పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము
గురుశిష్యసంవాదంబు గృష్ణుం డర్జునున కెఱింగించుట (సం. 14-35-2)
వ. అనిన విని యర్జునుం డచ్యుతునితో ‘భవత్ప్రసాదంబున మదీయమతి యతి విశదయును సూక్ష్మగ్రాహిణియు నయి యున్నయది; పరమంబైన వేద్యంబగు బ్రహ్మంబు నెఱింగింపవే?’ యనుటయు నా కృష్ణుండు ‘గురుశిష్యసంవాదం బను నితిహాసంబు విను; మది నీ ప్రశ్నంబునకు నుత్తరం బయి యుండెడు; నిత్తెఱంగున మేధావి యగు నొక్క శిష్యుండు సంశితవ్రతుం డయిన గురు నడిగిన నగ్గురుండు బృహస్పతి భరద్వాజ భార్గవ గౌతమ కాశ్యప వసిష్ఠాత్రి విశ్వామిత్రప్రముఖులగు మునిజనంబు లాంగిరసుంబురస్కరించి కొనివిరించికడకుం జని తచ్చరణంబులకుం బ్రణమిల్లి ‘హితం బెయ్యది? తత్ప్రాప్తి సుపథం బెట్టిది? వివరింపవే’ యని విన్నవించిన నన్నలినాసనుండు గృపాధురీణంబైన చిత్తంబుతో నత్తపస్వి సత్తముల కెఱింగించిన తెఱంగు నీకుం జెప్పెద నవహితుండ వయి యాకర్ణింపు’ మని పలికి యిట్లనియె. 103
ఆ. ఆదరార్ద్రుఁ డగుచు నలరిన మోముల | కాంతి వింత గాఁగఁ గమలగర్భుఁ
డా తపస్విజనుల యాననంబులు గల | యంగఁ జూచి యిట్టులనియె వత్స!
104
తే. ‘సత్త్వమునను భూతంబులు సంభవించు. | నంద వర్తించు, దానన యడఁగు; నిది గు
ణత్రయాత్మకసత్త్వచరిత్ర మమల | బుద్ధులార! సత్త్వంబు ప్రసిద్ధి వినుఁడు.
105
క. శ్రుతియనఁ దపమనఁగఁ బ్రజా | పతియన సత్త్వంబునకు సపర నామంబుల్‌
వ్రతులార సత్త్వమన న | వ్వితత మహిమమైన పరమవేద్యము సుండీ!
106
క. కావునఁ గామ క్రోధ స | మావేశము లెడల విడిచి యనవతరంబున్‌
సేవింతురు సత్వము దృఢ | భావాకలనమున యోగపరినిష్ఠాత్ముల్‌.
107
వ. అది హితంబు తత్ప్రాప్తికి సుపథంబు సెప్పెద వినుండు. 108
క. చతురాశ్రమములును జరణ | చతుష్టయము గాఁగ వర్ణ సముదయ సంసే
వ్యత నొప్పెడు ధర్మము సుం | డతులంబు శివ ప్రదంబు నగు పథ మరయున్‌.
109
వ. నాలుగాశ్రమంబులకు సామాన్యంబ యధ్యాత్మవిత్త్వంబు లేక పరతత్త్వంబు నొందరామి మారుతాదిత్యేంద్ర ప్రజాపతులకునులోనుగానిట్టిద యధ్యాత్మ దర్శనంబనం జతుర్వింశతి తత్త్వావలోకనంబు కావునఁ దత్త్వంబులు వివరించెద. 110
తే. అంబరాది భూతములు శబ్దాది గుణము | లింద్రియము లిరుదెఱఁగు మునీంద్రులార!
మన మహంకార బుద్ధు లిట్లొనరి ప్రకృతి | గలయఁ దత్త్వ చతుర్వింశకత్వ మొందు
111
క. వినుఁడు ప్రభవ విలయ జ్ఞా | న నిరూఢము గాఁగ వీని నైజ మఖిలముం
గనిన భవమోహ మొందఁడు | గనుఁ బరతత్త్వంబు నతఁడు గతకల్మషుఁడై.
112
వ. అని నిర్దేశించి యద్దేవుండు వెండియు. 113
క. ‘వ్యక్త మనిర్వాచ్యం బ | వ్యక్తము సుస్థిరము ధ్రువము వ్యాపిత్వధురా
యుక్తము కలిత గుణత్రయ | శక్తి నవద్వారపుర మసాధ్యము సుండీ!
114
క. తత్సాధనంబు దద్గత | చిత్సులభత్వ ప్రసిద్ధిఁ జేయుఁ ద్రిగుణ సం
పత్సారవంత మది గుణ | జిత్సువ్రతు లైన వారిచే సాధ్య మగున్‌.
115
సీ. సంయమివరులార! సత్త్వరజస్తమో | నామరూఢములు గుణంబు; లవియు
నన్యోన్య మిథునత్వ మన్యోన్య సంశ్రయ | మన్యోన్య సంకలితాను వృత్త
భావ మన్యోన్యోప జీవనాచరణంబు | గలిగి దుర్బోధత్వ గాఢ భంగు
లైయుండుఁ; దమము నియమితమైన రజస్సుఁ | దన్నియమమున సత్త్వంబు నడచు;
 
తే. సత్త్వ మడఁగినచోఁ దమశ్చరిత మెసఁగు | లోభశోక సమ్మెహ నిద్రాభయములు
వికృతి దుర్మాన మౌఢ్య పాపకృతి కోప | శాఠ్య మాత్సర్యములు తమస్సంభవములు.
116
ఉ. పాములుఁ దేళ్ళునుం బసులుఁ బందులుఁ గుక్కలు మీలుఁ గోళ్ళులుం
జీమలుఁ గాకులుం గ్రిములు జింకలు నక్కలుఁ గొంకనక్కలు
న్దోమలు మ్రాఁకులుం బొదలు నోవులఁ బొందువారు మున్‌
తామసభాగు లట్ల మఱి తద్విధ జంతువు లెన్ని యన్నియున్‌.
117
క. ఇవి తామసంబు లని గుణ | నివహములోఁ గీడు వాప నేర్చునతఁడు త
ద్వివిధ వికృతి నిరసన హే | తువివేకము గలుగఁ గా నధోగతిఁ దలఁగున్‌.
118
చ. బలమును శౌర్యమున్‌ మదముఁ బ్రాభవమున్‌ సుఖదుఃఖ భాగితా
కలనముఁ జెల్మి సేఁతయును గాంక్షయు నొల్లమియుం బ్రతానముం
గలహము నీర్న్యయున్‌ బహువికల్పపు భాషలుఁ గామినీ జనం
బుల యెడ గాఢ రాగతయు బొంకును నుబ్బు రజఃప్రభూతముల్‌.
119
చ. అవి తొలుబామునం గలుగు నట్టి జనంబులు నీతు లిట్టి వి
ట్టివి యవినీతు లన్మతి పటిష్ఠత గల్గ త్రివర్గ వర్తనం
బు వెరవు నొంది యర్థములఁ బొంపిరివోవుచుఁ గామ సౌఖ్యవై
భవములఁ గ్రాలుచున్‌ మనుజ భావ నిరూఢతఁ బొల్తు రెంతయున్‌
120
క. రాజసగుణములకుం గల | నైజ మెఱుఁగు వారు తజ్జనక వైకృతముల్‌
ధీజితములు గావింపఁగ | నోజ గలిగి శుభదవృత్తి నొందుదు రెందున్‌.
121
సీ. సంతోషము సుప్రకాశత్వంబుఁ బ్రియమును | నానందమును గరుణాభిరతియు
క్షమయును సత్యంబు శౌచంబు ధృతియు న | కార్పణ్యమును దితిక్షయు నహింస
యును నార్జవంబును ననసూయయును గ్రోధ | రాహిత్యమును నసంరంభతయును
సమత దాక్షిణ్యంబు శ్రద్దధానతయు న | క్రూరభావంబు హ్రీగౌరవంబు
 
తే. సత్త్వజాతంబు లివి పూర్వజన్మ సంక | లితము లైనట్టివా రహంకృతి మమత్వ
మర్థతృష్ణ కామార్తి లే కతులబోధ | భరితులై యూర్ధ్వలోక వైభవము గండ్రు.
122
క. వినుఁ డా గుణంబు లన్నిటిఁ | గనికొని తత్త దనుషక్తి గలుగనివాఁ డ
ప్పనిచే భుజింపఁగాఁ బడఁ | డనఘాత్మకులార! మ్రింగు నతఁ డారాశిన్‌.’
123
వ. అని చెప్పి యప్పరమేష్ఠి మఱియును. 124
సీ. ‘వేర్వేఱ యుండవు వినుఁడు! గుణంబు ల | న్యోన్య సంకలితంబు లగుచుఁ బరఁగు
సంగతత్వమునన సంసారయాత్రా ప్ర | వర్తనం బొనరించు; వానిలోన
నెయ్యది మిగులఁ దోఁపించెఁ దజ్జన్యంబు | లొలయుఁ బాయుటయు నొక్కొక్కమాటు
గలుగుఁ; దమం బెఱఁగమి యధికం బైన | స్రోతస్సధోముఖ స్రుతి రజస్సు
 
ఆ. లెఱిఁగినపుడు మధ్యసరణి సత్త్వమువృద్ధిఁ | బొంద నూర్ధ్వవృత్తిఁ బొందు; వీని
మును ప్రకార భేదమున నెఱింగించితి; | నవియు దుస్తరంబు లనఘులార!
125
క. స్రోత స్సన జీవగమన | హేతు వగు దశా విశేష; మీ గుణమునఁ దా
నీ తెరువు నొందు నని కనుఁ | డాతతమతులార! కరణ మగు నది త్రోవన్‌.
126
వ. గుణత్రయంబునుం ద్రోచుట మే; లది త్రోవువడునట్టి వితృష్ణత్వంబు లేకుండు నేని. 127
క. సాత్త్వికులకు దివము రజో | మత్త్వ కలిత వర్తనులకు మధ్య భువన వా
సత్త్వముఁ దామసులకు నీ | చత్వ కరాధోజగంబు సంప్రాప్త మగున్‌.
128
క. ధర్మార్థ కామ గోచర | కర్మములకు సాత్త్వికాదిక ప్రకర వికా
రోర్ములు హేతువు లగు; ని | ష్కర్మత కేత దవధూతి గారణము సుఁడీ!
129
క. క్రమమునఁ బ్రాణంబు నపా | నము సత్త్వంబును రజస్సు నాకుం జూడన్‌
యమివరులార! యుదానము | దమ మిట్టుల శ్రుతియు సువిదితంబుగఁ జెప్పున్‌.
130
క. జపమును దానము యజ్ఞముఁ | దపమును గర్తృజన చిత్తదశలును సత్త్వా
ద్యుపహితము లగుట నడచుం | ద్రిపథంబుల సాత్త్వికపు గతియ మే లెందున్‌.
131
క. వినుఁ డెక్కువ తక్కువ లే | క నయము నెనసిన గుణత్రయంబును జూరే
వినుతా వ్యక్తం బనఁగాఁ | జను తత్త్వము శివ మచలము శాశ్వత మరయున్‌.
132
క. సదసత్ప్రకార నిత్యం | బది; దాని తెఱం గెఱుంగు నాతఁడు విజ్ఞా
నదళావధూత గుణుఁడై | యదీనగతిఁ బొందఁగను నిరామయపదమున్‌.’
133
వ. అని యుపదేశించి వివరించి వెండియు. 134
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )