| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అతనితో నిట్లనియె. | 126 |
| చ. |
’మునివరుఁ డైన నారదుఁడు మున్నొకయప్పుడు సెప్పె ‘ధర్మ నా శను లగు వారలం బ్రబలసైన్యము గల్గెనయేనిఁ గొంచె మై నను రిపుసేన గెల్చు’ నని నాకు గురుండును దేవతానదీ తనయుఁడు నేర్పడన్ వినఁగఁ దాను బరాశరసూనుఁడుం గృపన్. |
127 |
| వ. | అది య ట్లుండె నమానుషశక్తిసముద్దామం బగు భీము గదావిహారంబు వైరిదుస్సహంబు; ధృష్టద్యుమ్న శిఖండి ప్రముఖ పాంచాలవర్గం బనర్గళ విక్రమంబు, విరాట శంఖ ముఖ్య మాత్స్యనికరం బరిభయంకరంబు; సాత్యకి చేకితానాది యాదవ నివహంబు భవజ్జ యావహం; బభిమన్యు హైడింబ ప్రభృతి కుమారలోకం బలోకసామాన్య బలశౌర్యధుర్యంబు; నీ కటాక్షంబును గృష్ణు సంరక్షణంబునుం గలిగి గాండివం బను పామునకు ఱెక్కలు వచ్చిన ట్లున్నయది; యట్లుంగాక యేనుఁగుంబోలె నీ లావు నీ వెఱుంగవు; దివిజులకు నజయ్యుండవు; నీ వలిగిన నెవ్వరె ట్లయ్యెదరో యటు సూడు’ మనినం దెలివొంది సంక్రందనందనునకు ధర్మనందనుం డిట్లనియె. | 128 |
| తే. |
కౌరవవ్యూహమునకుఁ దగంగ నొక్క | బంధురవ్యూహ మొనరింపఁ బంపు’ మనిన నతఁడు ద్రుపదాత్మజుని నచలాఖ్యమైన | ఘనతర వ్యూహ మొనరింపఁ బనుచుటయును. |
129 |
| వ. | ఆ ధృష్టద్యుమ్నుండును గలయ మెలంగి మోహరం బమర్చె; నయ్యచలవ్యూహమ్మునందు దా నగ్రభాగంబున నభిమన్యు ప్రభృతి కుమార నకుల సహదేవ సహితంబుగా భీమసేన పరిపాలితుండై నిలిచెఁ; దమతమ బంధువులకును బలంబులకును బలువుతోడి చెలువు గలుగఁ జేకితాన సాత్యకి సమేతంబుగాఁ బాంచాల మాత్స్యాధిపతులు దక్షిణోత్తర భాగంబుల నిలిచిరి; నడుమ నడగొండగమియుం బోని గజరాజితో రాజు రథారూఢుండై ధవళచ్ఛత్త్ర చామరంబులు మెఱయ విప్రవర్గంబునకు నంబర జాంబూనదంబు లొసంగుచు విజయాశీర్వాదంబు లాదరించుచుండె; ముందటఁ బురందరనందన సంరక్షితుండై శిఖండి గాంగేయునకుఁ గట్టెదురుగా నిలిచి గండు మిగిలి యొప్పె; నపరభాగస్థులై మాగధ సహదేవ ధృష్టకేతు లవష్టంభ విజృంభణంబునఁ బొలిచి; రివ్విధంబునం జారుభీషణం బై. | 130 |
| క. |
అరదములు దీవు, లున్నత | కరులు గిరులు, హరులు వీచికలు, సుభటసము త్కర ముగ్రసత్త్వములుగా | శరనిధి గతిఁ బాండుపుత్త్ర సైన్యం బొప్పెన్. |
131 |
| క. |
ఉభయబల దీప్తకేతు | ప్రభలం గీడ్పఱిచి కురుధరావల్లభ సై న్య భయంకరమై శక్ర | ప్రభవు కపిధ్వజము వెలిఁగె బ్రకటస్ఫురణన్. |
132 |
| తే. |
అరుణములును సితంబులు నసితములును | నైన జోడులతో దొరలందు నిందు నాలలోని యాఁబోతులఁ బోలి పొలిచి | రెసఁగు బెడిదంపుమాట లాకసము ముట్ట. |
133 |
| తే. |
కొన్ని భూముల బలములు గురునృపాలుఁ | బాండవులఁ గొన్ని భూముల బలము లీసు గలిగి పాయలై కొన్ని భూముల బలములు | రెండు దిక్కులయందుఁ జేరినవి యధిప! |
134 |
| వ. | కావున. | 135 |
| క. |
బాలురు వృద్ధులుఁ దక్కఁగ | వ్రాలి యిలం గలుగు పురుషవర్గంబు జయ శ్రీలోలత నేతెంచుట | నేల యవిసి మూఁగినట్లు నెఱసె బలంబుల్.’ |
136 |
| వ. | అనిన విని ధృతరాష్ట్రుం ‘డప్పు డప్పాండవ కౌరవ సైన్యంబులలో నెయ్యది యుబ్బు గలిగి యుండె’నని యడిగిన సంజయుం డతని కిట్లనియె. | 137 |
| క. |
రెండు బలంబుల వారలు | నొండొరువులకంటెఁ జాల నుక్కు మిగిలి యొం డొండ కడంగుచు నుజ్జ్వల | చండస్థితి నొప్పి రపుడు జగతీనాథా! |
138 |
| వ. | అని వెండియు. | 139 |
| క. |
ఆ రెండు బలములందును | దోరం బైయున్న యట్లు దోఁచెం బాండు క్ష్మారమణసుతు బలము నర | నారాయణు లునికిఁ జేసి నాకుం జూడన్. |
140 |
| క. |
ఎలసి పయివారి దంతిఘ | టల మదములఁ దావి వెట్టుటయుఁ గౌరవసే నల యేనుంగుల మదధా | రలు డొంకెం బొలయు మధుకరములుబ్బడఁగన్. |
141 |
| తే. |
అధిప! నీ తనయుండు గయ్యంబు వొడుచు | తెంపు వదలక విభవంబు పెంపు మెఱసె; సారసానకు వచ్చిన చందమునను | నెలమిఁ బొందిరి పాండవేయులును హరియు. |
142 |
| వ. | అట్టియెడఁ గృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తంబులు పూరించిన. | 143 |
| క. |
ఆ నినదము విని పాండవ | సేన లలరె; ధార్తరాష్ట్ర సేనాగత యో ధానీక ములికె; నెత్తురు | వాన గురిసె నంతఁ గౌరవవ్యూహమునన్. |
144 |
| వ. | మఱియు ననేక దుర్నిమిత్తంబులు వుట్టెఁ; బుట్ట కేల తక్కు? దేవవ్రతుండును గురుండును గురునందనుండును గృపుండును నిచ్చలుఁ గయ్యంబునకు వెడలు నప్పుడు ‘పాండవులకు జయం బవశ్యంబు నయ్యెడు’ మనుచు వెడలుదు; రది యట్లుండె నయ్యశుభసూచకంబులకు ధార్తరాష్ట్రులు దలంకక తూర్యంబులు మొరయింప నియోగించిన. | 145 |
| ఉ. |
అప్పుడు రెండు సైన్యములు నాహవకేళికి నుత్సహించి పె ల్లొప్పెఁ జెలంగి యుబ్బినసముద్ధతిఁ బొల్పగు తొంటి చందముల్ దప్పి యుగాంతకాలచలితత్వము నొంది పరస్పరాకృతుల్ గప్ప నెదుర్చు నంబుధియుగంబు మహోగ్రతఁ గ్రేణిసేయుచున్. |
146 |
| వ. | తదవసరంబున నుభయ బలంబులవారును. | 147 |
| చ. |
బవరము సేయుచుండియును భాషణముల్ దగఁ బల్కుచుండఁగా నవినయవృత్తి మై వలవ దాయుధ మార్చుటఁ దాఁకి పడ్డఁ గై దువు వడినం దొలంగినను దోర్బల మేది భయంబుఁ బొందినం గవియక బీఱువోయినను గాదు వధింపఁగ నెట్టి శత్రునిన్. |
148 |
| వ. | అని సమయంబుసేసి; రా సమయంబున. | 149 |
| క. |
పలు చాయల నొప్పిన యా | బలము లొకటి కొకటి కెదురఁ బల్లవ పుష్పా వలి గల వనములక్రియ ని | శ్చలత నిలిచి పొలిచె నసమసమధైర్యములన్. |
150 |
| క. |
అత్తఱి సురఖచరాదుల | చిత్తము లనిఁ జూచువేడ్కఁ జిడిముడి వడఁగా నొత్తొరవున నిరుదెఱఁగుల | యుత్తమవీరులును దాఁక నుంకింపంగన్. |
151 |