పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
కృష్ణుఁడు ధర్మజునితో నర్జును సందేశంబు చెప్పుట (సం. 14-88-13)
వ. అనిన నవ్వారిజనాభుండు ‘ద్వారకనుండి వచ్చినవాఁ డగ్గాండీవి తనతోడం జెప్పె నని చెప్పిన మాటల తెఱంగా కర్ణింపుము. 146
ఆ. నాదు విన్నపముగ నరనాథునకు విన్న | వింపు; రాజులెల్ల వేడ్కతోడ
జన్నమునకు వచ్చుచున్నారు; మున్నెట్టి | వార లైనఁ బూజ వలయు ననుము.
147
వ. విశేషించి మదీయ పుత్త్రుండు. 148
క. మణిపూర పురాధీశుఁడు | గుణ గణ విభ్రాజితుండు గురుహితుఁడు విచ
క్షణపరుఁడు బభ్రువాహనుఁ | డణుమాత్రముఁ గీడులేని యట్టిం డెందున్‌.
149
క. మీ చరణ సరసిజంబులు | చూచుటకై రాక తనకు సువ్రతముగ మున్‌
వేచి యునికి వచ్చుఁ; గృపా | గోచరమగు చేఁతకుం దగును మీ; కనుమీ!
150
వ. అని చెప్పె ననిన విని యవ్వాక్యంబు లభినందించి ధర్మనందనుండు గోవిందునితోడ. 151
సీ. ‘ఏ వింటి విజయుఁ డనేక యుద్ధంబుల | నలజడి వడుట; య ట్లతఁడు నాఁడు
నక్కట! ద్రోణభీష్మాదులతోడి యె | క్కుడుఁ బోర నిడుమలఁ బడియెఁ; నేఁడు
నిత్తెఱంగునఁ బడియెడు; నాకుఁగా నిన్ని | పాటులు వడునె యప్పరమ సౌఖ్య
యోగ్యదేహుండు; ని న్నొక్కటి నడిగెద; | నతని మేను సులక్షణాన్వితంబు;
 
తే. నా మదికి నెక్క నీవు గన్వఱపి కన్న | యట్టికీడు తదీయంబులైన యవయ
వముల నెందేనిఁ గలిగెనే? యమితదుఃఖ | భాగి యగుటకు మూలమై పద్మనాభ!
152
క. తెలుపఁదగు నేనిఁ గరుణం | దెలుపుము నా; కనుడు వాసుదేవుఁడు ‘నీకుం
దెలుపుటయుఁ గృత్యమే; విను; | తెలిపెదఁ గలమాత్ర వసుమతీవరముఖ్యా!
153
తే. సర్వగాత్రంబులందును సవ్యసాచి | కధిక శుభలక్షణంబుల యతిశయిల్లుఁ;
దనువు మాత్రకు నించుక ధరణినాథ | యెక్కుడై యుండుఁ జిఱుదొడ; లిదియ కొఱఁత.
154
క. అలజళ్ళు దీనివలనం | కలిగెడునో కాని తక్కు గలుగ దరిష్టం
బలఘుశుభలక్షణాన్విత | విలసిత తనుఁ డైన గాండివికి నియ్యెడలన్‌.’
155
వ. అట్లున్నరూపు చెప్పిన వెన్నుని వచనంబులు విని యవ్వసుంధరా వల్లభుం డతని యాననం బాలోకించి ‘యది యట్లుకాక’ యని పలికె; నప్పుడు పాంచాలి పద్మనాభుం బ్రీతి స్ఫీతంబగు చూడ్కి నాలోకించిన నాలోకనాథుం డది యర్జున విషయంబైన ప్రీణనంబు తెఱం గగుట యెఱింగికొనియె; నట్టియెడ భీమాదులును యాదవ కుమారులును నక్కిరీటి గుణంబు లగ్గించుచు. నా ప్రొద్దున కదియ గోష్ఠిగ సల్లాపంబు సేయుచుండ నగ్గాండీవి పాలనుండి కాలరి చనుదెంచి. 156
సీ. పాండవాగ్రజునకుఁ బ్రణతి యొనర్చి ‘వి | వ్వచ్చుఁ డిప్పురి సేరవచ్చె; నెల్లి
వచ్చు మీ శ్రీపాదవనజంబులకు మ్రొక్క’ | ననవుడు హర్షాశ్రు లడరఁ బులకి
తాంగుఁడై వానికి నన్నరేంద్రుఁడు పస | దన మాభరణవస్త్ర కనకములు స
మగ్రంబుగా నిచ్చె; నందఱు నానంద | రసమునఁ దేలి యా రాత్రి పార్థుఁ
 
ఆ. జూచు వేడ్క నూనుచును వేగు టెప్పుడో | యనుచు నుండ నుదయ మయ్యె నినుఁడు;
క్రీడి సమయ విహిత కృత్యముల్‌ సలిపి, హ | యంబు మున్ను గాఁగ నరుగుదెంచె.
157
వ. అప్పుడు. 158
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )