| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము |
| తే. |
‘మీఁద బొం కగుమాట యే మీరు వినఁగ | నాడ; నిబ్బాలు బ్రదికింతుఁ; జూడుఁ డఖిల జనులు నిప్పుడ; తేలుండు సంతసమున; దీని విని పాండవులు ప్రీతి నూనువారు.’ |
188 |
| వ. | అని ప్రతిజ్ఞ సేసి యిట్లనియె. | 189 |
| తే. |
‘పగఱయెడ నైన నే బొంకు పలుక నేని, | సమరముఖమున నెన్నఁడుఁ జలితవృత్తిఁ బిఱిఁది కడుగిడ నేని, యిప్పిన్నవాని | యంగమున జీవ మీ ప్రొద్ద యావహిల్లు. |
190 |
| క. |
ధరణీసుర కులము నెడం | గర మెక్కుడు ప్రియము నాకుఁ గలదేని, సధ ర్మరతుఁడన యేని, నియ్యు | త్తరాసుతుఁడు లబ్ధజీవితత్వము నొందున్. |
191 |
| క. |
నరునియెడ నామనంబున | విరోధ మెన్నఁడును నేమి విధమున నైనం బొరయమి నిజమేనియు సు | స్థిరముగ నిబ్బాలుమేన జీవము సెందున్. |
192 |
| క. |
నిక్కపు ధర్మువు నన యే | నక్కంసాదుల వధించు టారసి, చూడన్ నిక్కువమై యార్యజనుల | కెక్కిన యేని నసువర్గ మీ శిశువు గనున్. |
193 |
| తే. |
మహిత సత్యంబుఁ బరమధర్మంబు గాఢ | నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్ర తిష్ఠితంబులై నాయందుఁ దేజరిల్లు | నేని నిబ్బాలునకు జీవ మిపుడ వచ్చు.’ |
194 |
| వ. | అని యిట్లప్పురుషోత్తముండు పలికిన. | 195 |
| సీ. |
బాలుని మేనికిఁ బ్రాణముల్ వచ్చిన | నల్లన కదలెఁ దదంగకములు; మఱి కనువిచ్చె; నత్తెఱఁగు తెల్లంబుగాఁ | గని గొంతి మొదలైన కౌరవాంగ నలు మనంబులు నిండి, యలువులఁ బాఱెడు | నానందపూరంబు లనఁగఁ బొల్చు హర్ష బాష్పములు రోమాంచ కంచుకిత దే | హంబులు నై యలరార, నఖిల |
|
| తే. |
జన సమూహమ్ములును సంతసమునఁ దేలి | గగనమున దివ్యవాణి యక్కమలనాభుఁ బొగడె; మీ తండ్రి యున్న యప్పుణ్య గృహము | కరము శోభిల్లె నప్పుడు కౌరవేంద్ర! |
196 |
| ఉ. |
ఉత్తర బిడ్డ నెత్తికొని యొయ్యన మో మలరంగ వచ్చి య త్యుత్తమతేజుఁ డైన పురుషోత్తము నంఘ్రుల పొంత భూస్థలిం జిత్త మెలర్పఁగాఁ దనదు చెన్నగు ఫాలము సేర్చినన్ ముదా యత్తమనస్కుఁడై యతఁడు సాదరభాషల గారవించుచున్. |
197 |
| క. |
వినుత బహురత్న విస్ఫుర | దనేక భూషణ నికాయ మబ్బాలున కి చ్చినఁ దక్కటి యదువీరులు | జననాయక! యొసఁగి రక్కజంబుగఁ దొడవుల్. |
198 |
| వ. | అప్పుడు. | 199 |
| తే. |
ఆత్మకులము పరిక్షీణమైన జనన | మొందెఁగాన యియ్యభిమన్యు నందనునకు నర్హమగుఁ బరిక్షిన్నామ మనియెఁ గృష్ణుఁ | డఖిల జనములు వినఁ బౌరవాధినాథ! |
200 |
| వ. | అట్లు పుండరీకాక్షుండు పాండవ సంతానంబు గలిగించె; న ట్లప్పరమపురుషుచేతం బ్రత్యుజ్జీవితుం డైన భవజ్జనకుం డేకమాసవయస్కుండగు కొలంది నొకపుణ్య దివసంబున. | 201 |
| సీ. |
ధర్మసుతుండును దమ్ములు నమ్మహా | కనక మ ట్లెత్తించికొని, యుదాత్త వైభవ మెసఁగంగ వచ్చినఁ, గృష్ణవి | యుక్తులై విదుర యుయుత్సు లర్థిఁ గస్తూరి నీళ్ళుల కలయంపులను, గప్పు | రంపు మ్రుగ్గుల, బహురత్న తోర ణములఁ దోరపు ముత్తియముల నొనర్చిన | ప్రాలంబమాలికా పంక్తులను, బ |
|
| తే. |
సిండి పూర్ణ కుంభములను, విశిష్ట మరక | తప్రకరమయ కదళికాస్తంభములను గరము దోరంబుఁ జిత్రరేఖంబుఁ గా న | లంకరించిరి పురముఁ గులప్రదీప! |
202 |
| వ. | సకలజనంబులుం గయిసేసి కలయం బొలయ నపు డప్పురంబు చంద్రోదయ ఘూర్ణమానంబయిన యర్ణ వంబు ననుకరించె; నయ్యచ్యుతుండును బలదేవ సాత్యకి ప్రద్యుమ్న ప్రముఖులు ప్రమోదంబునం బొంపిరి పోవుచుంబెంపారునలంకారంబుల నభినవోదార చారుత్వంబు వహించి యెదురు చనిపాండవులం గని; రయ్యిరుదెఱంగుల వారలు సౌహార్దంబును సౌముఖ్యంబును సౌజన్యంబును నత్యంతంబును మెఱయ నర్హంబులగు నాచారంబులు నడపి; రట్లు కృష్ణ సమేతులై మీ తాతలు హర్షోల్లాస భావమానులగుచు నా సమగ్ర కాంచన సంచయంబుఁ బురస్కరించుకొని పురప్రవేశం బాచరించి. | 203 |
| క. |
తొలుత ధృతరాష్ట్ర గాంధా | రులఁ గని, మఱి గొంతిఁ గాంచి, ప్రోన్మీలచ్చ క్షులుఁ బ్రమద సంభరిత చి | త్తులు నయిన యుయుత్సునిన్ విదురునిన్ బ్రీతిన్. |
204 |
| వ. | కానిపించికొని సంభావించి సంభృతాహ్లాదు లగుచుం గృష్ణాది యాదవ లోకంబునుం దారు నొకరమ్య మండపంబున నుండి; రట్టియెడ. | 205 |