పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ప్రథమాశ్వాసము
పాండవయోధులు యుద్ధంబునకు వెడలుట
సీ. ఏనిక మదమున కెలయు తేఁటుల మొత్త | ములు వెలిగొడుగుల చెలువు గెలువఁ,
దురగఖురోద్ధూతధూళి యప్సరసల | యలక పూవులతోడఁ జెలిమిసేయఁ,
గేతనంబుల మణివ్రాతంబు రోచులు | రవికిరణంబుల నవలఁ ద్రోవ,
జైత్రభేరుల మహాస్వనములు సకల ప | ర్వతములఁ బ్రతివిరావముల నీన,
 
తే. నంబరము రథఘోష భీమాభిరామ | కింకిణీ గణఝణఝణత్కృతిమయముగఁ
బటు పదాతిహేతిప్రభా పటలియెల్ల | దిశలు వెలిఁగింప వెడలె యుధిష్ఠిరుండు.
104
మ. ప్రమదం బాననకాంతిఁ గ్రొత్తవఱుపం బాదాతిభూయిష్ఠ సై
న్యముతో భీముఁడు భూషణద్యుతి నికాయంబున్‌ గదాద్యాయుధో
గ్ర మరీచి ప్రకరంబునుం గలిసి చిత్రస్ఫూర్తి శోభిల్లఁ గా
సమరక్రీడకు వచ్చె జృంభిత భుజాస్తంభోజ్జ్వలాకారుఁడై.
105
సీ. దివ్యరథస్ఫారదీప్తిజాలంబులు | పద్మరాగోజ్జ్వలప్రభలు గాఁగ,
మహనీయ రథ్యవిగ్రహముల జిగిసొంపు | ఘనవజ్ర వసు సముత్కరము గాఁగ,
నొగలపై నున్న కృష్ణుని మేని నునుఁజాయ | హరినీల కాంతివిస్ఫురణ గాఁగఁ,
బ్రస్ఫీత కేతనాగ్రస్థిత కపిదేహ | రోచులు గరుడాశ్మరుచులు గాఁగ
 
ఆ. నంపపొదుల నిగుడు నంశువితానంబు | దీప్రమరకతముల దీధితులుగఁ
దాలిమియును బెంపుఁ దనకు నైజములుగ | విజయరోహణాద్రి వెడలి వెలిఁగె.
106
క. అతులితరథప్రతానో | ద్ధతసైన్యము గొలువ దేవదత్తం బంగీ
కృత సకల తూర్యనాదో | ద్గతి యగుచుఁ జెలంగఁ గ్రీడి గడు నొప్పారెన్‌.
107
తే. గాండివం బింద్రచాపంబుకరణి నొప్ప | మెఱసి దివ్యకిరీటంబు మెఱుఁగు లడర
జ్యానినాదంబు గర్జగా మేని కృష్ణ | కాంతిఁ బొలిచెఁ గవ్వడి యను కారుమొగులు.
108
మ. వివిధోద్దామ హయావళీబహుళ మై విక్రాంతి కేళీ సము
త్సవ కౌతూహల సుందరం బగు మహాసైన్యంబుతో మేదినీ
ధవ సందోహము ప్రీతిఁ బొంద మహిమోదాత్తోగ్రయానంబులం
గవ లేతెంచిరి వేడ్క నొండొరులకుం గయ్యంబుమైఁ జెప్పుచున్‌.
109
మ. రభసక్షోభితమేదినీతలముపై రథ్యప్రచారంబు లొ
ప్ప భుజాగర్వము నెమ్మొగంబులఁ దలిర్పం గన్నెకయ్యంబు న
ర్థి భవత్పుత్రులమీఁది కోపమున నుద్దీపింప నేతెంచి ర
య్యభిమన్యుండును ద్రౌపదేయులును మాద్యద్దంతియూథాకృతిన్‌.
110
వ. ఇవ్విధంబునం బ్రతివింధ్యుండును, శ్రుతసోముండును, శ్రుతకీర్తియు, శతానీకుండును, శ్రుతసేనుండును సౌభద్రుండును దమకుం గన్నాకుగాఁ జెన్నుమిగిలి చనుదేరం గనుంగొని కౌంతేయ బలంబులు సంతసంబునం బొదలె; నప్పుడు. 111
సీ. కరుల సందడి నొప్పు ఘనసేన దుర్దమ | లీలఁ దో నడవఁ బాంచాలవిభుఁడుఁ
దనుజులు ననుజులు దర్పదుర్జయసైన్య | మహిమఁ దో నేతేర మత్స్యపతియు
యాదవానీకంబు లవని గ్రక్కదలఁ దోఁ | జనుదేరఁ బొలుపారి సాత్యకియును
యోధవీరులు ప్రతాపోగ్ర వాక్యములతోఁ | దనుఁ జుట్టిరాఁ జేకితానవిభుఁడు
 
తే. బాసటై వీరరథికులు బలసి యెలమి | నొండొరుల గరువంబుగ నుల్లసంబు
లాడుచును జేరి నడతేర నత్యుదార | గతి శిఖండియు నడచిరి కౌరవేంద్ర!
112
చ. బధిరిత దిఙ్ముఖంబగుచు బంధుర తూర్య నికాయనాద మం
బుధియును బోలె సేనకు విభూతి యొనర్పఁగ నేఁగుదెంచె మా
గధ సహదేవుఁ డప్డు రణకౌతుక సల్లపనంబు నుజ్జ్వలా
యుధ విభవంబుఁ జెన్నొసఁగ నొప్పెడు తమ్మునిఁ బ్రీతిఁ జూచుచున్‌.
113
ఉ. చండ భుజాబలంబుఁ బటుశౌర్యసముల్లసనంబుఁ దోఁప ను
ద్దండత నాత్మ సైనికుల దర్ప మెలర్పఁగ నెమ్మిఁ బల్కుచున్‌
బాండవకోటి చూడ్కులకుఁ బండువుగాఁ జనుదెంచె ధృష్టకే
తుండు సహోదరుండు దనతో నడతేరఁ బరాక్రమోద్ధతిన్‌.
114
మ. విచలద్దండధరోపమాశ్రయ వపుర్విస్ఫార మై దానవ
ప్రచయం బుద్ధత లీలఁ గొల్వఁగఁ దమోరాశిప్రతీకాశ ఘో
రచలద్రూపము భంగికిం దగిన దంష్ట్రాయుగ్మ మొప్పన్‌ ఘటో
త్కచుఁ దేతెంచెఁ గరస్థ శూల రుచు లాకాశంబునన్‌ బర్వఁగన్‌.
115
వ. పాండ్యపతియును గేకయపంచకంబును శైబ్యుండును మఱియుం ‘గాశ కరూశాది బహుదేశాధీశులును దమతమ బలంబుల దళంబుల సవరణల యొప్పును గయ్యంపుఁ గడంకయు నెఱయం గేతనంబులు మెఱయం దోఁతెంచి; రిత్తెఱంగునం గూడి సప్తాక్షౌహిణీ బంధురంబుగాఁ బేర్చిన పాండవసేన మొగంబునకుం దిలకం బై. 116
శా. పుష్టోదంచిత సారవీరరససంపూర్ణాంగమున్‌ సంగరా
వష్టంభోజ్జ్వల వీరరేఖయును భాస్వద్వాహ సంవల్గనో
త్కృష్ట స్యందనముం గనద్ధనువు నుద్దీప్త ధ్వజంబుం దగన్‌
ధృష్టద్యుమ్నుఁడు వొల్చె నైజవిలసత్తేజోవిరాజద్గతిన్‌.
117
వ. ఇట్లొప్పి సేనాపతి యగు నా ద్రుపదసుతుండు ముంగలియై నడపించుచుండ. 118
సీ. ఇల ధూళి యెగసినఁ బలుచగాకుండంగ | రాసిన తొడవుల రజము దొరఁగు,
సమరవికాసంబు చెమట నొప్పఱకుండ | హేతి దీధితులు రేయెండ నొడుచు,
భేరీధ్వనుల నింగి బీఁటలు వోకుండఁ | గరికర శీకరోత్కరము దడుపు,
దర్పంబు గనుఁజాటు దాఁకకుండఁగ గొడు | గులపెల్లు ఖచర దృక్కోటి నాఁగు,
 
తే. ననిన నిజమైనయట్లుండె మనుజనాథ! | ధరణి వడవడ వడఁకె దిక్తటము లద్రువ
భూరి చతురంగ చండ విస్ఫూర్తిఁ బాండు | నందనులసేన గలనికి నడచునవుడు.
119
వ. ఇట్లు నడచి కురుక్షేత్రంబులోన నుత్తమప్రదేశం బగు శమంతపంచక సమీప స్థలంబు సేరు సమయంబున ధర్మనందనునకు దోఁచు దక్షిణాక్షిస్పందనాది శుభసూచకంబులకు మెఱుంగు వెట్టిన చందంబున. 120
క. ఏనుఁగుల మదము తావియు | సైనిక నికరానులేపసౌరభ్యములుం
దా నుపలాలించుచుఁ బవ | మానుం డనుకూల మృదు గమనమునఁ బొలసెన్‌.
121
వ. దాని కయ్యుధిష్ఠిరుండు ప్రముదితచిత్తుం డగుచుఁ బ్రీతచేతస్కులగు తమ్ములుం బాంచాలమాత్స్యాధిపతులును సకలజనంబులును పరివేష్టింపం దూర్పుమొగంబై కౌరవులున్న చక్కటికిం గట్టెదురుగా నిలిచి, యెల్లవారి సైన్యంబులుం గ్రమంబునఁ గొలంది వెట్టుకొనుచు , నందఱకు సంజ్ఞలు నడియాలంబులుం గల్పించి, దొరలదెసం గనుంగొని, మన మీ రణంబునందు ధరణీ రాజ్యంబు వడసెద మొండెఁ బూజ్యం బగు నాకలోకనివాసంబు గనియెద మొండె’ నని నిశ్చయించి, నా కెలంకుల నిలువుం డని పలికిన, విని, వారలు ధీరోదాత్తంబులగు వివిధ వాక్యంబులం బ్రతిజ్ఞలు సేసి, నిజశంఖంబులు పూరించి, తమతమ బలంబులలోనికిం జని; రజ్జనపతియును దన కమర్చిన కజ్జంబులును బుష్పఫల కర్పూర కస్తూరికాదులును వారలకుం బుచ్చుచుండె.’ 122
క. అనిన విని యాంబికేయుఁడు | మనమొన ‘గడుఁ బెద్ద దీని మార్కొనఁ గుంతీ
తనయులు గొంచెంబయ్యును | ననుమానింపక కడంగు టది యెట్లొక్కో!’
123
వ. అనుటయు సంజయుం ‘డదియునుం జెప్పెద విను’ మని యతని కిట్లనియెఁ: ‘గౌంతేయాగ్రజుండు కురుబలంబు గనుంగొని కొండొక విన్ననై వివ్వచ్చు నాలోకించి. 124
చ. ‘ఘన మయి తోఁచుచున్నయది కౌరవసైన్యము చూడ్కి కందు శాం
తనవుని తాలకేతన ముదగ్రత ముందటఁ బొల్చెఁ జూచితే’
యనవుడుఁ బిన్ననవ్వు నగి యన్నరుఁ డన్నమొగంబుఁ జూచి నె
ట్టన బలుమాట లాడఁగఁ గడంగఁగ నొల్లక యత్యుదాత్తతన్‌.
125
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )