| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
విను మింద్ర తురగ సమ ఖే | లనమున నవ్వాజి జనములకు నెల్లను లో చనపర్వమయ్యె; వారి వ | దనముల సంతోష మధురతర భాషణముల్. |
159 |
| సీ. |
కలయంగ నిట్లని చెలఁగె; ‘నిగ్గాండీవి | దక్క నిమ్మాడ్కి నొండొక్కరునకు నశ్వంబు తనయిచ్చ నఖిలదేశములకు | నరుగంగ ధరణీశు లచట నచట బలములతో వచ్చి బలసి తదీయ రో | ధం బాచరింపఁ దృణంబు గాఁగఁ గొని లీలమై గెల్పు గొనుచోట్ల నుగ్రత | వాటింప కగ్రజు పలుక యెట్టి |
|
| తే. |
దశల నైనను బాటించి, తా నొకండ | ననుతలం పెప్డు నుల్లంబునందు లేక తనువు గవుసెనఁ బెట్టి పుచ్చిన విధమున | నరుగుదేవచ్చునే? యిది యక్కజంబు! |
160 |
| క. |
సగరాదులఁ జెప్ప వినమె! మగఁటిమియును బలము ని ట్లమానుష భంగిన్ నెగడునె? యింకను బుట్టరు | జగతిని గాండీవితోడ సరి వచ్చు మగల్. |
161 |
| క. |
మానుషము దైవమును సరి | నే నే నని కార్యసిద్ధి నెలయింపఁగ ని త్యానందుఁ డయ్యె ధర్మజుఁ; | డీ నిర్మల భాగ్యమహిమ యేరికిఁ గలదే? |
162 |
| క. |
విను మట్లు చెలంగఁగ ఘూ | ర్ణన మొందిన యర్ణవం బనఁగఁ బొంగారెన్ జన నికురుంబం; బాపెం | పనఘా! చూడ వినఁ బడయ మఖిల జగములన్. |
163 |
| వ. | మఱియును. | 164 |
| సీ. |
నృపు లోహటింప జంత్రపుమీను నేసి చే | కొనియెఁ బాంచాలుని కూఁతు నితఁడె! సురసేనతోఁ బురందరుఁ గెల్చి భుజగర్వ | మేపార ఖాండవం బేర్చె నితఁడె! యెక్కటి బవరాన నీశాను మెప్పించి | పాశుపతాస్త్రంబుఁ బడసె నితఁడె! యొంటిమై భీష్మాది యోధుల కురుపతి | ధృతిఁ బాపి గోవులఁ దెచ్చె నితఁడె! |
|
| తే. |
ప్రతిన సేసి విషమ సమరమునఁ బ్రొద్దు | గ్రుంకనీ కాఁగి సైంధవుఁ గూల్చె నితఁడె! యనుచు సందడిగాఁ గ్రమ్మి యఱ్ఱులెత్తి | చూచె జనలోక మాసవ్యసాచిఁ బ్రీతి. |
165 |
| క. |
ఆ వాక్యము లెల్ల వినుచు | భావ మలర నర్జునుండు భాసురమగు న మ్మా వగ్రేసరముగ య | జ్ఞావాసంబునకు వచ్చె నంచితలీలన్. |
166 |
| వ. | అట్టియెడ ధర్మనందనుండు భీమాదులును గృష్ణుండును బలదేవ ప్రభృతులును ధృతరాష్ట్రుం బురస్కరించు కొనుచు నప్పార్థు నెదుర్కొని; రతండు వారలనెల్ల సముచితాచార సంప్రీతులం గావించి గాంధారినిఁగుంతినిం గాంచి యీఁతకాఁడు తీరంబు గనిన చందంబుఁ బొంది, యందఱునభినందించుచుం బొదివికొనియుండ నొక్కరమ్యప్రదేశంబున నుండె; నా సమయంబున. | 167 |
| సీ. |
బభ్రువాహనుఁడు వైభవ మొప్పఁ జిత్రాంగ | దయు నులూపి(చి)యుఁ బ్రమదంబుతోడఁ దోడ రా ధర్మపుత్త్రుని మందిరమునకు | నరుగుదెంచుటయు, నక్కురువరేణ్యుఁ డును దమ్ములును గృష్ణుఁడును బలభద్రాది | యాదవులును బ్రీతులై తదీయ సందర్శనము నర్హసత్కార చరితార్థ | ముగఁ జేసి; రతఁడును దగిన విధుల |
|
| తే. |
నందఱకుఁ బ్రియ మొనరించి యాంబికేయు | నతని భార్యను గని నమస్కృతు లొనర్చి, గొంతిఁ గాంచి యాయమయడుగులకు నెఱఁగి | పలుదెఱఁగు దీవనలును గౌఁగిలియుఁ బడసి. |
168 |
| వ. | ధర్మపుత్త్రుం గొలిచి కూర్చుండ నతని కతండును ననుజులును వేర్వేఱ సర్వరత్న రాజీవిరాజితంబు లగు భూషణంబులును బరమాంబరంబులును నొసంగిరి; సీరపాణి శౌరి ప్రభృతులు ప్రభూతాభరణంబులను భాసుర వాసోవిశేషంబులను నతని నర్చించి; రయ్యవసరంబున. | 169 |
| సీ. |
చిత్రాంగదయు నాగపుత్త్రియుఁ దొలితొలి | గాంధారిఁ గని గొంతిఁ గాంచి రెలమి; దీవించి గాఢసంభావనఁ గౌఁగిటఁ | జేర్చి యద్దేవి రత్నార్చు లెసఁగు తొడవుల నర్పించె; ద్రోవదియును సుభ | ద్రయు వారు త మ్ముచిత ప్రకార మునఁ గన్న నమ్మెయి వినుత పూజనముల | నతుల సమ్మోదము నావహించి |
|
| ఆ. |
యోగ్యపీఠములను నునిచి, తత్సల్లాప | సౌఖ్యమొంది; రట్లు సకలవర్త నముల నశ్వమేధ సముపక్రమం బుదా | త్తాభిరామమయ్యె నధిపముఖ్య! |
170 |
| వ. | పదంపడి యర్హదివసంబు సంప్రాప్తం బగుటయు,సాత్యవతేయమునిపతి కురుపతిపాలికిం జనుదెంచి‘నేఁడు యజనంబునకుం దొడంగుము; యాజ్ఞికులు శుభముహూర్తం బాసన్నంబయ్యె ననుచున్నవారు; నీ మఖంబు మహనీయంబు; నీవు మహాధనవంతుండవైతి; దక్షిణలు ముమ్మడుంగులుగా నిడి మూఁడు మఖంబుల ఫలంబు నొందు; మశ్వమేధావభృథంబు పరమపావనంబు; సమస్తదురిత పరిహరణ నిపుణంబు; నీకు భారత రణకృత జ్ఞాతివధంబు పాతకంబను మెరమెర మనంబునం గలిగియుండు; నట్టివి యెల్లను దీన నిస్తుషంబులగు, సమస్త శుభంబులు నావహిల్లు’ నని యాజ్ఞాపనంబు సేయుటయుఁ బ్రాజ్ఞపరుండైన యా భూవరుండు. | 171 |