పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
ధర్మజుం డశ్వమేధదీక్షం బూని హయంబుం బుడమిఁ దిరుగ విడుచుట (సం. 14-72-1)
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; న ట్లశ్వమేధయాగోద్యోగప్రద్యోతితుం డయిన పాండవాగ్రజు దీక్షకు నర్హ ం బయిన దినంబు సంప్రాప్తం బగుటయు, మౌహూర్తిక దత్త శుభ ముహూర్తంబునం గృష్ణద్వైపాయనాదులైన ఋత్విజులు వేద విహిత విధాన మహితంబుగ నక్కురు క్షితిపతి దీక్షితుం జేసి; రవ్వసుంధరా వల్లభుండు సంవీతక్షౌమకృష్ణాజినుండును దండపాణియు నయి ఋత్విగ్జనంబులు బలియం బరమ సంయమి పరివృత ప్రజాపతి ప్రఖ్యుండును గనత్కాంచనాభరణభూషితుండు నయి బహుళ ప్రభలు నిగుడ సందీప్త పావక సన్నిభుండును నగుచు వెలింగెఁ; దత్తుల్యాకల్పనంబున ఋత్విగ్జన సమాజంబునుం దేజరిల్లె; నా వేదవ్యాస మహామునిచేత శాస్త్రోక్త ప్రకారంబున ముక్తంబయి హయోత్తమంబు వెడలె; నప్పుడు. 002
సీ. వివ్వచ్చుఁ డాగమవిధివంతముగ ధర్మ | నందను నామంత్రణంబు వడసి,
గాండీవపాణియై, కవదొనల్‌ ధరియించి, | తేజోవిశేషంబు రాజితముగ
నయ్యశ్వరత్నంబు ననుసరింపఁగఁ బ్రజ | బాలురు వృద్ధులు భామినులును
లోనుగాఁ బఱతెంచి, లోలత నతని నా | హయమును గనుఁగొను నప్పు డగ్గ
 
తే. లంపు సందడి నూష్మజనింప, నాజ | నంబు లవ్వీరునకు దీవనలఁ బొగడ్త
లను బ్రమోద మొనర్చిరి; వనధిరవము | ననుకరించె నయ్యులివు నృపాగ్రగణ్య!
003
వ. ఇవ్విధంబునం జను నా కవ్వడితోడ యజ్ఞకర్మకుశలుండైన యాజ్ఞవల్క్య శిష్యుం డర్హవిధానంబుల కయి మాననీయ విప్రజన సహితంబుగాఁ జనియె; నప్పరమ తురంగంబు ధరణిం బ్రదక్షిణ రూపంబునం దిరిగి, యుత్తరాభిముఖంబై యల్లనల్లన యరుగుచుండ, నర్జునుం డనుసరించి పాలన పరుండగుచుం బ్రవర్తింపం ద్రిగర్తదేశంబునందు. 004
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )