పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
ఉలూపి(చి) యర్జునునితో వసువుల కోపప్రసాదంబుల నెఱింగించుట (సం. 14-82-5)
సీ. అల్లన నవ్వుచు నయ్యింతి యతనితో | ‘నాథ! నీయం దొకనాఁడు నెగ్గు
గలదె?; నా పుత్రుని వలనఁ గీ డెక్కడి | యది?; వినీతాత్మ చిత్రాంగదయును;
గినియక విను; మేను వినతోత్తమాంగ నై | చెప్పెద; నీ సుతుచేత నీకు
నావహిల్లె నశుభ; మాహవంబున నీవు | గంగాతనూజు శిఖండి నెపము
 
తే. గాఁగ దెగటార్చి; తది పాతకంబు; దాని | కనఘ! నిష్కృతి సేయక తనువు విడిచి
తేని నరకవాసమునకుఁ బోనువలయుఁ; | గాన నిష్కృతిసేసితిఁ గడఁగి వచ్చి.
087
వ. అది యెట్లంటేని నాకర్ణింపు; మే నొక్కనాఁడు సఖీసమేతంబుగా సురనదీస్నానంబునకు వచ్చియుండ, వసువు లక్కడకేతెంచి యింతనంత నొక్కరేవునం దోఁచి కృత స్నానులై నిజరూపంబున సన్నిహితయైన గంగాదేవితోడ ‘గాండీవధరుండు శిఖండిం బురస్కరించుకొని, గాంగేయుం డేయకుండం బరమ సాయకంబుల నతనిం గూల్చె; నట్లు కుత్సితజయార్జనం బొనర్చిన యయ్యర్జును నేము శాపసంతాపితుం జేయుదు’ మని చెప్పిన నప్పరమానుభావయు దాని కొడంబడిన పలుకు పలికె; నంతయు విని తత్‌క్షణంబ. 088
సీ. అరిగి యేఁ దండ్రికి నత్తెఱంగంతయు | నెఱిఁగించుటయు, నతం డెసక మెసఁగ
భయమున రయమునఁ బఱతెంచి వసువులఁ | బెక్కు విధంబులఁ బ్రియము పుట్టఁ
దెలిచి ప్రార్థించిన నలుక వో విడిచి వా | రతనితో ‘విను సమయం బొకండు
చేసెద; మనిలోన వాసవిఁ దత్సూనుఁ | డగు బభ్రువాహనుం డస్త్రవితతిఁ
 
ఆ. బఱపి గూల్చె నేనిఁ బాయు నక్కిలిఙ్బష; | మనిన మగిడి వచ్చి యా భుజంగ
నాథుఁ డెల్లఁ జెప్పె నాకు; నిప్పని దగ | నిట్లు దీర్చితిని సమిద్ధతేజ!
089
వ. తీర్చిన తెఱంగు నెఱింగించెద’ నని పలికి బభ్రువాహను నుపలక్షించి ‘యిక్కుమారుండు నీతో సమరంబు చేయనొల్లక నమస్కరించి మరలి మందిరంబునకుం బోవు చున్కి బుద్ధింగని సమయకార్యంబునకు నిది యవసరం బని యూహించి రయంబున నితనికడకు వచ్చి ‘రణంబు మీ తండ్రికిఁ బ్రియంబును ధర్మంబు’ నని చెప్పి యితనిం బోరికిం బురికొల్పి యివ్వీరునియందు వసువులు చెప్పిన విధంబు గలుగునట్లుగా విక్రమ విశేషం బావహించితి.’ 090
క. అనినఁ బ్రియమంది ‘దేవీ! యనఘం బగు నీ చరిత్ర మస్మత్కుల వ
ర్ధన కారి యగుట యెప్పుడుఁ | గనినది గాదె!’ యని పలికె గాండీవి నృపా!
091
ఆ. పలికి సాదరముగ బభ్రువాహనుఁ జూచి | మానితాగమిష్యమాణ చైత్ర
మాస పౌర్ణమాసి మహితాశ్వమేధ కా | లంబు; దాని దెసఁ దలంపు గలిగి.
092
క. నీవును దల్లులు బంధు జ | నావళియుం బరిజనములు హస్తినగరికిన్‌
రావలయు; ధర్మజుని సం | భావనముం బడయు టొసఁగుఁ బరమ శుభంబున్‌.’
093
చ. అనవుడు ‘ నట్ల చేసెద నుదాత్త చరిత్ర! పురంబు చొచ్చి యి
వ్వనితలు నీవు నా వలని వత్సలతం గొనియాడు చియ్యెడన్‌
మన మలరంగ నిల్చి, జనమాన్యునిఁగా ననుఁజేసి ప్రీతి నే
ననుపఁగ వచ్చి చేయు మనుయానము యజ్ఞతురంగ రక్షకై.
094
వ. అనుచుం బ్రణతుండై బభ్రువాహనుండు ప్రార్థించినం, బార్థుండప్పార్థివుతో ‘ నేను దీక్షితుండనగుట యెఱుంగవే; నాకుం బురప్రవేశంబు చేయం జనదు; పోయి వచ్చెద; మీరును సుఖులరయి యుండుం ‘డనిన ‘నట్లకాక’ యని యతం డుచిత ప్రకారంబునం బూజించి యామంత్రణంబు చేయ నబ్భామలచేత ననుజ్ఞాతుండై యమ్మ హాత్ముండు యజ్ఞాశ్వంబు ననుసరించె; నదియు నిజేచ్ఛ నఖిల దేశంబులం బ్రవర్తిల్లె; నట్టియెడ. 095
క. రాజగృహపురము కడ న | వ్వాజి యరుగు టెఱిఁగి, యాహవమునకుఁ బిలిచెన్‌
రాజ త్కీర్తి ధనుం డగు | నా జిష్ణుని మేఘసంధి యను రా జధిపా!
096
వ. అట్టు లప్పురంబు పతి యగు జరాసంధ పౌత్త్రుండు బాల్యంబునం దన్ను నెదిరి నెఱుంగమిం గవ్వడిం గయ్యంబునకుం బిలిచి పుచ్చి తోడన కల్పిత రథారూఢుండై వెడలి యవ్వాసవికి నడ్డపడి. 097
సీ. ‘వనితలలోపలఁ జనియెడు చాడ్పున | నివ్వాజిఁ గొని యించుకేని శంక
లేక పోయెదవు; పోనీక యేఁ బట్టెద | దీనిఁ; గయ్యము చేసెదేనిఁ జేయు;
మనుడు నవ్వుచు నతం డమ్మగధేశుతో | ‘విఘ్నకర్తల నేను వెరవుతోడ
మాన్పింతు; వినుము; నామనమునఁ గిన్కలే; | దది యెట్టులనిన మదగ్రజుండు
 
తే. సామమునన కర్జము నీవు చక్కఁ బెట్టి | కొందు గాని యెవ్వరియెడఁ గ్రూరవృత్తి
వలవ దని నాకుఁ జెప్పినవాఁడుఁ గాన | యట్లు చేయుదు; నీ యిష్ట మాచరింపు.’
098
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )