పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము
తాను ద్వారక కరుగవలయు నని యర్జునునిఁ గృష్ణుఁ డడుగుట (సం. 14-50-49)
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె నట్లు ఫల్గును నఫల్గు విద్యా విశారదుం జేసి శౌరి యతనితోడ. 002
క. ‘నా చిత్తము వసుదేవునిఁ | జూచుట గోరియును, నీవు సుమనోవృత్తిం
జూచి, యనుమతి యొనర్చుట | వేచినయది; నన్నుఁ బుచ్చవే ద్వారకకున్‌.’
003
చ. అనవుడు నక్కిరీటి దగ నయ్యదువంశ వరేణ్యుతోడ ని
ట్లను; ‘నటు లేనిఁ బోవలయు హస్తిపురంబున; కిత్తెఱంగు సె
ప్పిన నిను ధర్మనందనుఁడు ప్రీతిగ నందుల కన్చిపుచ్చు; న
య్యనుమతి గల్గునట్లు దగ నాడెద నవ్విభుపాల నచ్యుతా!’
004
వ. అనిన విని దామోదరుండు దారుకు రావించి, ‘రథంబు పూన్పు’ మని నియోగించెఁ; దదనంతరంబ ధనంజయుండు దమతోడం జనుదేరం దగుపరివారంబు సమకట్టం బడవాళ్ళం బనిచె; నొక్కింతసేపునకు దారుకుండునుం దే రాయితంబుసేసి తేరం, బడవాళ్ళునుం బరిజనంబుల సన్నద్ధులం గావించి సన్నిహితులంజేయ, నా కృష్ణార్జునులు ప్రయాణోచితాలంకారాలంకృతులై, రథంబెక్కి, కరినగరపథంబు గైకొని చను సమయంబున. 005
సీ. వినయ మారంగ గోవిందున కిట్లను | గాండీవి; ‘దేవ! నీ కరుణఁ జేసి
కౌరవసైన్యసాగర ముత్తరింపంగఁ | గంటిమి; గురు భీష్మ కర్ణ ముఖ్య
దుర్జయవీరుల నిర్జించితిమి; నీవు | శాత్రవ యోధుల సమయఁ జేయ,
వెనుక నేము జయంబు గొనుచు వచ్చితిమి; తే | జంబును బేరు సౌఖ్యంబు నతుల
 
తే. మైన భవదీయ సుప్రసాదాతిశయము | కతనఁ బడసితి; మప్రతిహత మహాధి
రాజ్య సంపూజ్యుఁ డయ్యె ధర్మజుఁడు; సంశ్రి | తాభిరక్షణవ్రత నిరతాంతరంగ!
006
క. నీ మహిమ వొగడఁ గొలఁదియె? | దామోదర! విశ్వసంవిధాతవు; భవదీ
యామల తేజమ యగ్ని | ష్టోమము; గాలాత్మకత్వ శోభివి కృష్ణా!
007
క. భవదీయ శ్వసనము వా | యువు; నీ క్రోధముఁ బ్రసాద యోగంబును మృ
త్యువు లక్ష్మియు; నీ వలనన | యవుఁ బ్రీతియు మరణమును మహానందంబున్‌.
008
క. స్థావర జంగమ మయ జగ | దావిర్భావ స్థితి క్రియా విలయంబుల్‌
నీవలనన యగుచుండును | భావాతీతుఁడవు; సర్వపతివి; ముకుందా!’
009
వ. అని వెండియు. 010
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )