| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
వడి నది వీఁపున వెడలినఁ | బడియెఁ బుడమి నర్జునుండు; పదపడి త్రెళ్ళెం గొడుకును ము న్నతఁ డేసిన | బెడిదపుటేటుల యలంతఁ బృథ్వీనాథా! |
064 |
| వ. | అట్లు తనపతియును సుతుండును భండనంబునం బడుట విని శోకాక్రాంత యగుచుఁ జిత్రాంగద యులూపి (చి) యుం దోడన చనుదేర నచ్చటికి వచ్చె; నట్లు వచ్చి యచ్చెలువ యయ్యిరువురం గనుంగొని యుల్లంబు జల్లనఁ దల్లడిల్ల మూర్ఛమునింగి మేదినిం బడి, కొంత వడికిం దెలిసి యులూపి నాలోకించి. | 065 |
| సీ. |
‘నీ కతంబునఁ బతి నాకుమారునిచేత | ననిఁ బడియున్నవాఁ డతివ! కంటె; నీవు పతివ్రత గావె; ధర్మజ్ఞవు | గాని దానవె; యేమి కారణమున నిది కార్యముగఁ జెప్పి తీపిన్నవానికిఁ | గొడుకు దిక్కున నాకు నడలు లేదు; వరుఁజూచి పొక్కెద; వామాక్షి! నీ దెసఁ దప్పు సేసినను నీతనిఁ గృపార్ద్ర |
|
| తే. |
చిత్తవై యెల్లభంగి సంజీవితుఁడుగఁ | జేయవమ్మ; యక్కట! నాథు నేయఁ బనిచి చావు చూచియు వగవవు; సాహసమున | కొలఁది లేదు; ని న్నేమందుఁ గులపవిత్ర!’ |
066 |
| వ. | అని పలికి పార్థుం జేరంబోయి. | 067 |
| ఆ. |
‘మహిత కీర్తిలోల! మత్ప్రాణవల్లభ! | యన్యజనుల ప్రాణ మరసి కావఁ జాలునట్టి నీకు నేల ప్రాణంబుల | నిట్లు వదలి పోవనిచ్చియుండ. |
068 |
| సీ. |
‘నాథ! నీ వెప్పుడు నన్ను మన్నింతువు; | కనువిచ్చి చూడక యునికి దగునె; హయమున కెవ్వరు నడ్డంబు రాకుండ | నాఁగితి వగ్రజు నధ్వరంబు వమ్మయిపోకుండ; లె మ్మిత్తురంగంబు | వెనుకొన వలవదే యనఘ! నీకు’ నని యార్తిఁ బలవించి యహిపుత్త్రి దెసఁ జూచి | ‘సుతుఁ డెట్టులుండినఁ బతికి నిమ్ము |
|
| తే. |
జీవ; మాండ్రురఁ బెక్కండ్రఁ జేసికొనుట | పురుషులకుఁ దప్పె; భార్య లిత్తెరువునందు నడవరే; యోర్చి నీదుమనమున నింత | యెఱిఁగి కలిగింపు వరు; వేయు నేల తల్లి!’ |
069 |
| వ. | అని యంత నిలువక. | 070 |
| ఆ. |
‘కొడుకు చేతఁ జచ్చి పడియున్న యిక్కురు | కులవరేణ్యుఁ గరుణ గూరి నీవు బ్రదుకఁ జేయకున్నఁ బ్రాయోపవేశన | మాచరింతు నహికులాగ్రగణ్య!’ |
071 |
| వ. | అనిపలికి పతిచరణంబులు శిరంబు సోఁకం బ్రణమిల్లి, యాసీనయై యూరకుండె; నట్టియెడ బభ్రువాహ నుండు దెప్పిఱి లేచి యప్పొలంతిం జూచి. | 072 |
| ఉ. |
‘ఇంచుకయేనియున్ వనట నెన్నఁడుఁ బొందని తల్లి నేఁడు నా మంచితనంబునన్ బలుకు మాలిన నాథుని నుగ్రశత్రులన్ మంచు నినుండు వోలెఁ బరిమార్చు మహాబలుఁ జూచి యిట్లు దుః ఖించుచు నుండఁ జూచితి; సకిల్బిషచిత్తున కింత పెద్దయే? |
073 |
| క. |
గాదిలి తనయుఁడ నగు నేఁ | గా దన కిక్కురుకులాగ్రగణ్యుని నిమ్మై మేదినిఁ గూల్చితి మణికిర | ణోదాత్తంబైన మకుట ముర్విం బొందన్.’ |
074 |
| వ. | అని విలాపంబు చేసి వివ్వచ్చుతోడం గూడ యజ్ఞతురంగానుసారులై వచ్చిన యాజ్ఞవల్క్య శిష్యప్రభృతి బ్రాహ్మణ జనంబులు నయనపథప్రాప్తు లగుటయు. | 075 |
| సీ. |
‘అధ్వర హయ విషయంబుగా వీ రేమి | పనిచేయు వారొక్కొ? పార్థుఁ డిట్లు పడియున్నవాఁడని పలవించి జనకుని | నిట్లు చేసిన పాపుఁ డెవ్విధమున నాచరించునొకొ? ప్రాయశ్చిత్త మని పల్కి | పండ్రెండు వర్షముల్ భైక్షవృత్తి నిమ్మహాత్ముని కపాలమ్మున నడపంగ | వలయుఁగా కొం డెద్ది గలుగ నేర్చు?’ |
|
| ఆ. |
నని యులూపి దిక్కు గనుఁగొని ‘నీవు ప | న్పంగఁ దండ్రి నిట్లు భండనమున విగత జీవితుఁడుగఁ దెగఁ జేసితిని నింక | నెలమిఁ బొందు భరతకులపవిత్ర!’ |
076 |
| వ. | అని వెండియు. | 077 |
| క. |
‘జనకునిఁ దెగటార్చిన పా | పునకుం బ్రాణంబు తోడి పొత్తు మనంగా మనమునఁ దాలిమి గలుగునె? | చనుఁగాక యతండు చనిన సద్గతిక తగన్.’ |
078 |
| వ. | అని యుగ్గడించి స్థావరంబులు జంగమంబులు నగు భూతంబులు విన, భుజంగపుత్త్రియు నాకర్ణింపఁ; జెప్పి ‘వ్రతంబు నిష్ఠం బూనెద; మా తండ్రి లే కునికి నిజంబగు నేనిఁ బ్రాయోపవేశంబ యుత్తమ కృత్యంబు; వీరవధంబు పాపం; బంతకంటెను రాజవధం బెక్కు; డంతకంటెఁ గడు నగ్గలంబు ధార్మికవధంబు; జనక వధ పాతకం బింత యని కొలంది యిడరా; దిట్లుండ వీరుండును రాజును ధార్మికుండును జనకుండును నైన యిమ్మహితాత్ముని వధియించిన మహాపాతకుని కేత ద్వ్రతానుష్ఠానంబు దక్క నొండుమెయి నిష్కృతి గల్గునే; దీని నడపెద’? నని పలికి యప్పరమనియతుం డుపస్పర్శనం బాచరించి పలుకు లుడిగి కూర్చుండె; నప్పుడు. | 079 |