| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము |
| చ. |
అనుడు దయాళుఁ డైన హరి యర్జును చూచిన దివ్యమూర్తిఁ జూ పినఁ గని, సంప్రమోదమును భీతియు విస్మయముం బెనంగొనన్ మునిపతి పాణిపద్మములు మోడ్చి ‘నమః పురుషోత్తమాయ తే’ యనుచు, వినీతి నమ్ర మగునంగము నివ్వెఱ నిశ్చలంబుగన్. |
048 |
| వ. | ఒక్కింత నిలిచి నిభృత స్వరంబున. | 049 |
| సీ. |
‘పుండరీకాక్ష! యీ పుడమి యంతయును భ | వత్పాద పంక్తి సంవ్యాప్త మయ్యె; నంబరం బెల్లను నావృత మయ్యె నీ | మహిత సముజ్జ్వల మస్తకముల; నంతరిక్షము దావకాద్భుత కుక్షిదే | శంబులచేత సంఛన్నమయ్యె; భవదీయ మహనీయ బాహార్గళా నిచ | యాపిహితము లయ్యె నన్ని దిశలు |
|
| తే. |
బహుచరణముల, బహుశిరోభాగములను | బహుజఠరముల, బహు భుజాప్రకరములను దేవ! యిట్లు సర్వబును నీవ యై త | నర్చి; తిది నాదు కన్ను మనంబుఁ దనిపె.’ |
050 |
| వ. | విశ్వరూపా! యీ రూపం బుపసంహరించి, నీదగు నెప్పటి యాకారంబు గైకొనవే’ యనిన నప్పరమేశ్వరుండు ‘వరంబు గోరు’మని యానతిచ్చిన, నమ్మహితాత్ముండు ‘సంశ్రితార్తి హర! నీ మూర్తిఁ గంటి; నింతకంటె మిక్కిలి వరంబులును గలవే?’ యనుటయు. | 051 |
| క. |
ఆ దేవుఁ డతనితో ‘నటు | గాదు; ననుం గనుట శుభము గావింపక పో; దేది ప్రియ మడుగు; మిత్తుఁ బ్ర | మోదంబుగ నీకు’ ననిన ముని యిట్లనియెన్. |
052 |
| వ. | ‘అవశ్యంబును నా కట్లు గావలయు నని యవధరించితేని దేవా! యిది మరుదేశం; బిచ్చట జలంబు దుర్లభంబు; నాకు జలసన్నిధి యెప్పుడుం గలుగఁ బ్రసాదింపుము.’ | 053 |
| వ. | అనుటయు, నంబుజనాభుఁడు | తన యెప్పటి లలితమూర్తి ధరియించి, మునీంద్రునితోడ నన్నుఁ దలఁపఁగ | ననఘా! దొరకొను జలంబు’ లని పలికి తగన్. | 054 |
| వ. | వీడ్కొని చనియెం; బదంపడి యా భృగువంశవరుం డొక్కెడ మెలంగుచుండి, తృషితుండయి, హృషీకేశుం దలంచిన. | 055 |
| సీ. |
కుక్కలు చుట్టిరా నొక్కమాతంగుండు | బాణ బాణాసన పాణియును ది గంబరుండును, మలినాంగుండు, నగువాఁడు | దోఁచె నచ్చజలంబు దొరఁగుచుండు మేనితో; నమ్ముని వానిఁ దప్పకచూడ; | వాఁ ‘డోయుదంక! యివ్వారి డప్పి వోఁ ద్రావు’ మనుడు, నాభూసురాగ్రణి యొల్ల | నని పల్కెఁ; బల్కిన ‘వినుము నీవు |
|
| ఆ. |
నీరువట్టు శ్రమముఁ గూరిన నీ మీఁది | కరుణ వచ్చినాఁడఁ, గాదు నాక యర్థిఁ ద్రావు టొప్పు ‘ననియె; నా చండాలు | నలుకమెయి నదల్చె నత్తపస్వి. |
056 |
| వ. | అదల్చిన, నతండు సారమేయంబులుం దాను నంతర్ధానంబు సేసె; నా సంయమి వెఱఁగుపడి, యొక్కింత విచారించి, యిక్కపట ప్రచారంబు కృష్ణసంపాదితంబు గావలయు; నని యూహించు సమయంబున, నయ్యెడకుం గృష్ణుం డరుగుదెంచుటయుం, గనుంగొని, యమ్మహాత్మునితోడ నమ్మునివరుండు. | 057 |
| క. |
‘జలము నినుఁ దలఁపగా నిటు | గలుగునె; చండాలు నొడలఁ గాఱెడు నీరే నలఘుగుణ! త్రావుదునె యే | కొలఁది శ్రమంబైన; వరము కుచ్చిత మయ్యెన్.’ |
058 |
| చ. |
అనవుడుఁ గృష్ణుఁ డిట్టులను; ‘నాఱడిఁబోయెఁ బ్రయత్న మెల్ల; నీ వనఘ! యెఱుంగవైతి; సమయం బొకఁ డిమ్మెయిఁ గల్గె; నేర్పడన్ వినుము; నిలింప వల్లభుని నీకయి వేఁడితి నే సుధారసం; బనితరసాధ్యమైన శుభ మయ్యెడు భూతి దొలంగె నక్కటా! |
059 |
| వ. | అది యెట్లంటేని. | 060 |
| క. |
ఏను సుధ యడుగుటయు, హరి | ‘మానవునకు నేల యగు సమర్త్యత్వము? మే లైన తెఱఁ గొండు గోరుము; | దానిం దగ నిచ్చెదన్ ముదం బారంగన్.’ |
061 |
| వ. | అనిన నయ్యనిమిషపతి యాననం బాలోకించి. | 062 |
| క. |
‘నిను వేఁడుట మోఘముగాఁ | జనునే యె ట్లైన నాదు చనవు సెఱుప క మ్మునిపతికి నమృతరస మి’ | మ్మని ప్రార్థించిన మహాత్మ! యాతఁడు నాతోన్. |
063 |
| వ. | సమయంబు చేసికొని వచ్చె; నత్తెఱం గాకర్ణింపు; మమ్మహిత సౌజన్య ధన్యుండు. | 064 |
| శా. |
‘మాతంగత్వము దాల్చి, యే నరిగి, సమ్మానించి, యాభార్గవుం బ్రీతుం జేసెద; నట్టు లిచ్చిన సుధన్ హ్రీదూషిత స్వాంతుఁడై యాతం డొల్లకయున్న నేమి? విను; నా కన్యాయ్యవృత్తంబు గా; దీతంత్రంబున కీవ సాక్షి; యని తా నేతెంచె నిన్ గానఁగన్. |
065 |
| వ. | నీవు ప్రత్యాఖ్యానంబు చేసిన, నతం డంతర్ధానంబు చేసెం; గానిమ్ము; దాని కేమి సేయవచ్చు? నా యిచ్చిన వరంబు బొంకుగాకుండ నీకు జలం బెప్పుడుం గలుగం జేసెద. | 066 |
| చ. |
అనఘ! జలంబు నీవలసినప్పుడు మేఘము లీమరుస్థలం బున నొసఁగున్; భవద్యశము వొంపిరివోవ నుదంక మేఘనా మ నుత విహారముల్ గలిగి మాన్యత నెప్పుడు నియ్యెడం జరిం చును జలదంబు; లింక నను సువ్రత! దూఱకు; పోయి వచ్చెదన్.’ |
067 |
| క. |
అనినం బ్రీతుం డయ్యెను | ముని; యంతర్ధాన కలనమునఁ గృష్ణుండుం జనియె; నని చెప్పి మఱియును | జనమేజయ నృపతితోడ సంప్రీతి మెయిన్. |
068 |
| వ. | వైశంపాయనుం డిట్లనియె. | 069 |
| ఆ. |
‘మనుజనాథ! యెప్పుడును మరుదేశంబు | నందు నియతవృత్తి, నద్భుతంబు దలకొనంగ, నయ్యుదంక మేఘంబు లొ | క్కొక్క పుణ్యతిథుల నొలసి కురియు.’ |
070 |
| వ. | అనిన విని జనమేజయుండు ‘మునీంద్రా! యుపేంద్రుని శపించుటకు నుత్సహించిన యుదంకుం డేమి విధంబు తపంబున నమ్మహానుభావంబు నొందె? నెఱింగింపవే!’ యనుడు నా విభునకు వైశంపాయనుం డిట్లనియె. | 071 |