పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము
అవ్యక్తనామ తత్త్వ నిరూపణ ప్రకారము (సం. 14-43-34)
సీ. అవ్యక్త నామకం బగు తత్త్వ మరయ స | లింగంబు పురుషుఁ డలింగుఁ డతఁడు;
క్షేత్రంబు నెఱఁగుట క్షేత్రజ్ఞుఁడనఁ జనుః | క్షేత్రంబు నాఁగఁ బ్రకృతియనంగ
నవ్యక్తమునకు నామాంతరములు; గుణ | ప్రభవ మాతత్త్వ మా ప్రభువు గుణము
లెఱుఁగవు చేతనా హీనముల్‌ గాన య | య్యంతరాత్ముఁడు దత్క్రియా ప్రపంచ
 
ఆ. మెఱుఁగు; నిట్టులగుట యెఱిఁగి గుణమ్ముల | విడిచి నిలిచి తత్త్వవేది యంత
రాత్మ వేశమునన నచల నిరామయా | వ్యయపదంబు నందు ననఘులార!
159
వ. అని వెండియు. 160
సీ. జ్యోతిస్సులందు వర్యుఁడు రవి, భూతంబు | లం దగ్ని వరుఁడు, విద్యలఁ బ్రధాన
సావిత్రి, దేవతా సమితిఁ బ్రజాపతి | ఘనుఁడు, వేదముల ముఖ్యంబు ప్రణవ,
మనిల నిచయమ్మునఁ బ్రాణ మగ్ర్యము, ఛంద | ములకు గాయత్రి యగ్గలము, పశువు
లకు మేటి యజ, మఖిల చతుష్పదములకు | ధేనువు మిక్కిలి, మానవులకు
 
తే. బ్రాహ్మణుండు వరిష్ఠుండు, పక్షులందు | శ్యేన మధికంబు, యజ్ఞవిధానముల హు
తంబు పెద్ద, యుగముల గృతంబు మేలు | ధాతువర్గములోన నుత్తమము పసిఁడి.
161
సీ. యవ లోషధులలోన, నన్నంబు భక్ష్యభో | జ్యములందు, జలము పేయములలోన,
నమలాచలము పర్వతములలోఁ బ్లక్షంబు | దరువులలోన, నూర్ధ్వంబు దిశల,
జాహ్నవి నదులందు, సాగరంబు సరస్సు | లందు, గృహస్థత్వ మాశ్రమముల
నెక్కు డారయ; నెక్కు డేను బ్రజాపతు | లంద; చింత్యాత్మకుండైనయట్టి
 
తే. విష్ణుఁ డెక్కుడు నాకంటె; వినుఁడు తెలియ | నీశ్వరుఁడు దేవతావలికెల్ల నెక్కు;
డతఁడు నా నే ననఁగ విష్ణుఁ డనఁగ వస్తు | వొకఁడ మూర్తి త్రయంబున నుల్లసిల్లు.
162
క. నెఱయఁ బ్రధాన పదార్థము | లెఱుఁగుట పరిబోధమూల మెఱుకల కెల్లన్‌
మెఱుఁగిడుట మమ్ము మువ్వుర | గుఱుకొని యొకఁడుగ నెఱింగికొనుట దలంపన్‌.
163
క. దివసము రాత్రియునుం బొరిఁ | బ్రవర్తనముఁ బొందుచుండు పగిదిని సుఖసం
భవ దుఃఖ జననములు జం | తువులకుఁ గలుగు; వలవ దుబ్బ దురపిల్లంగన్‌.
164
తే. పొదలుఁ దఱుఁగుటకై, పొడ వొదవుఁ బడుట | కై, కడను జేరుఁ బాయుటకై, జనించుఁ
బొలియుటకునై, సుఖంబును బొందు దుఃఖ | మందుటకునై పదార్థము లఖిలములును.
165
క. జ్ఞానము సవిశేషస్థితి; | దానికి నాశంబు లేదు, దానిఁ దెలియుటన్‌
మానాహంకృతి మమతలు | మానిన నిర్మలుఁడు మోక్షమార్గముఁ గాంచున్‌.’
166
వ. అని వివరించి విరించి యా సమంచితాచారులతోడ ‘నాశ్రమ ప్రకారంబు లెఱింగించెద’ నని పలికి యిట్లని యుపన్యసించె. 167
సీ. ‘గురునకుఁ బ్రియహితకరుఁ డయి వేదాధ్య | యన మొనరించుచు నశన మమల
భిక్ష నొనర్చుచు బిల్వపలాశదం | డములలో నొకటి ధార్యముగఁ జేసి
స్నానశీలుఁడు బ్రహ్మచర్యపరుండును | నియమితేంద్రియుఁడును నిత్యశుచియు
యజ్ఞోపవీతియు నబహుభాషియు మేఖ | లాఢ్యుండు నై శయనాసన ప్ర
 
తే. చారవిధములు సముచితాచరితములుగ | సత్యధర్మ నిరూఢుఁడై శాంతి గలిగి
వేల్మి యిరుప్రొద్దు నడుపుచుఁ గల్మషంపుఁ | బనుల కెలయక వర్తించు బ్రహ్మచారి.
168
సీ. అర్హప్రకార సమావర్తనుం డయి | నిజదార నిరతుండు నిర్మల ప్ర
చారుండుఁ బంచయజ్ఞపరుండు నతిథి శి | ష్టాశియు శుక్ల వస్త్రాన్వితుండు
శక్త్యనుగుణదాన శాలియు నచపలేం | ద్రియుఁడును శుచియు మైత్త్రీపరుండు
స్వాధ్యాయశీలుండు సద్వ్రత నిష్ఠుండు | నై యాజనంబు నధ్యాపనంబు
 
ఆ. శక్యమైనఁ జల్పి, క్షమ గల్గి సత్ప్రతి | గ్రహ మొనర్చి, మిత్త్రు లహితు లనక
మాట కార్యమునను మధ్యస్థుఁడై గృహ | స్థుండు నడచు దురితదూరుఁ డగుచు.
169
సీ. గ్రామంబు దొఱఁగి యరణ్యస్థలంబునఁ | బర్ణశాలా పరత నొంది
స్నానతంత్రము రెండు సంధ్యల నడపుచు | బ్రహ్మచర్యవ్రత భాసి యగుచుఁ
బూరిపంటలు ఫలంబులు మూలములు శాక | సముదయంబును నశనముగఁ గొనుచు
నజినంబు వల్కల మంబరంబుగఁ గొని | శయన కృత్యంబు భూస్థలి నొనర్చి
 
తే. యతిధులకు నెడ మిచ్చి యాహారములను | భక్తి నాత్మీయములలోనఁ బంచిపెట్టి
యధ్యయన హోమశీలుఁడై యన్ని యింద్రి | యముల గెలిచి వానప్రస్థుఁ డతిశయిల్లు.
170
క. ఈ మూఁ డాశ్రమములలో | నేమిట వర్తించువార లేనియు ముక్తిం
గామించినఁ జొరనగు వి | ద్యామూలాచార మైన యత్యాశ్రమమున్‌.
171
సీ. సర్వభూత దయానుషంగంబు గలిగి య | తీత వస్తువులఁ జింతింప కెద న
నాగతంబులమీఁద నాస సేయక వర్త | మాన లబ్ధము లుపేక్షా నిరూఢిఁ
గూర్చు చంగంబులఁ గూర్మ మెట్లట్ల యిం | ద్రియముల లోనికిఁ దిగిచికొనుచు
సముచితకాల భిక్షా చర్య దొరకొన్న | యంతన నిజదేహ యాత్ర నడపి
 
తే. గ్రాస మాచ్ఛాదనంబు దక్కంగ నెవ్వఁ | డర్థి నెయ్యది యిచ్చిన నంద కేక
వార భోజ యగుచు నమస్కార సఖ్య | నుతి నిరాకృతి సహితుఁడై యతి వెలుంగు.’
172
క. అనసూయయు నక్రోధం | బును దమమును బ్రహ్మచర్యమును ఋజుభావం
బును సత్యంబు నపైశున | ము నహింసయుఁ జూరె యతికి ముఖ్య వ్రతముల్‌.
173
తే. వృక్షమూల నదీతీర విజన నిలయ | విపిన గిరిగుహా నిత్య వివిక్త దేవ
సదనవాసియై కౌటిల్య సాధ్య వస్తు | సంచయనము లుడిగి యతి సంచరించు.
174
క. తన మేలు ప్రకాశింపక | తనుఁ గనుఁగొనునట్టి జను లుదాసీనతమై
నునికికిఁ దగియెడు చందం | బున వర్తించుయతి సర్వముక్తత నొందున్‌.
175
వ. అని యెఱిఁగించి మఱియును. 176
సీ. సన్న్యాస మనఁ దపశ్చరణంబు పేరు త | పోజ్ఞాన యుక్తి ప్రబుద్ధు లైన
జనము లచింత్యం బజర మమృతంబు నా | వెలుఁగు తత్త్వము గండ్రు వీతతామ
సము నవధూత రాజసమునై శుద్ధ స | త్త్వాశ్రయం బగు హృదయంబు గలుగు
వారు తపోవృత్తివలన సుక్షేమ మా | ర్గంబున నడతు రేకత్వ శోభి
 
తే. మహిత నానాత్వ మనంగ సమస్త భూత | సముదయస్థమై యున్న తత్త్వము ప్రకాశ
మగుట నఖిలగతులఁ దోఁచు నవ్విధంబు | గలుగు బుధుఁడు నిర్ద్వంద్వుఁడై కాంచు ముక్తి.
177
వ. అవ్యక్త ప్రభవంబును బుద్ధి స్కంధంబును నహంకార విటపంబును మహా భూతోపశాఖంబును నింద్రియ కోటరంబును సంతతాశా పల్లవంబును శుభాశుభ ఫలంబును నై సంసార వృక్షం బొప్పుచుండు. 178
క. జ్ఞానాసి నది నఱికి యభి | మానాహంకార మతి నియతి యగు పురుషుం
డానందము ప్రస్ఫుటముగఁ | గానంగా నేర్పు విగతకల్మషులారా!
179
ఆ. నిమిషమైనఁ బరమ నియతి నాత్ముని నాత్మ | యంద కనినఁ దెలివి నారఁ బడసి
బోధమహితమునులు పొందు నవ్యయగతిఁ | బొందఁ గండ్రు ప్రకృతి పొందు దొఱఁగి.
180
ఆ. పరమనియతి యనఁగఁ బ్రాణసంయమనంబ; | యది క్రమాభివృద్ధి నలవరింపఁ
గాఁ బ్రసాద సిద్ధి గలిమి ద్రువం; బవ్వి | శేషకలన మిష్టసిద్ధిఁ జేర్చు.
181
క. అవ్యక్త తత్త్వ జాతము | భవ్యము సత్త్వంబు దురిత పంక హరంబై
యవ్యయ మమృత మనింద్రియ | భావ్యం బగు తత్త్వ మొందఁ బ్రాఁకగుఁ జుండీ!
182
వ. కావున. 183
తే. సత్త్వభావన కంటెఁ బ్రశస్తమైన | కృత్య మరయంగ లేదండ్రు నిత్యవస్తు
సమ్యగధిగమ సిద్ధికి సంయమ ప్ర | సిద్ధు లాగమతంత్ర ప్రసిద్ధులార!
184
క. వినుఁడీ! సత్త్వస్థుఁ బురుషుఁ | గనుఁగొనుఁ డనుమాన కలనఁ గాని మదిం ద
క్కిన తెఱఁ గేమిట నైనం | గనుఁగొనియెద మనుట వెరవు గాకుండుఁ జుఁడీ!
185
సీ. ఇట్లగ టె ట్లనియెదరేని సత్యంబు | సంతోషమును నహింసయును ధృతియు
క్షమయు నార్జవమును సన్న్యాసమును బరి | త్యాగంబు విజ్ఞానయోగ దశయు
సాత్త్వికంబులు గాన తత్త్వవిజ్జనములీ | యనుమానముఁ బురుషాధిగమముఁ
బడయుట యొప్పెడు పదమండ్రు తత్త్వంబుఁ | బురుషుండు నొకఁ డను బుద్ధిఁ గొంద
 
తే. ఱార్యు లూఁదురు రట్లేలయగు సుదుంబ | రమున మశకమ్ము వారి మీనము వసించు
నట్లు సత్త్వంబునం దంతరాత్ముఁ డండుఁ | గాక యనియెడివారు పెక్కండ్రు గలరు.’
186
వ. అనిన విని యమ్మును లమ్మహితాత్మునితో ‘ధర్మంబు లనేక విధంబులు; వీనిలో నెవ్వం డెయ్యది యవలంబించె నదియ వాఁడు మేలను; నే మన్నింటి మీఁదనుం బరఁగిన బుద్ధులు గలిగి యనిశ్చయ దర్శనులమయి యుండుదు; మిది ప్రధానానుష్ఠేయంబని యుపదేశింపవలయు; సత్త్వపురుష సంబంధ ప్రకారంబును బ్రస్ఫుటంబుగా నెఱింగింపు’ మనుటయు వారికి వారిజాసనుం డిట్లనియె. 187
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )