పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
ఉలూపి(చి) సంజీవనమణిచేత నర్జును బ్రదికించుట (సం. 14-81-1)
ఆ. అట్లు తెంపు చేసి యాసీను లైన యా | తల్లిఁ, గొడుకు, నవనిఁ ద్రెళ్ళియున్న
విజయుఁ జూచి పాఁపవెలఁది సంజీవన | మణిఁ దలంచెఁ గురుసమాజముఖ్య!
080
వ. తలంచినం భుజంగమంబులకుఁ బరాయణంబైన యమ్మణి యమ్మహాభాగ హస్తతలంబునకు వచ్చిన నా భామిని భభ్రువాహను నాననం బాలోకించి. 081
సీ. విజయుండు చచ్చునే వేఁదురులార! యిం | ద్రునిచేత నైన; నీతనికి నొక్క
ప్రియము సేయంగఁ గోరియును నీ కొలఁది యా | రయు బుద్ధి నీతండు రణ మొనర్పఁ
దలఁచిన నివ్వీరుతలఁపు సిద్ధింపంగఁ | జేయుటకును నింత సేయవలసె
నాకుఁ; గావున మోహనంబగు మాయా ప్ర | యోగంబు నడపితి నుజ్జ్వలాత్మ!
 
తే. నరుఁడు నారాయణుఁడు; మహత్తరము సువ్వె | యితని తేజ; మెవ్వరికిని నెట్లు దాని
నార్పవచ్చు; మీ వగ పెల్లఁ దీర్ప నిపుడ | యుత్థితుం డగు నీ కౌరవోత్తముండు.
082
వ. ‘మాయా ప్రయోగంబ; వేఱొండుగాదు; నీకు మీతండ్రితోడ భండనంబు సేయ బుద్ధి పుట్టించితి; ఇంతమాత్ర’ యని తత్ప్రదేశంబున నున్న యెల్లజనంబులు నుల్లంబుల నానందంబు నొందఁ బలికి, యమ్మణిపూరపురపతి కరతలంబున నమ్మణి యిడి, ‘దీని నిమ్మహాత్ముని హృదయదేశంబు మోపు’, మనవుడు నతం డట్ల చేయుట యుం. బార్థుండు ప్రత్యుజ్జీవితుండై. 083
తే. లేచి కూర్చుండి కలయంగఁ జూచి యెఱ్ఱ | సెరల కాంతియు దంతరుచియును బెరయ
నతి మనోహరముగఁ దనసుతునితోడ | ‘మనుజనాయక! కుశలమే?’ యనుడు నతఁడు.
084
సీ. వినయ మారంగ నాతని చరణంబుల | కెఱఁగి ‘భవత్పుణ్య వీక్షణమున
నఖిలంబుఁ గుశలంబ’ యనిన ‘నిజ్జనముల | మొగములయందెల్ల వగపు దోఁచి
యచ్చెరువాటును హర్షంబుఁ గదిరెడు; | నిది యేమి చెప్పవే యెఱుఁగు దేని;
నాచెప్పినట్ల రణంబున కేతెంచి | తీవు; చిత్రాంగద యేల వచ్చె?
 
ఆ. నిచ్చటికి నులూపి(చి) యేమిటి కిపుడు చ | న్దెంచె?’ ననుడు భక్తి నిర్భరముగ
నతఁడు సాఁగి మ్రొక్కి హస్తముల్‌ మొగిచి య | య్యహి తనూజఁ జూపి యతనితోడ.
085
వ. ‘అంతయు నిమ్మహానుభావ నడుగుం’ డనిన, గాండీవి యా యింతివదనం బాలోకించి ‘కురువంశ నిస్తారకా! నీ రాకకుం గారణంబేమి?; ’ యిమ్మణిపూర పురనాథుని దెస నావలన భవదీయ చిత్తంబు ప్రసన్నంబయి యున్న యదియె?; యిన్నరపతియును నేనును జిత్రాంగదయును నీకేమియు నపరాధంబు సేయము గదా’ యనుటయు. 086
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )