పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము
ఉదంకుఁడు మదయంతివలనఁ గుండలంబులు పుచ్చికొనుట (సం. 14-57-3)
వ. అని చెప్పి యప్పరమ పతివ్రత భక్తి ప్రీతి వినయంబులు మనంబున నంకురింప, నక్కుండలంబు లొసంగినం, బ్రమోదం బెసంగ నాశీర్వాదంబు చేసి, యాసంయమివరుం డబ్భామచేత నా మంత్రితుండై, భూమీశ్వరు పాలికి, వికాస లసిత వదనారవిందుం డగుచు నేతెంచి, యక్కుండల లాభంబు ప్రకటించి, దీవించి, ‘దేవా! నీ వలనం గృతార్థుండ నైతి’ నని పలికి, ‘నా కానవాలుగా నీవు చెప్పిన వాక్యం బత్యంత గూఢంబు; తదభిప్రాయంబు నెఱుంగ వలతుం; జెప్పం దగియుండు నేనిం జెప్పు’ మని యడిగిన, నతం డతని తోడ. 098
సీ. ‘బ్రాహ్మణజనముల రాజులు పూజింతు; | రటుగాన నేను విప్రార్చనంబు
సేయుదు; విప్రుని చేతన యిట్లైతి | వెడదప్పునన; యొండు వెరవు నాకు
దురితంబు వాపంగ దొరకొన; దది కార | ణముగ భూసుర పూజనంబు దుష్క
రము; దీన మేలు గందు మనంగ రా; దిది | గాదన్న వేఱొండు గలదె మార్గ;
 
తే. మని యభిజ్ఞానముగ మదయంతి కపుడు | చెప్పి పుచ్చితి; నిట్లు విశిష్టరత్న
మయ మహాకుండలము లిచ్చి మాన్తుఁ గీడు | నీకతన; నను తలఁపున లోకవంద్య!’
099
వ. అనియె నా భృగువంశ వరేణ్యుని పుణ్యసన్నిధింజేసి యా సౌదాస నరేంద్రునకు సంప్రాప్త సమాధాన నూతన సత్త్వంబు గలుగుట కతంబునం గార్యదర్శనంబును, గుండలదాన శ్రద్ధయు, శాంతవచనంబునుం గలిగెఁ; దదీయవచన శ్రవణానంతరంబ యుదంకుం డతనితో ‘మిత్రత్వంబు సంభాషణమాత్ర సిద్ధంబగుట బోధవృద్ధులు చెప్పుదు ‘రేను నీవలనం గృతార్థుండ నైతిఁ; బోవుచున్నవాఁడ; మగిడి వచ్చెద; నని పలికితి; ‘బొంకువడకుండ వత్తు’ ననినఁ జిత్తంబు కృపాయత్తంబగుచుండ నా భూపతి యత్తాపసోత్తము నాననం బాలోకించి. 100
ఉ. ‘చంపెడు నట్టి నా కడకు సంయమివల్లభ! వత్తురయ్య? నీ
పెంపును నిక్కముం దెలిసెఁ; బ్రీతుఁడ నైతి; మదార్తి నీ తప
స్సంపదఁ జేసి పాపు’ మని సమ్మతిఁ బల్కిన వీనులందుఁ బే
రిం పొలయం, బ్రసన్నత వహింపఁగఁ జిత్త ముదంకుఁ డిట్లనున్‌.
101
ఉ. ‘ఏమిటనైన నొప్పమి నరేంద్ర! సుచిత్తులఁ బొందె నేనియున్‌
వే మరలున్‌; భవద్గుణమ వీతకళంకునిఁ జేసి నిన్ను; సాం
ద్రామలకీర్తి గౌతమ మహాముని చల్లని చిత్తవృత్తి నీ
పై మలఁగించెఁ గావలయుఁ బార్థివసత్తమ! పొందు మున్నతిన్‌.
102
క. అని పలికి, మఱియుఁ బలుదీ | వన లిచ్చి యతండు గారవమున నతనిమేన్‌
దన కరముల నివిరి, ప్రియం | బొనర్చె; నిర్దురితుఁ డైన యుర్వీపతియున్‌.
103
వ. భక్తి వినయ సంభరితుం డయి, యప్పరమమునిం బ్రస్తుతించి, నమస్కరించి, యామంత్రణంబు చేసిన, నమ్మహాత్ముండు కుండలంబులు కృష్ణాజినంబునం బదిలంబుగా ముడిచికొని, గౌతమమాశ్రంబునకు రయంబునం బోయి పోయి, పక్వఫలంబులం బెరిఁగిన బిల్వంబుం గని, యాఁకటి పెల్లునం దదీయ విటపంబున సకుండలం బగునయ్యజినంబు దగిల్చి, యమ్మహీరుహం బెక్కి ఫలంబులు గోసికొనుచుండె. 104
సీ. గాలి నవ్విటప మాలోల మగుడుఁ దగు | లెడలి, యయ్యజినంబు పుడమిఁ బడినఁ
గని, యొక్కనాగంబు గ్రక్కునఁ జనుదెంచి | వెసఁ బుచ్చికొని కడు వేగ పఱవఁ
గాంచి యుదంకుండు గ్రమ్మన దిగదాఁటి | వెనుకొనునంతకు గనపపుట్టఁ
జొచ్చె నయ్యురగ, మా సువ్రత పరుఁడు దీ | వ్రముఖ కాష్ఠము గొని త్రవ్వఁదొడఁగె;
 
తే. దాని సైరింపఁ జాలక ధరణి తలరె; | విప్రుఁడై వచ్చి గీర్వాణవిభుఁడు గొయ్య
కోలఁ ద్రవ్విన మాత్రఁ బాతాళయాన | మేల సిద్ధింపనేర్చు మునీంద్ర! వినుము.
105
వ. పాతాళభువనం బిచ్చటికి సహస్రయోజనంబుల నున్నది; కుండలంబులు గొనిపోయిన భుజంగం బైరావతా పత్యం’ బనిన విని యమ్మునిశిష్యుండు. 106
క. ‘పాతాళంబున నున్నను | వే తెత్తుం గుండలములు; విను; మప్పని నా
చేతం గాకున్న నసు | వ్రాతము విడువఁబడు; నిది ధ్రువం’ బని పలికెన్‌.
107
చ. పలికిన నత్తపస్విదృఢభావ మెఱింగి సురేంద్రుఁ డొండు ప
ల్కుల పని నిల్పి, కాష్ఠమునకుం గులిశంబునఁ గల్గువాఁడియున్‌
బలువును నిచ్చి వజ్ర చనె బాంధవ మేర్పడఁ జెప్పి; భీతిమై
నిల దెరు విచ్చె; నమ్మునియు నేడ్తెఱఁ జొచ్చె భుజంగలోకమున్‌.
108
వ. చొచ్చి యనేక ప్రకార ప్రాకార పరిరక్షితంబును, బహురత్న దీప్తిజాల దేదీప్యమానంబును నైన యమ్మహనీయ లోకం బాలోకించి, దశయోజనాయామంబునుం బంచయోజన విస్తారంబును నగు తద్ద్వారంబు గని యతండు కుండలాహరణంబు దుర్లభం బను తలంపున డిల్లపడియె; నయ్యెడ నరుణ వదనంబును నసితాంగంబును సితవాలంబునునై వెలుంగు తురంగం బతని కిట్లనియె. 109
ఉ. ‘ఆతత మైన నాదగు నపానము నూఁదు; మొకింతయున్‌ జుగు
ప్సాతురవృత్తి నీదుహృదయంబునఁ జొన్పకు; లోకవంద్యుఁ డ
గ్గౌతము నాశ్రమంబున నఖండితభక్తి నుపాస్తి చేసి, నన్‌
బ్రీతునిఁ జేసినాఁడవు; వరిష్ఠతపోధన! యట్లు గావునన్‌.
110
వ. నీకుం బొడసూపి, యైరావత సుతుం డపహరించిన సమంచిత కుండలంబులు మగుడం జేరెడు నుపాయం బుపదేశించితి; ననిన నుదంకుం ‘డేను నిన్ను నెఱుంగ; నుపాసించుట యెట్లు గలిగెఁ? దెలుపు’ మనుడు నయ్యశ్వం బతనితోడ ‘భవద్గురునకు గురుండం; బావకుండ; నీవు శుచివయి సభక్తికంబుగా నిత్యంబును నన్ను నియతిం బూజించి; తత్తెఱం గెఱుంగవే’ యని పలికినం బ్రీతినొంది యతండు తదీయోపదిష్ట ప్రకారం బాచరించిన. 111
సీ. ఘోటకోత్తమ రోమకూపంబులం దెల్ల | నొక్కట ఘనధూమ ముద్గమించి,
కవిసి, పాతాళ లోకంబంతయును గప్పి | వాసుకి ప్రభృతి నివాస భూము
లుపరుద్ధ భావంబు నొందె; నైరావతా | వాసంబు హాహారవంబు తోడ
నాకులంబయ్యె; న ట్లతిదారుణంబైన | పెనుఁబొగ నెంతయు భీతి నొంది
 
ఆ. యమ్మునీంద్రు కడకు నహివరుల్‌ రయమున | వచ్చి, భక్తి నర్చలిచ్చి, వినతు
లై తదీయ కార్య మడిగి యెఱింగి, వే | తెచ్చి కుండలంబు లిచ్చి రధిప!
112
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )