వ్యాసనారదాది మునులు ధర్మజు వీడ్కొని స్వస్థానములకుఁ బోవుట (సం. 14-14-8)
| వ. |
అని పలికి, విశేషించి వేదవ్యాసమునివరుపాదంబుల కెఱంగి ‘భవత్ప్రసాదంబునం గందువ గనిన కనకమ్ము మిమ్ముంబురస్కరించుకొనిపోయి చేకొనంగలవాఁడ; నప్పటికి సన్నిధిసేయవలయు; నప్పెన్నిధికినాశ్రయంబైన హిమగిరి మహీధరంబులలోన నెల్లను బరమాశ్చర్యనిధి యని చెప్పుదురు గావున భవదీయ రక్షగొనియె చుండీ యందు నా పోవుట’ యని సవినయంబుగాఁ బ్రార్థించి ‘నాపైఁ బెక్కులు కల్యాణకరణకల్పంబు లగు మాట లాడితిరి; మహాభాగ్యవంతులకుఁ గాక యిట్టివారి కారుణ్యంబు దొరకొనునె? మీ కరుణయ నన్ను భాగ్యవంతుం డని తెలిపెడు’ నని బహుప్రకారంబులం బ్రస్తుతిసేసె; న ట్లామంత్రితులై యమ్మహాత్ము లందఱు గృష్ణార్జునామంత్రణంబు గైకొని యంతర్థానంబు సేసిరి. పదంపడి భీష్మునకుం బరలోకక్రియలు ధృతరాష్ట్రసహితుండై యాచరించి కర్ణప్రభృతి కురుప్రకరంబునకు నూర్ధ్వలోక సాంద్రసౌఖ్యసిద్ధ్యర్థంబుగా నానావిధ దాన విధులు నిర్వర్తించి కృతకృత్యుండై కతిపయ దినంబుల కచ్చోటు గదలి పాండవాగ్రజుండు పాండునృపాగ్రజు నగ్రేసరుం గావించుకొని కరినగరంబున కరిగి యతనిం బూజించి తదనుజ్ఞాశోభితుండగుచుఁ గృష్ణుండును భీమాద్యనుజులు మోదంబు నొంద జనులు నభినందింపఁ బెంపారి వసుంధరాపరిపాలనధురంధరుం డయ్యెనని చెప్పిన విని జనమేజయుండు వైశం పాయనున కిట్లనియె.
|
139 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )