| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
‘అవ్యక్తమునను మహత్తత్త్వ ముదయించు | నది బుద్ధిమతి ధృతిఖ్యాతి సంవి దుపలబ్ధి నామంబు వొంది యెందును గని | విని చని కావించి విభుత నొప్పు; దాన నహంకార తత్త్వంబునకుఁ గల్గుఁ ; బ్రభవంబు; వినుఁడు! తద్భావితాత్మ కంబై ప్రవర్తించుఁ గార్యనీతుల లోక | మఖిలంబు; వర్ణత్రయ ప్రజనితు |
|
| తే. |
లధ్యయనమును వ్రతమును నధ్వరంబుఁ | దపము మొదలైన క్రియ; లందుఁ దగిలి నడచు టెల్లఁ దద్వ్యాఙఙప్తిఁ జేసియ తెల్ల మింత | జగము రంజిల్లు దాని తేజంబువలన. |
135 |
| క. |
వినుఁ డా తత్త్వంబున సం | జనితము లగు మేదినియును జలమును దేజం బును వాయువు నాకాశము | ననఁగ మహాభూతములు నిరతిశయ మహిమన్. |
136 |
| తే. |
తద్గుణంబులు సూరె గంధంబు రసము | రూప సంస్పర్శ శబ్దముల్ రూఢ భంగిఁ బరఁగు నివ్విషయముల పాల్పడ్డ మనసు | గలుగు జంతువు మోహాంధకార మొందు. |
137 |
| క. |
దీన సకల జంతువులును | లీనము లగుచుండుఁ దమ యలీన స్మృతి దై ర్యానూనం బగు నిర్మల | మానసములఁ బొరయనీరు మహితార్యజనుల్. |
138 |
| క. |
విషయంబులు నశ్వరములు | విష సన్నిభములు సమగ్ర వికృత జనకముల్ ధిషణాగుణముల నెల్లఁ గ | లుషములుగాఁ జేయు మోహలోభకరము లై. |
139 |
| ఆ. |
మాంసశోణితాస్థిమయ శరీరంబులఁ | దారు గాఁగ లగ్గ తలఁచునట్టి కృపణజనులు వీని కీడు గానఁగ లేక | చిక్కి చెడుదు; రింత నిక్కువంబు. |
140 |
| వ. | పండితులు వీని చేతం జెడ’ రని పలికి పద్మసంభవుండు వెండియు. | 141 |
| తే. |
అంతరాత్మ యనంగఁ బ్రాణాది పంచ | కమును వాఙఙ్మనోబుద్ధులుఁగా నిరూఢి గలుగు నీ యష్టకంబు లోకమున కెల్లఁ | దా నుపాదాన కారణత్వము వహించు. |
142 |
| వ. | ఇవ్విధంబునం గనుంగొనుట బోధంబునకు నిదానంబు. | 143 |
| సీ. |
వినుఁ డహంకార సంజనితంబు లగు చక్షు | రాదిక బుద్ధీంద్రియములుఁ బాద ముఖ్యకర్మేంద్రియములను మనంబునకు | నేకాదశేంద్రియానీక మీక డింది సందడిఁ బడి కుందక యందేది | యింపేనిఁ దనవంక కీడ్వఁ జాలు బుద్ధితత్త్వము గల్గు శుద్ధాత్మకుఁడు పర | తత్త్వంబు గనుటకుఁ దా వలంతి |
|
| తే. |
యని యెఱింగించి మఱియు నిట్లను నజుండు | స్వేదముద్భేద మండ మన్వీనఁ బుట్టు నధమ మధ్యమోత్తమ దశలైన భూత | రాసు లత్యుత్తమములు జరాయుజములు. |
144 |
| వ. | భూత తారతమ్య జ్ఞానంబు మాననీయం బగుట నిట్లు సెప్పితి; నధ్యాత్మాదులం జెప్పెదఁ; దద్వేదిత్వంబు విద్యామూలంబై యుండు; నవధానంబుతో వినుండు. | 145 |
| క. |
అంబరమాది యనిల తే | జోంబుధరలు వరుసతోడ నగుఁ జూరె ద్వితీ యంబుఁ దృతీయంబుఁ జతు | ర్థంబును బంచమము భూతతతి యట్లుండున్. |
146 |
| వ. | అధ్యాత్మాదులు భూతాధిష్ఠానంబులు గావున భూతంబుల ము న్నుపన్యసించితి. | 147 |
| సీ. |
శ్రోత్ర మధ్యాత్మంబు సూరె శబ్దం బధి | భూతంబు దిశలు ప్రబుద్ధులార! యధిదైవతము చర్మమధ్యాత్మ మందలి | సంస్పర్శ మధిభూత సంజ్ఞకంబు; దానికి నధిదైవతంబు విద్యుత్తు; నే | త్రంబు దా నధ్యాత్మకంబు రూప మధిభూత మాదిత్యుఁ డధిదైవతము జిహ్వ | యధ్యాత్మకము రస మారయంగ |
|
| తే. |
దాని యధిభూత ముడుపతి తదధిదైవ | తంబు ఘ్రాణ మధ్యాత్మంబు దలఁప గంధ మంచితాధిభూతము దదీయాధిదైవ | తంబు మారుత మండ్రు విద్వజ్జనములు. |
148 |
| వ. | ఇది బుద్ధీంద్రియ ప్రపంచంబు. | 149 |
| సీ. |
పాదపాయూపస్థ పాణి వాగ్వర్గంబు | కర్మేంద్రియములు సత్కర్ములార! యధ్యాత్మములు వాని కగు నధిభూతముల్ | గంతవ్యమును విసర్గమును శుక్ర మును గ్రమవృత్తిమై వినుఁడు కర్తవ్య వ | క్తవ్యంబులును నధిదైవతములు బభ్రుమిత్త్ర ప్రజాపతి శక్రవహ్నులు | మఱి యహంకారంబు మనసు బుద్ధి |
|
| తే. |
పూజితాధ్యాత్మకము లధిభూత వృత్తి | వెలయు నభిమాన మంతవ్యములును నిశ్చ యంబు నధిదైవతము రుద్రుఁ డమృత కరుఁడు | బ్రహ్మమిది వేద వాక్య నిర్ణయము తెఱఁగు. |
150 |
| ఆ. |
ఇట్లు తెలియ నెఱిఁగి యింద్రియంబుల నింద్రి | యార్థములను భూతసార్థమును దె మల్చి చిట్లకుండ మనసున నొదిఁగించు | టనఘులార! భవనిరాసనంబు.’ |
151 |
| వ. | అని నిర్దేశించి నీరజాసనుం డా సంయమివరులతో ‘సూక్ష్మ భావత్వ సంపాదినియు శివయు నగు నివృత్తి తెఱం గెఱింగించెద’ నను మాట మున్నాడి యిట్లనియె. | 152 |
| సీ. |
‘కమఠంబు దన యంగకముల నెట్లట్లు | కామముల విద్వాంసుండు మరలఁ దివుచుఁ; గామంబుల మరల్పఁగా నోపు ధీరుండు | విరజస్కుఁడై ముక్తి తెరువు గాంచు; నింద్రియంబులు పదియింటిని గుదియించు | టెక్కుడు వెర వది యింధనముగ నాత్మాగ్ని వెలుఁగు; భూతావలి నాత్మఁ గాం | చిన సూక్ష్మతత్త్వ దర్శనము గలుగు; |
|
| తే. |
భూత పంచక జలధి రోగాతిశోక | సహిత భోగలవాంశ కాశ్రయము దీని విభులు గాముండుఁ గ్రోధుండు; వీరి గెల్వ | వచ్చునప్పుడ యది గడవంగ వచ్చు. |
153 |
| ఆ. |
మనసు మనసునంద మడఁచి, యాత్ముని నాత్మ | యంద కాంచునట్టి యతఁడు సర్వ విదుఁడు; సకల భూత వితతి యందును దనుఁ | గమచునుండు నిర్వికల్పకముగ. |
154 |
| తే. |
ఆత్మతత్త్వమేకంబ దీపాంతరములఁ | గలుగఁ జేయు ప్రదీపంబు కరణి నావ హించు రూపాంతరముల నయ్యెలమియును బు | ధుండు గనుఁగొని బ్రమయక నుండు నొకట. |
155 |
| తే. |
ఆ పరంజ్యోతి పేళ్ళు లర్యముఁడు వరుణుఁ | డనిలుఁ డగ్ని సోముఁడు విష్ణుఁ డజుఁడు శివుఁ డ నంగఁ బరఁగు శబ్దములు సన్మతులు దానిఁ | బ్రయతులయి భజియింతురు నియతులార!’ |
156 |
| వ. | అని చెప్పి యచ్చతురాసనుం డమ్మాననీయులతో మఱియు నిట్లను; ధర్మంబునకు నహింస లక్షణం ‘బధర్మంబునకు హింసయు దేతలకుఁ బ్రకాశత్వంబును మనుష్యులకుఁ గర్మంబును నాకాశంబునకు శబ్దంబును వాయువునకు స్పర్శంబును జ్యోతిస్సునకు రూపంబును జలంబునకు రసంబును బృథివికి గంధంబును భారతికి సత్యంబును మనంబునకుఁ జింతయు బుద్ధికి వ్యవసాయంబును దదీయ మహత్త్తత్త్వస్వరూపంబునకు ధ్యానంబును నవ్యక్తంబునకు సాధుత్వంబును యోగంబునకుఁ బ్రవృత్తియును జ్ఞానంబునకు సన్న్యాసంబును లక్షణంబులు; లక్షణ జ్ఞాఙనంబు పరతత్త్వపరిజ్ఞానంబునకు హేతుభూతంబు. | 157 |
| ఆ. |
జ్ఞాన పూర్వమైన సన్న్యాస కలనంబు | పరమగతి నొనర్చు భవ్యులార! ద్వంద్వరహితుఁ డైన నతని జరామృత్యు ని | స్తరణ కరణ మైన ధర్మ మొందు. |
158 |