| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
‘సకల ధర్మములలో సర్వభూతాహింస | మేటి; యహింసా సమేతుఁ డైన వానికి నుత్తమ జ్ఞానోదయం బగు; | నది మోక్షమొనరించు ననఘులార! కోరిక మెయిఁ గర్మకారి యయ్యెడు వాఁడు | వొందు గతాగతంబులు ఫలాభి లాషంబు లేక నిర్దోషత మే లాచ | రించిన ముక్తి సిద్ధించు వినుఁడు! |
|
| తే. |
విషయి పురుషుండు, సత్త్వంబు విషయ; మిట్లు | భోక్తృ భోజ్యత్వ సంబంధమునఁ బొసంగి యుండియును బద్మపత్త్రపయోలవంబు | కరణి నతఁడు తత్సంగంబుఁ బొరయకుండు. |
188 |
| క. |
సత్త్వము ప్రదీప మా పర | తత్త్వముఁ గాంచుటకుఁ గాన తత్సాధనతా తత్త్వము వదలక చిత్త సు | ఖత్త్వాకలిత మగు నెలవు గండ్రు కృతాత్ముల్. |
189 |
| చ. |
అది సదుపాయ మెందును నుపాయసమగ్రత లేమి సేర్ప ద భ్యుదయము దూరమార్గమునఁ బొందెడు భద్రము వాహనాఢ్యుఁడున్ నది నెఱి నుత్తరించి కనునందము నౌ సహితుండుఁ గాంచు నొ ప్పిదము విసాధనుం డయిన బే లెటు లొందఁగ నేర్చుఁ జెప్పుఁడా! |
190 |
| ఆ. |
ఇట్టు లగుట యెఱిఁగి యెఱిఁగి యేనియును నె | ఱుంగకేని బలిమి ఱొచ్చు గడిగి చేయుపని ఫలంబు సిద్ధింపకుండుట | కొలఁదిఁ బోక దుఃఖములును గలుగు. |
191 |
| క. |
స్థలపథమునఁ బోతమ్ము | స్థలమార్గమునందు వాహనము వినియోజ్యం బులుగా నిమ్మెయి సాధన | కలన విభాగజ్ఞుఁ డైనఁ గడచు దురితముల్. |
192 |
| వ. | అని చెప్పి. | 193 |
| తే. |
తటినిఁ దగ నుత్తరించునంతకును బోత | మాదరించి తక్కొల్లనియట్లు పురుషు దర్శనము సంభవించు నంతకును సత్త్వ | మూఁది పిదపఁ దత్సంబంధ ముడుగుఁ డనియె. |
194 |
| వ. | ఇట్లుపదేశించి మరియు నిట్లను నవ్యక్తంబు గుణంబు మహత్తత్త్వంబు మహత్తత్త్వగుణం బహంకారం బహంకారంబు గుణంబులు మహాభూతంబులు మహాభూతగుణంబులు శబ్దాదులం దాకాశంబునకు శబ్దంబు గుణంబు వాయువునకు శబ్దస్పర్శంబులు దేజస్సునకు శబ్దస్పర్శ రూపంబులు జలంబునకు శబ్దస్పర్శ రూపరసంబులు గుణంబులు పృథివికి శబ్దస్పర్శరూపరస గంధంబులు గుణంబులు; శబ్దంబు మృదు ఖరాది బహువిధ భేదంబులు గలిగియుండు స్పర్శంబు శీతోష్ణ ముఖ్య వివిధ ప్రకారంబులం బరఁగు రూపంబు శుక్ల కృష్ణ ప్రభృతి నానా విధంబులం జను రసంబు మధుర తిక్తాది ప్రచురభంగుల నడచు గంధంబు సురభి తీక్ష్‌ణ ప్రముఖానేక విధంబుల వర్తించు నిట్లు పెక్కు చందంబులం జెల్లు విషయముల తెఱం గెఱుంగుట వానిఁ దొఱంగుటకుం దోడ్పడం జాలు నని చెప్పి వెండియు. | 195 |
| ఆ. |
భూమిముఖ చతుష్కమునకంటె దివి యహం | కారతత్త్వ మంతకంటె దాని కంటె బుద్ధి బుద్ధికంటెఁ బ్రకృతి యొక్కు | డన్నిటికిని బురుషుఁ డధికుఁ డరయ. |
196 |
| క. |
భూతముల తారతమ్యము | చేతోగతమైన యట్టి శిష్టజనము ప్ర ద్యోతితుఁ డగు పురుషుఁ గని ని | రాతంకావ్యయ పదంబు ప్రాపింపఁ గనున్. |
197 |
| సీ. |
పంచభూతంబులఁ బరఁగింపఁ గుదియింపఁ | జాలు దక్షత వాని నేలు ప్రభుతఁ దనరుమనంబు రథ్యముల సారథి యెట్టు | ల ట్లింద్రియముల నాఁగ నడప నదియ వలంతి భూతాత్మకంబును బుద్ధి | సన్నాహమును మనస్సారథికము నింద్రియాశ్వము నైన యీడ్యరథంబున | నభిమతగతి నంతరాత్ముఁ డెందు |
|
| తే. |
నెలమి వర్తించు; నిట్లగు టెఱుఁగు బుధుఁడు | ఘోరసంసార మోహవాగురకు లోను గాక నిర్గుణ పథమునఁ గ్రాలి కను ని | రామయము నవ్యయంబును నగు పదంబు.’ |
198 |
| వ. | అని పలికి మఱియును. | 199 |
| క. |
శరనిధి తరఁగల భంగిం | బొరిఁబొరి నవ్యక్తమునన పుట్టు నడంగున్ సురనరధరణీరుహ ముఖ | చరాచరానేక భూతజాలము లెల్లన్. |
200 |
| క. |
అవ్యక్తాదిక సకలము | నవ్యయుఁడగు పురుషుఁ డాశ్రయంబుగఁ బరఁగున్ సువ్యక్తంబుగ నిది గను | భవ్యులు వడయుదురు మోహ బంధ విముక్తిన్. |
201 |
| క. |
వినుఁ డక్కనుటకు మూలం | బనఘం బగు తపమ యగుట నతినిష్ఠఁ దపో ధన సమ్యగ్విధ సముపా | ర్జనం బవశ్యంబు వలయు సన్మతులారా! |
202 |
| సీ. |
భూరితపంబునఁ జూరె ప్రజాపతుల్ | బహువిధ సృష్టి నిర్వహణ నిపుణు లైరి; వన్యంబు లాహారంబులుగఁ దప | మాదరంబునఁ జేసి కాదె మునులు కాలత్రయంబు లోక త్రితయంబును | గాంతురు; విద్యల గౌరవంబు లొదవుఁ దపంబున; నొండు విధంబులఁ | బడయంగ రాని యెక్కుడు పదంబు |
|
| తే. |
లచ్చమైన తపంబున వచ్చుఁ బడయ; | బ్రహ్మవధ మద్యపానాది పాతకంబు లెల్లఁ బాయుఁ దపఃకృతి; నిద్ధతపము | పేర్మి సర్వభూతంబులుఁ బ్రీతిఁ బొందు. |
203 |
| క. |
మమతాహంకృతి రహిత త | పమునఁ బ్రజాపతి సమీప భవ్యపదము సం యమి వొందు; నిందు సందే | హ మొకింతయు లేదు నిర్మలాత్మకులారా! |
204 |
| క. |
మమతాహంకార విము | క్తముశుద్ధమునైన యచలిత ధ్యానముతో సమవేతంబగు తపమున | యమి గను సకలోత్తరావ్యయ పదప్రాప్తిన్. |
205 |
| వ. | అని చెప్పి వెండియు. | 206 |
| క. |
తమము రజస్సుఁ దొఱఁగి స | త్త్వమునన రమియించి యగుణతత్త్వము గని స త్త్వమును దిగవిడుచు వైరా | గ్యమహితుఁ డగు మునివరుం డకల్మషులారా! |
207 |
| క. |
పరమం బనంగ వేదాం | తరహస్యాత్మత వెలుంగు తత్త్వము నిక్కం బరయఁగ క్షేత్రజ్ఞుఁడ యను | పరిణతి గల యతఁడు సర్వపదవిదుఁడు సుఁడీ! |
208 |
| క. |
వృత్తి విశేషమునఁ జనిన | చిత్తము వెనుకఁ జని యందుఁ జేర్చి మనసు దా నెత్తెఱఁగునకుం దివియమి | యుత్తమపు రహస్య మండ్రు యోగమున మునుల్. |
209 |
| క. |
వినుఁ డవ్యక్తాంతం బగు | పనియెల్ల నవిద్య నొలయు బంధము మమతం బనుపడిన మృత్యు వమృతం | బనఁ జను; నది నిర్మమత్వ మారఁ గలిగినన్. |
210 |
| సీ. |
కర్మముల్ మేలండ్రు కర్మతత్పరులు బు | ద్ధాత్ములు విద్య వర్యత నుతింతు రవి షోడశ వికార యగు మూర్తిఁ గల్పించు | నది నిత్యుఁ డగ్రాహ్యుఁ డన వెలుంగు పురుషునిఁ దోఁపించు నరయంగఁ గర్మమ | యత్వంబు లేమి విద్యామయత్వ మతనికి నైజమై యతిశయిల్లుట శ్రుతి | పాటు నిత్తెఱఁగు సుజ్ఞాన మే మ |
|
| తే. |
హాత్మునకుఁ గల్గియుండు నయ్యార్యవర్యుఁ | డఖిల సంకల్పములఁ బాచి యాత్మ నాత్మ యంద కాంచి యనామయ మజర మమృత | మను పదమ్ముఁ బ్రాపించుఁ గృతాత్ములార! |
211 |
| వ. | అని యిట్లు కమలగర్భుండు. | 212 |
| క. |
జ్ఞాన పరినిష్ఠితాత్మకు | లైన విముక్తి పద నిర్ణయజ్ఞులచే స మ్మానిత యగు గతి యిది క | ర్మానుగతి విరక్తజన సమంచితము సుఁడీ!’ |
213 |
| వ. | అని నిర్దేశించి వెండియు. | 214 |
| క. |
‘కోరికలకుఁ జొరక యసం | గారూఢత గలిగి యెల్లయందును సమతం గూరిన చిత్తంబులు గల | సారాత్మకు లీ పథమునఁ జనుటకు శక్తుల్. |
215 |
| క. |
చెప్పితి సర్వంబును నీ | చొప్పున నడపుఁ; డెడ నొండు సొరనీకుఁడు; మీ రొప్పెడు తెరు విది దీనం | దప్పదు పరమపదసిద్ధి ధార్మికులారా!’ |
216 |
| క. |
‘అని యిట్లు కమలగర్భుఁడు | మునులకుఁ దత్త్వోపదేశమును జేసిన వా రనవద్య సమాధికులై | యనితర సులభ మగు సౌఖ్యమందిరి వత్సా!’ |
217 |
| వ. | అని పలికి గురుం డా శిష్యునితోడ. | 218 |
| క. |
‘నీవును నివ్వాక్యంబులు | భావంబునఁ బాదుకొలిపి పరమ సమాధి శ్రీ వాటింపుము; నిత్య వ | దావాప్తి ఫలించు నీ కనాయాసమునన్.’ |
219 |
| క. |
అని గురుఁడు ప్రబోధించిన | మనమునఁ దెలివొంది తత్సమంచితమార్గం బున నడచి పొందె శిష్యుం | డనామయం బజర మమృత మనియెడి పదమున్. |
220 |
| చ. |
అని వసుదేవసూనుఁడు సమాదరమేదుర చిత్తవృత్తిఁ జె ప్పిన విని ‘నారి యుల్లముల పెంపిటులుండునె వార లెవ్వరో వినుటకు నాదు డెందమున వేడ్క జనించె; నెఱుంగఁ జెప్పవే’ యనుటయుఁ బార్థుమోముఁ గృప నమ్మహితాత్ముఁడు సూచి నవ్వుచున్. |
221 |
| క. |
‘అనఘ! విను మే గురుఁడ, నా | మనంబు శిష్యుండు; విమలమానస! నీపైఁ బనుపడు ప్రీతిం జెప్పితి | ననితర సులభాతి గుహ్యమగు నిప్పదమున్. |
222 |
| క. |
విమలము నచలము నగు చి | త్తము నాదెస నేక భక్తి తత్పరముగఁ జే యుము; నిత్యము నీ యధ్యా | త్మము ననుసంధింపు పాసెదవు; దురితములన్. |
223 |
| క. |
సమరము నప్పుడు నీకీ | యమృతపద ప్రాప్తి హేతువగు సమ్యగ్బో ధము వివరించితి; నచలత | రమింపు మిందెపుడు శమధురాధుర్యుఁడవై.’ |
224 |
| వ. | అని యిట్లు కృష్ణుండు జిష్ణున కధ్యాత్మ విద్య వివరించె నని చెప్పినఁ ‘బరమ గురుండును విశిష్ట శిష్యుండును నగు నప్పురుష వరులు మఱియు నెవ్విధంబునం బ్రవర్తించి రాకర్ణించు కౌతుకంబు నా మనంబున నెసకం బెసగెడు మునీంద్రా! యెఱింగింపవే’ యని యడుగుటయు. | 225 |