృహస్పతి ‘మహాత్మ! | యెఱుఁగనే నిన్ను? నన్ను నీ వింత సెప్ప
నేల! సర్వలోకముల కధీశుఁ డైన | నీ గురుం డొరు నాసించునే మహేంద్ర!’
036
వ. అని వెండియు. 037
ఆ. ‘అగ్ని చల్లనైన, నబ్జమిత్రుఁడు మైల | పడ్డ, నుర్వి వొరలఁబడిన, మేరు
నగము సంచలించినను బొంకు వొరయునే? | నాదు పలుకు నెమ్మనమున నమ్ము!’
038
క. అన విని ప్రమదంబునఁ దే | లిన చిత్తముతోడ సమదలీలం జనియెం
దన మందిరంబునకు సుర | లనురాగముఁ బొంద నింద్రుఁ డమలచరిత్రా!
039
సీ. అది యంతయును విని యమ్మరుత్తుఁడు త్రిద | శాచార్యు కడ కేఁగి యతనితోడ
‘నీకు నెఱింగించి నీ పంపునన యేను | సంభారముల నెల్ల సంఘటించి
యజ్ఞాచరణమున కమరియున్నాఁడ నీ | వుపదర్శనంబు సేయుటకు రమ్ము’
నావుడు ‘నింద్రుండు ననుఁ దన యాగము | నకు మున్న వరియించినాఁడు; నాకు
 
తే. నెట్లు రావచ్చు?’ ననియె నా యింద్రమంత్రి | యట్లు పలికిన ‘మా తాత కనఘ! నీదు
తండ్రి సంప్రీతితో నుపద్రష్ట యయ్యె; | నట్ల కృపసేయు’ మని పల్కె నవ్విభుండు.
040
చ. విని ధిషణుం డమర్త్యులకు విన్నను వొప్పఁ గ్రతుప్రయోగముల్‌
మనము దలిర్పఁగా నడపి మర్త్యుని యాగము నొజ్జఁ గాఁగఁ జా
ల నిది నిజంబ యింక ననులాప మొనర్పక పొమ్ము వేఱ యొ
క్కని నుపదర్శనంబునకుఁ గైకొను మారసి నీవు’ నావుడున్‌.
041
వ. అజ్జనపతి లజ్జతుండై మగిడి వచ్చి యెదుర నారదుం గని వినయం బెసంగ వినతుండై నిలిచిన నమ్ముని యతనిం గనుంగొని ‘యెటవోయి వచ్చె? దేల విన్ననై యున్నవా’డవు? నీ తెఱం గెఱింగింపు; మెవ్విధంబుననైన నీ విషాదంబు మాన్చెద’ ననుటయు నమ్మనుజవరుండు ‘మదీయాధ్వరంబునకు నాంగిరసు నుపాధ్యాయుంగా వరియింపం బోయితి; నద్దేవగురుండు నన్ను దూషించి పరిత్యజించె; నింక నేటి బ్రదు? ‘కని పలికిన నప్పరమ సంయమి యప్పుడమిఱేనితో ‘బృహస్పతి నిన్నొల్లకున్ననేమి? యంగిరసుని పిన్నకొడుకు సంవర్తుండాధిషణు చేత ధిక్కరింపంబడి సకలంబును విడిచి వెడలి వైరాగ్యంబు పెంపున దిగంబరుఁ డయి తిరుగుచున్నవాఁడతని పాలికి నరుగు; మమ్మహాత్ముండు భవన్మఖంబునకు నుపదర్శనం బాచరించు’ ననవుడు సంతసిల్లి యా భూవరుం డిట్లనియె. 042
క. ‘మునివర! బ్రదికితి సంవ | ర్తుని నెచ్చటఁ గాంతు? నెప్పరుసునం దగ నా
డిన నతఁడు ద్రోపు సేయక | ననుఁ గైకొను? నెఱుఁగఁ జెప్పు నాకుం గరుణన్‌.’
043
వ. అని ప్రార్థించిన యప్పార్థివోత్తమునకు నత్తపోధనసత్తముం డిట్లనియె. 044
సీ. ‘భూపాల! యతఁడు కాశీపురిఁ బాయక | వర్తించు నున్మత్తవర్తనమున;
నతని నెఱింగెడు నట్టి యుపాయంబు | వినుము పురద్వారమున శవంబు
నిడికొని నీ వుండు మేతెంచి చూచి ని | వర్తించు వాని సంవర్తుఁ గాఁగ
నెఱుఁగుము; మరలి యట్లేఁగంగ వెనుకన | పొమ్ము నిశ్చలభక్తిపూర్వకముగ
 
ఆ. నెచట నైన నీకు నేకాంత మొదవిన | శరణు సొరుము వినయభరితవృత్తి
నాదు గుఱుతు సెప్పినారెవ్వ రనినను | జెంద నారదుండు సెప్పె ననుము.
045
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )