పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము
వ్యాసుఁడు కృష్ణ సహితులై యున్న పాండవుల యొద్దకు వచ్చుట (సం. 14-70-8)
సీ. తగువారిఁ గాంచి యత్యద్భుతం బగుభవ | జ్జనకుతెఱంగు విస్తార మొప్పఁ
జెప్పిన, వార లచ్చెరువాటు సంతసం | బును నెమ్మనంబులఁ బెనఁగొనంగఁ
బద్మనాభు ననేక భంగుల వినుతించి, | ‘యిట్టివి వింతలే? యెల్లనాఁడు
నిట్టులకాక మాయెడ నీదు కరుణ పెం’ | పని యభినందించి, రట్లు గలిసి
 
తే. నెమ్మిఁ దారును గృష్ణుండు సమ్మదమున | నుచిత వర్తన కలితులై యుండఁ గొన్ని
దివసములకు సంప్రీతి నేతెంచి బోధ | భాసితుం డైన సత్యవతీసుతుండు.
206
క. ఏతెంచిన గోవింద స | మేతంబుగ నెదురుకొని మహిత పూజా సం
ప్రీతునిఁ గావించి, యతని | మీ తాతలు గొలిచియుండి, మృదు వచనములన్‌.
207
వ. సముచితగోష్ఠినడపి; రప్పాడండవాగ్రజుండు మునిజనాగ్రణితో ‘భవత్ప్రసాదంబునం బడసిన యమ్మహా ధనంబు మహానీయంబుగా నశ్వమేధయాగంబునం దుపయోగంబు నొందింపఁ గోరెద; ననుజ్ఞ యీవే!’ యనిన సంతసిల్లి యాసంయమివరుం డిట్లనియె. 208
ఆ. ‘తురగమేధ మఖిల దుష్కృతహరము, నీ | వది సమగ్ర దక్షిణాన్వితముగఁ
జేసి నిర్మలత్వ భాసమానుండ వై | వెలయు, మమృతకిరణకులవరేణ్య!’
209
చ. అనవుడుఁ బ్రీతి నొంది యతఁ డచ్యుతుఁ గన్గొని ‘భవ్య మైన యి
ప్పని తగ నిట్లు చేయు మని పన్పుము; తల్లియుఁ దండ్రియున్‌ గురుం
డును సచివుండు నిష్టసఖుఁడుం గరుణాకర! నీవ మాకు; నీ
యనుపమ ముఖ్యవృత్తి జగ మంతటికిన్‌ గతి; వేయు నేటికిన్‌?’
210
వ. అనిన విని యంబుజనాభుం డతని కిట్లనియె. 211
ఉ. ‘వ్యాసులు పంచినట్ల నియమాఢ్యతఁ జేయుద మశ్వమేధముం;
జేసి కృతార్థతం బొరసి చిత్తము నెవ్వగ యెల్లఁ బాచికొ;
మ్మాసుకృతంబు ధర్మనిచయ ప్రవరం బని యేన చెప్పి కా
దే సుగుణాభిరామ! నిను దీనికిఁ జొన్పితి మున్‌ దృఢంబుగన్‌.
212
చ. అనుమతి యింక వేఱ పడయం దలఁ పేటికిఁ గౌరవేంద్ర! న
న్బనుపుము, వాజిమేధకరణంబున కేపని చేయువాఁడ? నీ
యనుజులు నల్వు రే నొకఁడ నధ్వరకార్యము లెల్ల నీదు నె
మ్మనమున కెక్కఁ జేయుదుము; మాన్యచరిత్ర! తొడంగు మర్థితోన్‌.’
213
సీ. అన విని, సమ్మోద మారిన చిత్తంబు | తో నభినందించి, యా నరేంద్ర
వరుఁడు పారాశర్యువలను గనుంగొని | ‘దీక్షకు నయ్యెడు దినము మీరు
చూచి యా సంస్కార మాచరింపుఁడు దయ’ | ననవుడు నమ్ముని యాజ్ఞవల్క్యుఁ
బేర్కొని, పైలునిఁ బ్రీతి నెఱింగించి, | వారును నేనును వసుమతీశ!
 
ఆ. నడపవలయు పనులు నడపు వారము; చైత్ర | మాస కలిత పౌర్ణమాసి నిప్పు;
డరయఁ బనుపు మేధ్య మగుతురంగముఁ దద్‌జ్ఞు | లైన యట్టి జనుల; నంచితాత్మ!
214
క. వేదోక్త విధి సహిత భ | వ్యాదరమున విడువఁ బడిన యయ్యశ్వం బీ
మేదినిఁ గలయం దిరుగును | నీ దగు నిర్మలయశంబు నెఱయ మెఱయఁగన్‌
215
వ. సర్వ సంభారంబులును సమకట్టింపుము; స్రుక్‌ సువాది క్రతు సాధనంబులు గ్రొత్తలుగాఁ గనకంబునం గావింపం బనువు’ మని చెప్పిన నప్పుడమిఱేఁడు. 216
క. తురగ పరీక్షావిదులగు | పురుషులఁ బిలిపించి, ‘యశ్వపుంగవుఁ గని తెం;
డరయుఁడు మనకొదమలలో | నిరుపమ లక్షణముఁ గీర్తనీయంబును గాన్‌.
217
వ. అని పలికి కర్మాధికారులం గలయం గనుంగొని యజ్ఞంబునకు వలయునట్టి భాండ ప్రముఖంబులయిన సాధనంబులును, స్రుక్స్రువాద్యుపకరణంబులును సువర్ణమయంబులుగా వేగంబ చేయింపవలయు’ నని నియోగించిన, నట్ల కాక యని చని వారును బదంపడి. 218
క. తురగంబును సంభారో | త్కరమును గొనివచ్చి చూప ధర్మజుఁడు పరా
శరసుతునకు వాని వినయ | పరత సమర్పించెఁ గురునృపాలవరేణ్యా!
219
క. ముని యశ్వముఁ జూచి కరం | బనురాగముఁ బొంది ‘మేధ్య మగు నిది; దీనిన్‌
వినుత విధానమున విడుత’ | మనవుడు నతఁ డతనితోడ నాదర మలరన్‌.
220
తే. ‘దీని రక్షింప నర్హుండు మాననీయ | బోధ! యెవ్వండు? నీదు సద్బుద్ధి నరసి
యిట్టివాఁడని యానతి యిమ్ము నాకు’ | ననిన నమ్మునినాథుఁ డయ్యధిపుతోడ.
221
క. ‘దివ్యాస్త్ర విదుఁడు, ధిషణా | భవ్యుఁడు, శౌర్యోత్తరుండు పార్థుఁడు దగు న
శ్వవ్యాపన క్రియకు’ నితఁ | డవ్యాహతి నాచరించు నక్కార్యంబున్‌.
222
వ. భీమసేనుండును నకులుండును మన రాష్ట్రంబు రక్షించువారు; భవదీయ కుటుంబ కార్యంబులు సహదేవుండు నడపువాఁ’ డని నిర్దేశించిన. 223
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )