| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ప్రథమాశ్వాసము |
| తే. |
సమరకౌతుకి యైన యజాతశత్రుఁ | డొప్పు మిగిలెడు మైమఱు వూడ్చి యాయు ధములతోఁ గూడఁ దనయరదమునఁ బెట్టి | యిలకు దిగి మౌనియై కరంబులు మొగిడ్చి. |
152 |
| వ. | భీష్ము దెసకుం జనుచున్నం గనుంగొని యమ్మహీవల్లభు తమ్ములును శౌరి సాత్యకులును బరమాప్తు లగు ధరణీశులు నతని చేతోవృత్తం బెఱుంగమి నుత్తలపడు చిత్తంబులతో వాహనంబులు డిగ్గి యతనిం గూడం జని యప్పుడు. | 153 |
| సీ. |
‘ఏ మెల్ల నుండ నీ విట్లొంటి గాల్నడ | నేఁగుచున్కికిఁ గత మెద్దియొక్కొ? పన్నిన పగఱపై సన్నాహ మంతయు | నెడలించి నడచుట యెట్టులొక్కొ? రిపులు దేఁకువ సెడఁ గృపణత దుర్బలు | చాడ్పునఁ జను టేమి చంద మొక్కొ? యడరి పోరాటకు నదనైనచో నొప్పు | పొలివోవఁ బోవుట వోలు నొక్కొ? |
|
| తే. |
యని క్రమంబున నా మరుత్తనయ విజయ | నకుల సహదేవు లడుగ భూనాథుఁ డొక్క పలుకుఁ బలుకక యరుగంగఁ బద్మనాభుఁ | డక్కుమారులతో నిట్టులనియె నగుచు. |
154 |
| వ. | ‘ఇతని తలం పే నెఱింగితి; నితండు భీష్మద్రోణ కృప శల్యులకు నమస్కరించి, వారలచేత ననుజ్ఞాతుండై భండనంబు సేయువాఁడు గాఁ దలంచి చనియెడుఁ; బెద్దల యనుజ్ఞఁ గొని కయ్యంబు సేసిన జయం బగుట నిశ్చయం బని యార్యులు సెప్పుదురు, గావున నా సుకర్మం బాచరించుట మేల కాక, యనిన వినియజాతశత్రు వెనుక నప్పు డరిగినవారలు పలుకు లుడిగి నిలిచి వెఱగుపడి చిత్రరూపంబుల చందంబై చూచుచుండిరి; కృష్ణార్జునులును భీముండును గవలును దోన చనం గౌంతేయాగ్రజుండు గాంగేయు తేరు సేరంబోవం, గౌరవ సైన్యజనంబు లేపు మిగిలి మెడ లెత్తి కనుంగొని; రయ్యవసరంబున నందలి యోధవీరు ‘లితం డింత వెఱచునే’ యనువారును ‘వెఱవ నిప్పు డితని కేమి వచ్చె’ ననువారును, ‘వృకోదరుండు వివ్వచ్చుండు గవలు సౌభద్రుండు సాత్యకి విరాటుండు ద్రుపదుండు ధృష్టద్యుమ్నుండు శిఖండియుం గలుగఁ దన కింత యేల?’ యనువారును ‘ధర్మతనయుండు భీతుండు గాఁ’ డేమి తలంపున వచ్చెనో? యనువారును; మఱియు ననేక ప్రకారంబులం బలుకు వారునునై యుండిరి; పాండవ సైనికులు ‘మానధనుండగు నిమ్మానవనాథుండు నదీనందనుతో నే మనువాఁ ? డతం డితని నేమిభంగి సమ్మానించు? మాధవ ధనంజయు లెట్లు పలుకువారు? మారుతసుతుండును మాద్రీసూనులును నెత్తెఱంగున మాటలాడుదురు? వీరేమిటి కివ్విధంబునకుం దొడంగి రనుచు వగచి వెండియు వివిధ వచనముఖరు లగుచుండి; రయ్యుధిష్ఠిరుండు సముద్యత నానాయుధ బహుళంబైన కురువ్యూహంబు దఱిసి, పితామహుపాలికిం బోయి తత్పాదంబులకుఁ, బ్రణామంబు సేసి సవినయంబుగా నతని కిట్లనియె. | 155 |
| ఆ. |
‘అనఘ! నీ కెదిర్చి యని సేయువాఁడనై | ము న్ననుజ్ఞ గొనఁగ నిన్నుఁ గాన నెమ్మి వచ్చినాఁడ; నీచేత దీవన | వడసి చనిన నేను బగఱ గెలుతు.’ |
156 |
| సీ. |
‘అన విని గాంగేయు! డక్కట! నీ విట్లు | సనుదేక తక్కిన శాపమిత్తు; వచ్చితి మేలయ్యె; వైరుల నిర్జింపు, | మిది గాకయును వర మెద్దియైన నడుగుము, నీకుఁగా ననిసేయు టొక్కటి | దక్కంగ’ నావుడు ధర్మసుతుఁడు ‘రారాజు పక్షమై రణము సేయుము; నాకు | హిత మగు కార్యంబు మతిఁ దలంపు’ |
|
| ఆ. |
మనుడు ‘నట్ల కాక యట నీతలం పేమి?’ | యనిన భీష్ముతోడ నతఁడు ‘నిన్నుఁ బోర గెలుచు విధము బోధింపు’ మనుటయు | సస్మితాస్యుఁ డగుచు శాంతనవుఁడు. |
157 |
| క. |
‘నను మార్కొని గెలువఁగ న | య్యనిమిషులకు నరిది’ యనుడు ‘న ట్లగుటఁగదా నిను వేఁడెద’ నని కుంతీ | తనయుఁడు వలుకుటయు విని పితామహుఁడు గృపన్. |
158 |
| ఉ. |
‘చుట్టరికంబునన్ మనసు సొచ్చి ననుం గరఁగించి వేఁడినన్ దిట్టతనంబు వో విడిచి తీవ్రరణంబు కడంక దక్కి నేఁ బట్టిన యాయుధంబు పెడఁబాసినఁ గాని వధింపఁ బోల ద ట్టిట్టన కేఁగు; మిప్పరుస యింతక కాలము గాదు దానికిన్. |
159 |