| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము |
| చ. |
అని నిజమందిరంబునకు నయ్యెలనాఁగఁ దగంగఁ బుచ్చి య మ్మనుజవరుండు సాధన సమంచితమైన రథం బుదాత్త రే ఖ నెఱయ నెక్కి యర్హపరికల్పిత భూషణ లేపనాంబరం బును సమరోత్సవోద్ధత విభూతియునై తనమే నెలర్పఁగన్. |
056 |
| ఆ. |
ఎక్కి హంసకేతు వేడ్తెఱఁ గ్రాలంగ | నరిగి యశ్వమునకు నడ్డపడఁగఁ జూచి మెచ్చి సవ్యసాచి మార్కొనుటయుఁ | గురిసె నతఁడు నిశితశరచయంబు. |
057 |
| శా. |
వానిం దా నవలీలమైఁ దునిమి దుర్వారోద్యముం డద్రిభి త్సూనుం డొక్కట నాత్మసూను నొడలం దూపుల్ నిగిడ్చెం బదా; ఱా నిశ్శంకుఁడు బాహుసారమద మేపారంగ నవ్వీరుపై వే నారాచము లైదు నాలుగులు పృథ్వీనాథ | నాటించినన్. |
058 |
| చ. |
మదిఁ గొనియాడి యారిపువిమర్దనుఁ డంచసిడంబు ద్రుంచి యే పొదవఁగ మేను నొంప; నచలోద్ధతి నాతని జత్రు వేసె బె ట్టిద మగునారసంబునఁ గడిందిమగం డగు బభ్రువాహనుం; డది వడిపేర్మి శోణితజలార్ద్రత నొందక యుచ్చిపోయినన్. |
059 |
| క. |
అమ్మేటిమగఁడు తన చా | ప మ్మూఁతగ నిల్చి సోలి పదపడి తెలి వు ల్లమ్మున నొలసిన నౌరా | యిమ్మడి యని పొగడెఁ గొడుకు నెంతయుఁ బ్రీతిన్. |
060 |
| తే. |
పొగడి ‘యేఁ దీవ్ర శరములు నిగుడఁ జేయు | నుద్ధతికి మంచిబంటవై యోర్వవలయుఁ జుమ్ము రా’ యని పలికి వాలమ్ము లధిక | రయము మెఱయంగఁ బరఁగించె రాజముఖ్య! |
061 |
| ఆ. |
మొనసి వాని నతఁడు ముత్తునియలు గాఁగఁ | జేయ మత్సరంబు చిత్తవృత్తిఁ దనికి సత్వరముగఁ దద్గాత్రమున నించె | నరుఁడు పెక్కు మెఱుఁగు నారసములు. |
062 |
| ఉ. |
దానికి నీడఁ బోవక యుదగ్ర పరాక్రమ మొప్ప వజ్ర కీ లానిభతన్ మెఱుంగుల విలాసము నింగి వెలుంగ నుద్భటుం డై నిగిడించెఁ బార్థు హృదయస్థలి నారస మస్త్ర శస్త్ర వి ద్యానిపుణత్వశాలి యగు నన్నరపాలసుతుండు భూవరా! |
063 |