| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | ఆ సక్తువు గంధంబును నతిథి పాద్యజల క్లేదంబునుం బొలసి సక్తుప్రస్థ కృతంబైన పరమధర్మంబు మహిమం జేసి మదీయ మస్తకంబును నొక్కపార్శ్వంబునుం గనకమయంబులయ్యె; నాఁడు దొడంగి యేను దానవిధి స్థలంబులకును బుణ్యాశ్రమ భూములకును వివిధాధ్వర ప్రదేశంబులకుం జనుచుండుదుఁ; దక్కటి ప్రక్కపసిండి యగు ననుతలంపున నెన్ని చోట్లకుఁ బోయిననుం గాకుండు. లోకోత్తర చరితుం డజాతశత్రుం డశ్వమేధంబు సేయుచున్న వాఁ; డయ్యెడ నా కోర్కి సిద్ధించునని పెద్దయు నాసతో నరుగుదెంచితి; నించుక విశేషంబునుం గాన; వినుం; డది కారణంబుగా నయ్యుంఛవృత్తి విప్రుని ధర్మంబు (నకు) నీ యజ్ఞంబు వోలదంటి’ నని పలికి యన్నకులంబు దా నెక్కడఁ బోవుటయు నెఱుంగకుండం బోయెఁ; ‘బాండుకులపవిత్ర! యమ్మఖంబునం గలిగిన యాశ్చర్యంబు తెఱం గెఱింగించితి; ననిన విని జనమేజయుండు. | 252 |
| సీ. |
‘జన్నంబునందు రాజన్యులుఁ దపమున | మునిజనంబులు శాంతి ననఘ! విప్రు లాసక్తు లగుదు; రట్లగుటఁ గాదే పల్వు | రవనీశ్వరులు దొల్లి యాగకృతుల నతులకీర్తులను సద్గతులను బడసిరి; | ధర్మనందనుఁ డత్యుదాత్త భంగిఁ దొంటి భూనాథులకంటె సత్యమునను | శౌచమునను భక్తి శ్రద్ధ నీగి |
|
| తే. |
నతిశయిల్లె; వేదవ్యాసుఁ డాది గాఁగఁ | గలుగు నార్యజనుల చిత్తములకు నెక్క నమరవల్లభు చంద మందముగఁ జేసె | నశ్వమేధంబు మెచ్చుల కాకరముగ.’ |
253 |
| వ. | అట్టి పరమధర్మంబా నకులంబుచేత గర్హితం బగుటకుం గారణంబేమి? యని యడిగిన వైశంపాయనుండు ధర్మపుత్త్రు నధ్వరంబు నీ చెప్పిన యట్టిద యైనను నొక్కటి చెప్పెద; నవహితుండవగు; మన్నకులంబు హింసాత్మకంబైన పశు యజ్ఞంబుకంటె నహింసా మహితంబైన తపోయజ్ఞం బధికంబని చెప్పినయదియయ్యె; రిత్త చెప్పుటగాక తనశిరంబును శరీరార్ధంబును సువర్ణమయంబు లైన కతంబునుం బలికెం; | గాన దానివచనంబులు ద్రోపువడ; వేత ద్విషయం బైనది యొక్క యితిహాసంబు గల; దది యాకర్ణింపు’ మని యమ్మనుజనాథున కిట్లనియె. | 254 |
| సీ. |
‘అమరాధిపతి దొల్లి యాగంబు సేయంగఁ | దొడఁగ మహాముని స్తోమములును సురసంఘములుఁ గూడి కురుముఖ్య! ఋత్విగ్గ | ణముల నేర్పఱిచి సొం పమర వేదిఁ గల్పించి తగ నగ్నికార్యంబు నడపంగ | నర్హులు పశు నిచయంబుఁ దేర నమ్మునుల్ గనుఁగొని యధిక దయార్ద్రంబు | లగు చిత్తములతోడ నమ్మహేంద్రు |
|
| ఆ. |
నాననంబు చూచి ‘యక్కట! హింస ధ | ర్మంబు గాదు; కృతయుగంబు సొచ్చె; ననఘ! వత్సరత్రయము ప్రాఁతగిలిన బీ | జంబు లిపుడు యజన సాధనములు. |
255 |
| క. |
వేదోదిత ప్రకారం | బాదర మెసఁగఁగ నడపు; మది యుత్తమ ధ ర్మోదయము సేయు నీకు; ద | యాదృష్టిం జూడు పశుగణార్తి మహాత్మా! |
256 |
| ఆ. |
అనిన వారిమాట లాదరింపక యుండె | వాసవుండు; దాన వాదు పుట్టె నమ్మునీశ్వరులకు నతనికి; సురసంఘ | మతనిఁ గూడ వాద మతిశయిల్లె. |
257 |
| వ. | అట్టియెడం గర్మకాండ విదుండగు నుపరిచరవసువు సన్నిహితుం డగుటయు, నయ్యిరుదెఱంగులవారును నారాజన్యుని సాక్షిగాఁ గోరిన నతండు పక్షపాతంబునఁ బశువిశసనంబు కర్తవ్యం బని పలికి యధః పాతంబు ప్రాపించెం; గావున హింసారహితంబయిన యజనంబు పూజనీయంబగుటకు సంశయింప వలవ; దట్లుం గాక. | 258 |
| ఆ. |
ఉంఛవృత్తియైన యుర్వీసురోత్తముం | డట్లు ప్రాణరక్షకై ఘటించి స్వజనములును దాను భుజియింపనుండి యా | సక్తు నతిధి కిచ్చెఁ; జనదె పొగడ.’ |
259 |
| వ. | అనిన విని జనమేజయుం ‘డిది యట్టిద; మునీంద్రా! నీ వచనంబుల కొడంబడితి; ధర్మమార్గగతంబైన ద్రవ్యం బింత భవ్యంబు గదే; యవ్వస్తువు దానంబునకుం బ్రధానం బగుట యింకనుం బ్రస్ఫుటంబుగాఁ బ్రకీర్తింపు’ మనవుడు నా సంయమి యవ్వాసవ పౌత్త్ర పౌత్త్రు నాలోకించి యిట్లనియె. | 260 |