| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము |
| తే. |
‘ఇవ్విధంబున ధర్మజుం డెలమి ధరణి | పాలనము సేయఁగాఁ గృష్ణపార్థు లెట్టి తెఱఁగువారలై యెచట వర్తించి రెఱుఁగఁ | జెప్పవే నాకు సజ్జనసేవనీయ!’ |
140 |
| వ. | అని యడిగిన వైశంపాయనుం డిట్లనియె. | 141 |
| సీ. |
‘ధర్మజుం డమ్మెయి ధరణిఁ బాలింపంగ | ననఘ | యింద్రప్రస్థమున వసించి కృష్ణుండుఁ గ్రీడియుఁ గ్రీడాపరత సరి | త్కాననపర్వతసానుదేశ ములఁ జరించుచు విప్రపూజలఁ బుణ్య క | థాశ్రవణముల సత్కావ్యగోష్ఠిఁ బ్రొద్దు పుచ్చుచుఁ దమ పూర్వవృత్తము లైన | సమరతంత్రప్రముఖములఁ జెప్పి |
|
| తే. |
కొనుచు నుండుదు రాత్మీయతనయు నరుఁడు | దలఁచి వగచిన శోకంబు దలఁగు నట్టి వాక్యసంతతి నా వృష్ణివరుఁడు దేర్చు | సముచితోక్తుల; ధర్మజు శాంతి వొగడు. |
142 |
| క. |
విను మయకృత సభఁ గ్రొత్తగఁ | గని యచ్చో నొక్కయెడ సకౌతుక నానా జనపరివృతులై యుండుదు | రనూన విభవమునఁ బ్రమద మారఁగ వారల్. |
143 |
| వ. | ఒక్కనాఁ డప్పుండరీకాక్షుండు గాండీవితో నిట్లనియె. | 144 |
| సీ. |
‘సమరంబు ధర్మవిజయ పరికీర్త్యంబు | గాఁ జేసి భూమి నిష్కంటకముగఁ బాలించుచున్నాఁడు ప్రజ ప్రీతినొందంగ | విద్వజ్జనంబులు వివిధసుఖము లనుభవించుచుఁ దన్ను వినుతింప నెగడెడు | శాంతియు సమతయు సకలజనము గొనియాడు సిద్ధులు మునులు సేవింతురు; | ధర్మనందనుఁ డి ట్లుదాత్తుఁ డగునె! |
|
| తే. |
యతని కున్నతి గావించి రనిలజుండు | గవలు నెంతయు నీ చేతి గాండివంబు లీల గల్గి మహాధర్మశాలి సత్య | నిత్యుఁ డమ్మహీపతి గృతకృత్యుఁ డయ్యె.’ |
145 |
| వ. | అని యగ్గించి యతని యాననం బాలోకించి. | 146 |
| ఉ. |
‘నీవలనన్ మహాత్మ! విను నిర్భరచిత్తుఁడ నైతిఁ జూడఁగాఁ బోవు తలంపు పుట్టెడుఁ బ్రభూతగుణున్ బలదేవు వత్సలన్ దేవకి నార్ద్రచిత్తు వసుదేవుని మద్గతరాగసాంద్ర స ద్భావుల సర్వయాదవులఁ బార్థ! ననుం దగ నన్పిపుచ్చువే. |
147 |
| క. |
ద్వారకకుఁ బోయి వచ్చెదఁ | గౌరవపతి కిత్తెఱంగు కార్యజ్ఞానో దారుఁడ వగు నీ వౌచి | త్యారూఢము గాఁగఁ జెప్పు మగు సమయమునన్. |
148 |
| వ. | అట్లు గావున ధర్మరాజానుమతంబునం జనువాఁడఁ గావలయు వినుము. | 149 |
| తే. |
అవ్విభుఁడు వోయి వత్తుగా కనక పోను | మేనుఁ బ్రాణంబుఁ దనయులు మిత్రగణము బంధులును నర్థచయము నప్పార్థివేంద్రు | సొమ్ము తదనువర్తనము వ్రతమ్ము నాకు. |
150 |
| వ. | కావున. | 151 |
| క. |
మనము కరినగరమునకుం | జని పుణ్యాత్ముని నజాతశత్రుని నెలమిం గని తగు నవసరమున ని | ప్పని విజ్ఞాపించి యతని పనిచిన భంగిన్. |
152 |
| క. |
నడతము పోద ‘మనుడుఁ గ | వ్వడి గొండొక వడి విచారవన్మానసుఁడై ‘కడుమే లటు సేయుద’ మని | యొడఁబాటుం బలుకు పలికి యొయ్యన పిదపన్. |
153 |
| వ. | అమ్మహాత్మునితో నిట్లనియె. | 154 |
| చ. |
‘అనికిఁ దొడంగు నప్పుడు మదాత్మ గలంగినఁ గొన్ని తత్త బ్వో ధన మహనీయవాక్యము లుదాత్తకృపం దగ నీవు సెప్పి; తే మనమున వాని యర్థములు మాధవ! నిల్పఁగఁ జాల నైతి; న వ్వినుతవచస్సుధారసము వీనుల నింకొకమాఱు నింపనే.’ |
155 |
| క. |
అనిన నగుచు నొక కేల న | తనిఁ గౌఁగిఁట జేర్చి ‘బుద్ధితత్త్వవిహీనుం డును శ్రద్ధారహితుఁడు నై’ | తని దూఱి ముకుందుఁ డిట్టు లను నాతనితోన్. |
156 |
| తే. |
‘బ్రహ్మపదవేదనమునకుఁ బరమహేతు | భూతములు నాఁటి వాక్యముల్ బుద్ధిఁ దన్మ హార్థములు నిల్వవైతి శక్యంబె యింక | నవ్వచనములు సెప్పంగ? నలఘుశౌర్య! |
157 |