| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
‘ఆరయ వివృతస్వర్గ | ద్వారము రాజులకు నాహవం; బందు మహో దారులు దొల్లియు నరిగిరి; | మీ రీ మార్గమున నడవ మెయికొనుటొప్పున్. |
98 |
| క. |
ఇంటం దెవులునఁ జచ్చుట | కంటెను బాపంబు లొండు గలవె నృపులకున్? బంటకలను పొలిగల నిది | గంట నిధానంబు గంట గాదే మనకున్?’ |
99 |
| తే. |
అనిన విని వార లందఱు నగ్గలికలు | నెఱయు మాటలఁ దనతన తెఱఁగు మెఱయ బహువిధంబుల నతనికి బాస యిచ్చి | యేచి నిజసైన్యములలోని కేఁగి రథిప! |
100 |
| వ. | అయ్యవసరంబున గాంగేయుండు గాంధారేయు నాలోకించి ‘మదీయ సంగర సమయంబునఁ గర్ణుండు పుత్త్రమిత్త్రామాత్యబంధు సహితంబుగాఁ గయ్యంబునకు రాకుండం గలవాడని తేటపడం బలికిన. | 101 |
| క. |
‘చలముకొని యొరుల నుడుపుట | బలియుండై తెంపు సేసి బవరమునకుఁ దాఁ దెలియుట గాదే!’ యని కురు | కులముఖ్యుఁడు వొంగి యతనిఁ గొనియాడెఁ దగన్. |
102 |
| వ. | ఇట్లు పితామహు నెత్తికోలునకుం జిత్తంబు వికసిల్ల ననుజసహితంబుగా నతనిం బరివేష్టించి యన్నరపతి ‘నిబిడచారుసన్నాహంబుగా నుచితవ్యూహం బమర్పు’ మని యతనికిం జెప్పిన, నతండును బడమరమొగం బయి తానును ద్రోణుండును దాలధ్వజంబును వేదికాకేతనంబును గ్రాలుచుండ ముందఱ నిలిచి వలపటఁ గృపాశ్వత్థామలును దాపటం గృతవర్మ మద్రేశ్వరులును వెనుక బాహ్లిక సోమదత్త భూరిశ్రవసులును నడుమం గురుకుమారసమేతంబుగా నమ్మహీనాథుండును, నతని యగ్రభాగంబున ‘నర్జునుం జంపుదుము చత్తు మింతియ కాని యొండులే’ దని శపథంబులు పలికి సంశప్తకు లనం బ్రఖ్యాతు లయిన సుశర్మ మొదలుగాఁ గల పదివేవురు రథిక ముఖ్యులును గలయ నెడనెడం దక్కిన యోధవీరులును నిలుచునట్లుగా నియమించి, తగ నయ్యై సైన్యంబుల కేనుంగులు నేనుంగుల కరదంబులు నరదంబులకుం దురంగంబులుఁ దురంగంబులకు విండ్లవారు విండ్లవారికి నద్ధాయుధులు నడ్డం బగు తెఱంగున నిలువ నియోగించి, మానుషవ్యూహంబు సమకట్టిన, నెన్నండును నిట్టి దృఢవ్యూహంబు గనియును వినియు నెఱుంగమని యెల్లవారు నచ్చెరువునం బొరయుచుఁ బ్రియంబందుచుండిరి; బృందారక ప్రముఖ దేవయోనులును దివంబున నున్న పురాతన ధరారమణులును భారత రణంబు గనుంగొను కుతూహలంబున వివిధ విమానారూఢులై యేతెంచి; రంతకు మున్న యక్కడ. | 103 |