| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
అవని యెల్లను వృత్రుఁ డాక్రమించి తదీయ | గుణమగు గంధంబు గొనిన వజ్రి వానిపై వజ్రంబు వైనఁ గ్రమంబున | నంబుతేజః పవనాంబరముల యందుఁ బ్రవేశించి యందుల రసరూప | సంస్పర్శశబ్దముల్ చండవిక్ర ముండైన యతఁడు సముద్ధతిఁ గొనఁగొనఁ | దొడ్తోడ నమ్మహేంద్రుండు గులిశ |
|
| ఆ. |
నిహతి వెలువరింప నిర్భరవేగుఁడై | యతనిలోను సొచ్చె నసుర దాన మూర్ఛ వోయె దివిజముఖ్యుండు బోధితుఁ | జేసె మంత్రవిధి వసిష్ఠుఁ డతని. |
112 |
| వ. | ఇట్లు వసిష్ఠప్రయుక్త మంత్రశక్తిం బ్రబుద్ధుండైన వృద్ధశ్రవుండు శరీరాంతర్గతుం డైన వృత్రు సదృశంబైన వజ్రంబున వధియించె; నవ్వాసవుం డీ ధర్మరహస్యంబు తెఱంగు మునుల కెఱింగించె; మునులు నాకుం జెప్పెరి; మానవేశ్వర! దీని నీవు దెలిసికొను’ మని పలికి యప్పాండవాగ్రజునితో నప్పుండరీకాక్షుండు వెండియు నిట్లనియె. | 113 |
| సీ. |
‘శారీరమును మానసంబును నా రెండు | దెఱఁగులై వ్యాధి వర్తించు; నందు విను వాతమును బిత్తమును సమ | త్వంబుఁ బొందిన యప్డు స్వస్థుఁ డగు న రుం; డవి మూఁట నొక్కండైన వికృతి నొం | దిన శరీరవ్యాధి యనఁగ బరఁగు; సత్త్వరజస్తమస్సమత సుస్థితి; విష | మత మనోవ్యాధి; యీ ద్వితయమునకు |
|
| ఆ. |
నొంటి దోఁచు టెపుడు నొదవ; దన్యోన్య సం | జనకజన్యభావసత్తఁ జేసి వికృతికాల మొకట నొకటి దోఁచునది వా | తాదులందు గుణములందు నధిప! |
114 |
| వ. | ఇది సూక్ష్మకర్మానుష్ఠానప్రకారంబు, దీని నీ వలవరింపవు గావునం గర్మానుష్ఠానంబును నిర్మలంబుగా నడపం బడ దంటి’ నని పలికి మఱియును. | 115 |
| క. |
వాతాదులందు గుణములు | నీ తెరువునఁ దక్కు వగుట యెక్కు డగుట నీ చేతఃప్రసక్తిఁ దోఁచి నృ | పా! తెలియఁగవలయు సమత పరశాంతికినై. |
116 |
| సీ. |
అమ్మెయి ‘గాక వాతాదులు సత్త్వము | ఖ్యములును దివిచిన గలఁగు దేని నది నీ స్వభావ మేమనఁగల? దింకను | జెప్పెద నవధాన మొప్ప వినుము సభ కేకవస్త్ర రజస్వలఁ బాంచాలిఁ | గొని రాక మఱవు కాననములోన నిడుమలు గడుచుట నెడ్డ్దఁ బెట్టకు జటా | సుర సైంధవాదుల దురితకృతులు |
|
| తే. |
తలఁపకుము మాత్స్యపురమున దైన్యపడుట | బుద్ధి సేయకు భీష్మాది యుద్ధతంత్ర మారయంగ యుద్ధంబు గా దందుఁ బుట్టు | కీడు మే లేమియును జిత్తగింపకుండు. |
117 |
| వ. | దాని నెట్లు యుద్ధంబు గాదనియె దంటేని నది మిథ్యాయుద్ధంబు సత్యయుద్ధం బాకర్ణింపుము. | 118 |
| ఉ. |
అమ్మెయి బంధుమిత్రుల సహాయత కల్మి ప్రయోజనంబు లే; దమ్మహనీయయుద్ధమున కాత్మయ తోడు, మనంబు శత్రుఁ; డీ వెమ్మెయి నైన శాంతి ఘటియింపుము లోపగఁ దీర్పు మెందు శాం తమ్మ చుమీ మనోజయము దాన వెలుంగుము శాంతబుద్ధివై. |
119 |
| తే. |
అంతరం బగు నిక్కయ్య మధిప! గెలువ | కిట్ల యేగతిఁ బోయెదో యెఱుఁగ దీని నీవ కనికొని సద్బుద్ధి నిశ్చయ ప్ర | వీణుఁడవు గమ్ము మాటలు వేయు నేల? |
120 |
| వ. | అని చెప్పి కౌంతేయాగ్రజునితోఁ గృష్ణుండు వెండియు నిట్లను ‘రెండక్షరంబులుమృత్యువు. మూడక్షరంబులు బ్రహ్మంబని యెయ్యవి యంటేని వినుము ‘మమ’ యను నవియును ‘న మమ’ యను నవియును నై యుండు భూతలంబుల చేతం గానంబడక యా బ్రహ్మమృత్యువులు పోరుచుండు. | 121 |
| క. |
తత్త్వ మనశ్వర మశరీ | రత్వంబునఁ బరఁగు భూతరాశి నియతనా శిత్వంబు హింసకత్వము | దాత్త్వికమై లేదు దేహదళమునను నృపా! |
122 |
| క. |
శరధిపరివేష్టిత క్షితిఁ | బరిపాలించినను దానిపై దృఢమమతం బొరయక వర్తించిన న | ప్పురుషుని దురితంబు లెట్లు వొందఁగ నేర్చున్? |
123 |
| క. |
వనమున వన్యాహారం | బున వర్తించినఁ బదార్థములపై మమతన్ మనమున విడ కుండిన న | మ్మనుజుఁడు మృత్యుముఖవర్తి మనుజాధీశా! |
124 |
| క. |
వెలి పగఱ గెలుపు గెలుపే? | యలఘుమతిన్ గెలువవలయు నభ్యంతర శ త్రులఁ దద్విజయము మోక్షము | నలవఱుపం జాలు నొంట నమ్మేలగునే? |
125 |
| క. |
విను మంతశ్శత్రులలో | ఘనుఁడగుఁ గాముఁడు నిరస్తకామం బగు వ ర్తనము విరల మధ్యయన య | జనదానంబులును గామసహితములు గదా! |
126 |
| వ. | ఇవ్విషయంబునం గామగీత లను వాక్యంబులు గలవు. వాని నాకర్ణింపుము. కాముండు లోకంబు నుద్దేశించి యిట్లనియె. | 127 |
| క. |
‘అనపాయుం డగు నెవ్వం | డును నను బాధింపఁ జాలఁడు ప్రయత్నము సా ధన మగునె వేదవేద్యుం | డనయి పరఁగుచున్న నా యెడను విహతికినై. |
128 |
| క. |
ధృతి నెవ్వఁడు నన్నుం బ్రవి | హతుఁ జేయఁగఁ జూచు భావ మగుదు నతని; కే నతఁ డది యెఱుఁగఁడు గాన వి | హతి బొంకై పోవఁగా జయము లేకుండున్. |
129 |
| క. |
ననుఁ దపమునఁ బ్రహరించెద | నని యెవ్వఁడు దొడఁగు నతని కా తపము ఫలం బున దెసఁ గోరికనై యే | జనియింతుం; జెఱుపఁగా వశమె యెవ్వనికిన్? |
130 |
| క. |
నను మోక్ష మూఁది చెఱిచెద | నని యెవ్వఁడు దలఁచు వానియందే మోక్షా ర్థనమై యునికి నవధ్యుఁడ | సనాతనుఁడ ద్రోవ నొకఁడఁ జాలఁడు నన్నున్.’ |
131 |
| క. |
‘అని యివ్విధమునఁ గాముఁడు | దనుఁ జెఱుపఁగరామిఁ జెప్పు తలఁపొందినఁ జె ప్పిన భంగి నెదను దోఁచెను | విను మవధానమునఁ బాండవేయప్రవరా! |
132 |
| చ. |
పనివడి పూఁచి పట్టమి సుబంధురదైర్యము నిర్వహింతు నే ననుమతి సొన్పకుండుట సమగ్రతపంబున తత్ఫలేచ్ఛ లే కునికి విమోక్షతృష్ణభర మొందమి కాము నడంచుఁ గాన ని య్యనువులు లేమి సువ్వె యనపాయతగా నతఁ డాడె భూవరా! |
133 |
| క. |
విను పెక్కులేల? కోరిక | మనమునఁ జొరనీకయున్న మడియుం గాముం డనపద్య! యశ్వమేధం | బొనరింపుము గోరకుండు మొక్కటియు మదిన్. |
134 |
| ఆ. |
అశ్వమేధమఖమునం డట్ల యనఘ! య | లోలుపత్వగుణవిశాలబుద్ధి శాలివై ఫలాభిసంధి లే కక్కాము | ధర్ముఁగాఁ బొనర్పు ధర్మతనయ! |
135 |
| క. |
చచ్చిన బంధులఁ గొని రా | వచ్చునె? తలఁపకుము నీవు వారిం; గ్రతువుల్ విచ్చలవిడిఁ జేయుము నిను | మెచ్చు జగంబు సమకూరు మీఁద సుగతియున్.’ |
136 |
| వ. | అని యిట్లు కృష్ణుండు సెప్పెఁ; బారాశర్యుండు బోధించె; దేవస్థానుండు నారదుండును హితవచనంబు లుపదేశించిరి. భీమాదులు నలువురును ద్రౌపదియును దగిన మాటలు సెప్పిరి. శాస్త్రతచక్షుర్మహితులైన మహీసురులు యోగ్యవచనంబు లుపన్యసించి; రివ్విధంబున నందఱ వాక్యంబులు నాకర్ణించి, శోకంబు విడిచి, యా భూకాంతుండు ధరణీపాలనాధ్వరకర్మంబుల కియ్యకొని యశుచిత్వనివృత్తికై గంగాతీరంబునఁ గొన్ని దినంబులు నిలుచువాఁ డయి మునివర్గంబునకుఁ బ్రదక్షిణంబును బ్రణామంబునుం జేసి. | 137 |
| క. |
‘మీ కారుణ్యంబున నా | శోకం బంతయును బాసె సుమనస్కత సు శ్లోకాత్ములార! కలిగెన్ | నాకున్ విచ్చేయుఁ డింక నను మఱవకుఁడీ.’ |
138 |