పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము
మరుత్తుఁడు సంవర్తునిఁ దన యజ్ఞమున కుపద్రష్టఁగా వరియించుట (సం. 14-6-27)
సీ. ఇప్పుడు నారదుం డెందున్న వాఁడని | యడిగినయట్లైన నతఁడు నాకు
ని న్నెఱింగించి యగ్నిప్రవేశము సేసె | ననుము శంకింపక’ యనుడు నమ్మ
హీపతి వారాణసీపురంబున కేఁగి | దిక్కుమాలిన పీనుఁ గొక్కచోటఁ
బడియున్నఁ గని దానిఁ బట్టించుకొని పుర | ద్వారప్రదేశంబు సేర నరిగి
 
తే. యచట నక్కుణపము నిడి యంతనంత | వేచికొని యుండఁగా నొక్క వెఱ్ఱివాఁడు
వచ్చి శవముఁ గనుంగొని వాటువడ్డ | పసరమును బోలెఁ గ్రమ్మఱి పాఱుటయును.
046
వ. వాని సంవర్తుంగా నెఱింగి యజ్జనపతి యాతని పజ్జన చనంజన నతండు మరలిచూచి పై ధూళి సల్లియు నుమిసియు వేఁదుఱుచందంబు భావింప నా భూవల్లభుండు. 047
క. వినయముతోఁ గేల్‌ మొగుచుచు | ననుగమనం బుడుగ కరుగ నాతండును ని
ర్జనమగు ప్రదేశమునకుం | జని యొక వటవిటపి నీడఁ జదికిలఁ బడియెన్‌.
048
వ. డప్పి భావించుకొని యమ్మహాత్ముం డట్లు గూర్చుండుటయు. 049
సీ. ఆ రాజు సేరి సాష్టాంగప్రణామంబు | సేసి నిల్చిన ‘ననుఁ జెప్పి నిన్ను
ననఘ! పుత్తెంచిన యతని పే రెఱిఁగింపు | నిజమైన సిద్ధించు నీ మనోర
థంబు; బొంకగు నేనిఁ దల యేడు వ్రయ్యలై | పడు’ దని యమ్ముని పలుకుటయును
నారదుఁ డెఱిఁగించె నాకు మి‘మ్మని నిజ | మాడిన సంవర్తుఁ ‘డాతఁ డెచట
 
తే. నేమి తెఱంగున నున్నవాఁ డెఱుంగవలయుఁ | జెప్పు’ మనుడు ‘మీ తెఱఁగెల్లఁ జెప్పి నన్ను
నిందుఁ బుత్తెంచు నపుడ యయ్యీడ్యధర్మ | పరుఁడు సొదఁ జొచ్చె’ నని చెప్పి నరవరుండు.
050
వ. చెప్పిన నప్పరమముని యప్పుడమిఱేని యాననం బాలోకించి, 051
క. ‘ననుఁ గానఁగ నీ వచ్చిన | పని యెయ్యది?’ యనిన నృపతి ‘నా యజ్ఞం
బునకుఁ గృప మీర లుపద | ర్శనముం జేయంగ వలయు సంయమినాథా!
052
వ. ఏను మరుత్తుం డనువాఁడ భవదీయజనకుం డుపాధ్యాయుండు గాఁ గ్రతుకర్తయైన కరంధముని పాత్రుండ’ ననుటయు సంవర్తుండు సంప్రీతి నాతనితో ‘నీవు నీ కార్యంబు నాకుం జెప్పితి; నా తెఱంగు వినుము; మా యన్న యగు బృహస్పతి దన తపోబలంబున నన్ను నవమానించిన మదీయ గృహధనాది వస్తువు లెల్లను విడిచి యిట్లు దిరిగెద; నను బోఁటి పేద నీ కుపద్రష్ట యైన నయ్యెడు పెంపునుం గలదె? యమ్మహాత్ము నీవు పరియింపు మట్లుగాక యేన కావలయు నను తలంపు గలదేని. 053
ఆ. అన్న నాకు మాన్యుఁ డాతండు వనుపంగ | నాచరింతు నీదు యాగమునకు
నొజ్జతనము వేగ మర్వీశ! యగ్గురుఁ | గని యనుజ్ఞ వడయు’ మనిన విభుఁడు.
054
సీ. ‘ఆతని కడకు ము న్నరిగితిఁ గృప పుట్టఁ | బలికితి; నతఁడు నా పలుకు సరకు
గొనక యమర్త్యయాజనము ననుష్ఠించు | నేను మర్త్యుని యొజ్జ నేల యగుదు?
ననియె నాతోడి యీసున వాసవుఁడు గురు | నుడిపిన కతమునఁ గడఁగి గురుఁడు
నను ధిక్కరించె నింకనఘ! యందేమని | పోదు? మీ మాహాత్మ్యమునను వాస
 
ఆ. వుని నతిక్రమింతు వని నమ్మి యున్నాఁడ; | గైకొనంగవలయుఁ గరుణ వెలయ’
ననిన మునియు ‘నట్ల యయ్యెడుఁగా’ కని | పలికె మఱియు నా నృపాలుతోడ.
055
తే. ‘అయ్యెడుం గాక యిపుడు నీ’ కనుచు ‘నీవు | సంచలించిన యప్పుడు శాప మిత్తు
నీకుఁ గీడును బాటిల్లు నింత దలఁచి | సుస్థిరుండవు గావలె సుజనవర్య!
056
వ. ఏను నీ యధ్వరంబున కుపదర్శనంబు సేయుచుండ నద్దివస్పతియు బృహస్పతియుఁ బ్రద్వేషించి రోషంబు వాటింతురు; దానికి నులికి నీవు సంచలించిన మదీయ శాపంబునం గీడు వచ్చు; నింత దలంచి సుస్థిర నిశ్చయుండవు గావలయు విచారించుకొ’ మ్మనిన నమ్మహనీయుతో నమ్మహీనాథుండు. 057
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )