పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
యముఁడు సక్తుప్రస్థుని బ్రహ్మలోకంబునకుఁ బో నియోగించుట (సం. 14-93-60)
క. ‘నినుఁ జూచువేడ్క నేడ్వురు | మునుల మనంబుల సమగ్రముగఁ గదిరెడు; స
జ్జన కీర్తనీయ! దివికిం | జనుదెమ్ము ప్రియాసుతస్నుషాసహితముగన్‌.
243
తే. క్షుధ హరించుఁ బ్రజ్ఞాపరిశోభనతలఁ; | దృష్ణ గుందించుఁ గృప; నీవు దెలిసి వాని
ననఘ! నిర్జించి తాలు బిడ్డనక; యతిథి | పూజనం బిట్లు నడపిన పుణ్యమునకు.
244
క. తగు ప్రియమున సకుటుంబం | బుగఁ దన సభ కీవు రాక బుద్ధిం గని బ్ర
హ్మ గడున్‌ వేడ్క విమానం | బు గురువ్రత శీల! శీఘ్రమునఁ బుత్తెంచున్‌.
245
చ. వినుము ప్రభూతదానములు విశ్రుతయజ్ఞములున్‌ సధర్మతా
వినుతికి నెక్కఁజాలవు; వివేకనిధీ! పరిశుద్ధ శోభితా
ర్జనమునఁ దెచ్చికొన్నది వరం బగుఁ బాత్రము నర్హకాలముం
గని లఘువస్తువేని నొసఁగం గను టుజ్జ్వలధర్మ మారయన్‌.’
246
క. అని పలుకుచు దివ్యంబగు | తన యాకారంబు సూపె ధర్ముండు; కన
త్కనక మణిమయ విమానము | వినువీథిం దోఁచె మునులు విస్మయ మందన్‌.
247
వ. అప్పుడు సక్తుప్రస్థుండు పరమప్రీతిం దానును దనవారును ధర్మదేవతకు దండప్రణామంబు చేసి నిలిచిన. 248
తే. ధర్మదేవత యతనితో ‘ధర్మనిరత! | కంటె! బ్రహ్మ వుత్తెంచిన ఘనవిమాన’
మనఁగ నది భూమి కవతరించినఁ బ్రమోద | మెసఁగ నా ధర్ముఁ డాతని కిట్టు లనియె.
249
క. ‘వేడుక నాలుం గొడుకును | గోడలు నీవును బ్రభూతగుణ! యెక్కుము సం
క్రీడమెయి నివ్విమానము; | నీడితగతి బ్రహ్మసభకు నేఁగఁగ వలయున్‌’.
250
క. అనవుడు సక్తుప్రస్థుఁడు | తనవారును దాను నెక్కి ధర్ముం డనుపం
జనియె; నది యంతయును నేఁ | గనుఁగొనుచు బిలంబు వెడలఁగా నామేనన్‌.
251
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )