| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము |
| సీ. |
అతనికి గురుభక్తి కతనఁ జొప్పడియె న | త్తెఱఁగు పెం; పది విను తెలియ; నతఁడు తన గురుండైన గౌతమునకు శుశ్రూష | నియతిమైఁ జేయ సస్నేహ భక్తి కంబుగఁ బెద్దయుఁ గాలంబు చనిన, నా | సంయమిపతి శిష్య సమితి కెల్ల వివిధవరము లిచ్చి, వీడ్కొల్పి, పుచ్చి, యు | దంకుని దిక్కును దలఁప కుండె; |
|
| ఆ. |
అత్తపఃపరాత్ముఁ డతినిష్ఠఁ బరిచర్య | నడపు, చొక్కనాఁడు కడును వ్రేఁగు గలుగునట్టి వంటకట్టియమో పఱ్ఱు | గుదియ మోచి తెచ్చెఁ గురువరేణ్య! |
072 |
| క. |
అటు మోచి తెచ్చి యం దొక | జట పెద్దయుఁ దగిలియుండ, సరభసముగ వై చుటయు దెగి, మోపుతో ముం | దట నది పడియెను జరాసితచ్ఛవి మెఱయన్. |
073 |
| సీ. |
దాన నన్నియతుండు దనవయఃపాకంబు | నెఱిఁగి, శోకంబున నేడ్వ, నమ్మ హాముని యశ్రువు లంజలిఁ బట్టంగ | నిజపుత్త్రిఁ బనిచె; నన్నీరజాక్షి రయమునఁ బట్టి కరంబులు వేఁడిమి | నెరిసిన విడిచిన, ధరయుఁ దలరె; నమ్ముని యా శిష్యు రమ్మని చేరంగఁ | బిలిచి, ‘నీ వేటికి నలఁతఁ బొందె!’ |
|
| ఆ. |
దనిన, నతఁడు ‘శిష్యులందఱపైఁ గల | కరుణ మీకుఁ బెద్దకాల మేని మునివరేణ్య! నావలన లేదు; దానికి | నుమ్మలింప కెట్టు లుండవచ్చు?’ |
074 |
| వ. | అనుటయుఁ గృప చిగురొత్తు చిత్తంబుతోడ. | 075 |
| క. |
‘ఎలప్రాయ మిచ్చితిని నీ | కలఘుమతీ! యిచ్చెదను మదాత్మజ, నుల్లం బలరఁగఁ బెండిలి గ’ మ్మని | పలికి, మఱియు నా తపస్విపతి యి ట్లనియెన్. |
076 |
| క. |
‘నీ తేజంబు సహింపఁగ | నీ తామరసాక్షి దక్క నెవ్వరికిఁ దప స్స్ఫీతా! శక్యముగా; దిది | చేతోగతిఁ జూచి, తగవు సిద్ధించుటకై. |
077 |
| వ. | ఇమ్ముద్దియకును. | 078 |
| క. |
తను వొండుగఁ జేసెద; నది | జననాంతర మెట్టు లట్ల సజ్జననుత! నీ వనుమానము దక్కుము, యౌ | వనమును గైకొనుము, కన్య వరియింపు తగన్. |
079 |
| వ. | అధర్మంబు గాకుండు నట్లుగా వరంబిచ్చితి’ నని యనుగ్రహించి, యక్కన్యకారత్నంబునకును. | 080 |
| చ. |
తనులత యొండు చేసిన, నుదంకుఁడు యౌవనలక్ష్మిఁ దాల్చి య వ్వనిత వివాహమయ్యె నృపవర్య! పదంపడి యమ్మునీంద్రుతో ‘ననుఁ బనిగొండు మీరలు మనంబున నెద్ది దలంచి వేడ్క సే సిన నది దెత్తు; మీకరుణఁ జేసియ కల్గెడు నాకు శక్తియున్.’ |
081 |
| క. |
అని విన్నపంబు సేసిన | విని దక్షిణఁ బ్రీతియగుట వే ఱొరులకుఁ గా కనఘ! భవదీయ చరితం | బునఁ జూవే నాకు ననియె ముని మనుజేంద్రా! |
082 |
| తే. |
అంత నిలువక మునిపత్ని కతఁడు భక్తి | నెఱఁగి తల్లి! మీ రానతియిండు, మీకు వలయునట్టి పదార్థ మవశ్యమును స | మాహరింతు నే, ననుటయు నయ్యహల్య. |
083 |
| చ. |
‘వలవదు; లాఁతి వాఁడవె? భవద్గుణతోషిత గౌతమాంచి తో క్తులు మది నూఁదు మన్నను నకుంఠిత చిత్తత నొత్తి పల్కె న య్యలఘుతపస్వి యాసతి ప్రియంబున మిత్త్రసహాఖ్యు దేవికుం డలములు దెమ్ము; నాకుఁ బ్రకటంబుగఁ బెంపు వహింపు తమ్ముఁడా! |
084 |
| వ. | అని యిట్లు పనిచిన నాతండు ప్రీతుండయి యప్పనికిం జనియెఁ; బదంపడి గౌతముఁ ‘డుదంకునిం బొడగాన; మెచట నున్నవాఁ? డని యహల్య నడిగిన నా భృగువంశవరుం డరిగిన తెఱంగెఱింగించిన, నద్దయాళుం డద్దేవి యాననం బాలోకించి. | 085 |
| క. |
ఆ సౌదాస నరేంద్రుం | డాసుర చరితుండు; శాప మాతని నటు కాఁ జేసిన యది; మానుషమాం | సాసక్తుం డగు టెఱుంగఁ డమ్ముని యతనిన్. |
086 |
| సీ. |
అకట! యెట్లగునొక్కొ!’ యనుపల్కు కృపదోఁపఁ | బలికిన, నమ్ముగ్ధ భయము గొనుచు, ‘నెఱుఁగ నిట్లగుట, మునీశ్వర! నా మీఁది | దయ చిగురొత్త నాతనికిఁ గీడు రా కుండునట్లుగాఁ జేకొని కావవే’ | యనిన నా సంయమి ‘యంత వెఱవ నేల? యే నతనికి నెడరు రానీ’ నని | తగ నూఱడించె; నుదంకుఁ డరిగి |
|
| ఆ. |
మనుజ రక్తసిక్త తనువును, గోర మీ | సములు, వృత్తలోచనములు నైన యుగ్రమూర్తితోడ నొక్క శూన్యాటవి | నెలమి నున్న యన్నరేంద్రుఁ గాంచె. |
087 |
| క. |
ముని యిట్లు నెమ్మిఁ గాంచినఁ | గని యతఁ ‘డాఁకొనుటఁ జేసి గాసిలి యెచ్చోఁ గను వాఁడనొ? తగు భక్ష్యం? | బనుచుండఁగ వచ్చితివి ప్రియంబుగ’ ననుడున్. |
088 |
| వ. | ఉదంకుం డతని కిట్లనియె. | 089 |
| క. |
‘గురుకార్యంబునకై భూ | వర! నిన్నుం గాన నేను వచ్చితి; గుర్వ ర్థ రతులు హింస్యులు గా; రి | ట్లరయక యాడుదె యధర్మ మగు మాట నృపా! |
090 |
| వ. | అనుటయు. | 091 |
| క. |
‘దినమున మూఁడవ యామం | బున నపరార్ధంబు యోగ్యముగ నాహారం బునకుం గల్పించిరి నా | కనిమిషు, లటు గాన మాన; నాఁకలి పుత్తున్.’ |
092 |
| సీ. |
అని పల్కె సౌదాసుఁ; డమ్ముని ‘యట్లేని | నధిప! మద్గురు కార్య మాచరించి, వచ్చెద మగుడ నవశ్యంబు; నా మాట | ననృతంబు చొరదు; నీ వర్థికోటి కిష్టపదార్థంబు లిత్తు; పాత్రమ యేను; | గురులకుఁ గాఁగ నా కోరు కోర్కి నీవ తీర్తని కృత నిశ్చయత్వంబున | నరుగుదెంచిన వాఁడ’ ననుడు నృపతి |
|
| ఆ. |
‘యట్లకాక; యేమి యర్థించి వచ్చితి; చెప్పు ‘మనిన నతఁడు చిత్త మలర ‘ననఘ! నీదు పత్ని యర్థిమై ధరియించు | కుండలంబు’ లని యతండు సెప్పె. |
093 |
| వ. | చెప్పిన విని యమ్మనుజవరుం ‘డొరులధనం బిచ్చు వారలు గలరె? కుండలంబు లడుగ కొండెద్దేనియు నడుగు’ మనుటయు, నాసంయమి ‘నీవు నెపంబిడి త్రోవం గలవాఁడవు గావే నన్యవస్తువు లొల్ల’ నని పలికిన, నా భూవల్లభుం డమ్మాట కియ్యకొని, ‘యాన్నాతి యున్న చోటికిం జను; మేఁ బుత్తెంచితి, నని చెప్పి, నీ వాంఛితం బెఱింగింపు’ మని నియోగించిన, నమ్ముని ‘యద్దేవి యెచ్చోట నున్న యది?’ యని యడిగిన నప్పుడమిఱేఁ ‘డల్లదె తన్నివాస ప్రదేశం’ బని చూపినం బోయి. | 094 |
| సీ. |
అద్దేవిఁ గని యతఁ డట్ల చెప్పిన ‘ముని | వల్లభ! నా కానవాలు దెమ్ము నృపుపాల’ ననియె నన్నెలఁత; యుదంకుండు | చనుదెంచి విభు నభిజ్ఞాన మడిగె; నాతఁ ‘డీగతి సేమ మగు నని నిష్ఠింప | రా; దిది వెలిగాఁగ లేదు వేఱ గతియును ననుపలు కతివకు నా యిచ్చు | వర్ణితాభిజ్ఞాన నిర్ణయముగఁ |
|
| ఆ. |
జెప్పు; మనిన సంతసిల్లి యమ్మదయంతి | కడకు నరిగి, తత్ప్రకారమునన పలుకుటయును, ‘భర్తపనుపున నిచ్చెదఁ | గుండలములు నీకు గురుహితార్థి!’ |
095 |
| వ. | అని యక్కొమ్మ యమ్మహితాత్మునితో మఱియును. | 096 |
| సీ. |
‘సురులు గంధర్వులు నురగులు నిక్కుండ | లములకుఁ బెక్కుపాయముల వేచి తరుగుదు; రెంగిలి పొరసిన, నేమఱి | నీవు నిద్రించిన, నేల నిడిన, నపహరింతురు; భక్తి నర్చించి యివిదాల్ప | నాఁకలి నీరువ ట్టగ్నిభయము విషవికారము, భూతబేతాళ బాధలు | పొరయవు; వినుము, బాలురకు నైనఁ |
|
| ఆ. |
బెద్దవారి కైనఁ బెట్టిన నయ్యయి | కొలఁది నమరియుండుఁ; గురియుఁ బసిఁడి; వీని నప్రమత్త వృత్తిమైఁ గొని చను | మయ్య! గురులు నిన్ను నభినుతింప.’ |
097 |