పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము
పరిక్షిత్ప్రాణదానంబునకై కుంతీసుభద్రలు కృష్ణుఁ బ్రార్థించుట (సం. 14-65-25)
క. ‘గతి నీవె నాకు, మత్సం | తతికిని; నీ యల్లుఁగుఱ్ఱతనయుఁడు పుట్టెన్‌
మృతుఁడై క్రూరుండగు గరు | సుతుని యిషీకాస్త్ర వహ్నిఁ జూఁడిన కతనన్‌.
169
సీ. దేవకీపుత్త్ర! సంజీవితుఁ జేయవే | యబ్బాలు; నద్దారుణాస్త్ర సంప్ర
యోగంబు నపుడు కృపాగరిష్ఠుండ వై | చేసితి ప్రతిన ‘గాచెద నవశ్య
మును నుత్తరాగర్భజనితు నే’ నని; బాలు | బ్రదుకుతోడిద నాదు బ్రదుకు; ద్రుపద
తనయా సుభద్రలు, ధర్మజుం డనుజు, లా | శిశువు సంజీవితుఁ జేయకున్న
 
ఆ. బ్రదుక; రన్వయమున కుదక పిండ ప్రదా | నంబు లెడలు; మత్స్యనందనయును
నూఱడింపఁ బడియె నొకనాఁడు నీ చేత; | దాని యార్తి కరుణఁ దలుఁగవయ్య!
170
వ. దేవా! నీ విక్కులంబు గలిగించినవాఁడ; వింకను నీవ వీని బ్రదికింపవే’ యని పల్కుచుం బుడమిఁబడిన గొంతి నగ్గోవిందుం డనునయ వచనంబుల నూరార్చి యెత్తె; నట్టియెడ సుభద్ర యమ్మహాత్మునితో నిట్లనియె. 171
క. ‘గురుసుతుఁడు భీమునకు నై | పర మాస్త్రం బెత్తె; దాని ఫల మందంగా
నరుఁడును దత్పత్నియుఁ గాం | చిరి తుది; నీకు నేమి చెప్పుదుఁ బ్రభువా!
172
క. నీ మఱఁది యా కొడుకుపైఁ | బ్రేమం బెప్పుడును బెంపఁ బ్రేలెడి; మనుమం
డీమెయి వమ్మయి పోయిన | నేమి యగునొ యెఱుఁగ; నీవ యెఱుఁగుదు దీనిన్‌.
173
సీ. ధర్మజుం డెమ్మెయి ధరియించు నెవ్వగ? | పవన నందనుఁడును గవలు నేమి
వెరవున నుపశమింతురు? దీని విను. దేవ! | యస్త్రప్రయోగంబు నపుడు నీవు
గురుసుతు నదలించి కుత్సిత! నిన్ను మో | ఘాస్త్రునిఁ జేసెద నంటి; దాన
నూఱడియుండుదు ముజ్జ్వల తేజ! నీ | మహితానుభావత మాకు నెల్లఁ
 
ఆ. దెలిసి యుండుఁ గాన యలుకము; సత్య ద | యాశ్రితాభిరక్ష లనఘ! నీకు
నైజములు; శిరః ప్రణతి నేను వేఁడెదఁ | గరుణ నిక్కులంబుఁ గాచికొనుము.
174
తే. ఏ విధంబునఁ గోలుపోనీవు నీవు | పాండవుల; నీదు సన్నిధిఁ బాపకర్మ
శీలుఁడైన యశ్వత్థామ గోలుపుచ్చె; | వాని నే మనఁ గలదు దుర్వారతేజ!’
175
వ. అని వెండియు. 176
చ. ‘భువనము లొక్కపెట్టఁ మృతిపొందిన జీవము లావహింపనే
ర్తు; వలచినట్టులైన గుణరూఢుఁడు మేనమఱంది పౌత్రుఁ జా
వ విడుతె? వంత పెంపున నవారణ నీ యెదురం బ్రలాపముల్‌
వివిధము లే మొనర్చితిమి వెఱ్ఱులమై యిటు భక్తవత్సలా!’
177
తే. అనినఁ గృపయును శోకంబు నగ్గలింప | వనజనాభుండు జను లర్థి వినఁగఁ ‘బిన్న
వాని బ్రదికింతు; వగవంగ వలవ’ దనియె | నెలుఁగు జలదస్వనమ్ము న ట్లెసక మెసఁగ.
178
వ. ఎల్లవారును బ్రమోదంబు నొంద నట్లు పలికి, సూతికాగృహంబునకుం గుంతీ ప్రభృతులు తోడ రా నతండు వోవునప్పు, డది ధవళకుసుమ సితసర్షప లాజ పూర్ణకుంభ ప్రముఖ మంగళవస్తువులను, బ్రజ్వలితపావక ప్రదీప్త శస్త్ర పిచుమంద పల్లవాది భూత (భయ) పరిహారక పదార్థంబులను, జతుర వృద్థాంగనా చికిత్సక దక్షపరిచారికా ముఖ్యహితకారి పరివారజన ప్రవర్తనంబులను బరిశోభితంబయి యుండె; నమ్మందిరం బా గోవిందుండు ప్రవేశించె; నట్టియెడ నంతకమున్న. 179
సీ. కడచి ద్రౌపది చని యడలునఁ బడియున్న | మాత్స్యనందనతోడ ‘మాధవుండు
చనుదెంచె వీఁడె; సవినయంబుగాఁ గను’ | మనవుడు నుత్థిత యై వికీర్ణ
వేణీభరంబుతో వినతి యొనర్చి ‘భ | క్తార్తి వాపుట నీకు నతిదృఢ వ్ర
తంబు కదే! దేవ! దయ వెలయంగ నీ | శిశువు సంజీవితుఁ జేయవయ్య!
 
తే. నీవు గూర్తేని మేనల్లునికిఁ దదీయ | పుత్త్రు ద్రోణుని పుత్త్రుండు పొలియఁజేయు
వాఁడె? పతిహీన యగుపాపవతికిఁ బుత్త్ర | హీనతయును బాటిల్లిన నెట్లు బ్రదుకు?
180
ఉ. నందను చావు నిక్కమయినం జనుటప్పుడు కల్గు దేవకీ
నందన! యెల్ల భంగి నరనందను పాలికి; నాజి కేచి పో
వం దనతోడి పెంపునకు వారక యిచ్చిన బాస డప్పె; నిం
కం దనుఁ గన్న దెప్పు నొడికాఁడని కొంకెదఁ గాని యచ్యుతా!
181
తే. పద్మనాభుండు వచ్చిన బాలుఁ జంకఁ | బెట్టుకొని పోయి మ్రొక్కింతుఁ బ్రీతియెసఁగ
నని తలంచుచు నుండితి; నమ్మనో ర | థంబు విఫలంబుగాఁ జేసె ద్రౌణి పేర్చి.’
182
వ. అని యంత నిలువని వలవంత పెంపున బాలశవంబు నెత్తికొని యంకతలంబున నిడికొని, తదాననం బాలోకించి. 183
ఆ. ‘తాత లోకగురుఁడు దామోదరుఁడు వచ్చి | యుండ లేచి మ్రొక్క వుజ్జ్వలాంగ!
ధర్మవేది యైన తండ్రికిఁ బుట్టి య | ధర్మపరుఁడ వగుట తగునె నీకు.
184
క. కనువిచ్చి గొంతిఁ జూడుము. | ననుఁ జూడుము, ద్రుపద నృపతనయఁ జూడుము; నీ
జనకుని తల్లి సుభద్రం | దనయా! చూడు తల యెత్తి దరహాసముతోన్‌.’
185
చ. అని పలవించి యా సరసిజానన మూర్ఛ మునింగి నేలవ్రా
లినఁ గరుణంబు పెంపున విలీనతఁ బొందు మనంబులున్‌ సబా
ష్పనయన యుగ్మకంబులును, బాడఱు మోములు నైన కౌరవాం
గనల యలంతఁ గాంచిన వగల్‌ మిగులుం బగవారి కేనియున్‌.
186
వ. ఒక్కింత సేపునకుం దెలివొంది విరాటనందన ధరాతలంబునం బడియున్న భంగిన ఫాలతలంబునం గేలు మొగిచి గోపాలదేవునకు మ్రొక్కుచు వెక్కుచు శరణు శర ణని పలికిన, నప్పరమకృపాపరుం డోడ కోడకు మను చుఁ బ్రాదప్రక్షాళనోపస్పర్శనంబు లాచరించి, అశ్వత్థామ ప్రయుక్తంబును బ్రహ్మశిరోనామకంబును నగునమ్మహాస్త్రం బుపసంహరించి, యబ్బాలశవంబు శయ్యాతలంబునం బెట్టంబనిచి, దరోల్లసితులయిన యెల్లవారలం గలయం గనుంగొని. 187
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )