పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ప్రథమాశ్వాసము
భీష్ముఁడు దుర్యోధన ప్రేరితుండై విజృంభించి పాండవవీరుల నొప్పించుట (సం. 6-45-1)
సీ. మనుజేంద్ర! వినుము నీ తనయుండు వనుపంగ | దుర్ముఖ కృప కృతవర్మ మద్ర
పతి వివింశతులు విస్ఫారబాణార్చులఁ | బంచాగ్నులును బోలెఁ బ్రజ్వరిల్ల
తన కెలంకులఁ గోలుతలసేసి తఱుమంగఁ | దాలకేతువు మహోత్తాలమూర్తి
నాభీల మై క్రాల నడరి పాండవసేనఁ | దఱిసి మందాకినీతనయుఁ డేచి
 
తే. చేది పాంచాల కేకయు లాది గాఁగఁ | గల్గు భూపాల కోటి మొగ్గరము లెల్లఁ
గలఁగఁ దిరుగుడువడ నోరగిలఁగఁ బెల్ల | గిల్లఁ దల్లడపడ రణక్రీడ సల్పె.
268
క. పాయవడఁ జొచ్చు గుంపులు | సేయును మలఁకలఁ జరించి చించును గోణ
వ్యాయామ గతుల వలయము | లై యుండం దిరిగి కలఁచు నరి సైన్యంబున్‌.
269
క. డొల్లెడు తలయును దునిసెడు | విల్లును ధర కొఱగు మేను విఱిగెడు సిడముం
బెల్లు దొరఁగు నెత్తురు నై | పల్లటిలం దొడఁగె నపుడు పాండవ బలముల్‌.
270
వ. ఇట్లు ప్రళయకాలతాండవంబునం బ్రచండమూర్తి యగు నష్టమూర్తియుం బోలె విజృంభించిన భీష్ము మార్కొను మగలు లేక పాండవసైన్యంబు బెండువడియున్న యెడ నభిమన్యుండు గనకవర్ణ తురంగంబులుం గర్ణికారధ్వజంబును మెఱయం దాఁకి. 271
సీ. శల్యు నారాచ పంచకమున నొప్పించి | యొకకోలఁ గృతవర్మయురము నొంచి,
క్రూరభల్లమున దుర్ముఖు సూతు తల ద్రుంచి | తఱిమి వివింశతి ధనువుఁ దునిమి
వెడఁద యమ్మున నేసి వెండియు మూఁడు వా | లికయమ్ము లొడలఁ గీలించి కృపుని
హయముల శరచతుష్టయతాడనమున ను | బ్బడఁగించి భీష్ముపై నడరి మేన
 
తే. విశిఖ నవకంబు నాటించి వెగడు పఱిచి | పేర్చి యార్చిన సురకోటి పిచ్చలించె;
మెచ్చి భీష్మాదు లెల్ల వివ్వచ్చుఁ బోలు | నెక్కు డగుఁ గాని యసదుగాఁ డీతఁ డనిరి.
272
చ. అమరతరంగిణీ తనయుఁ డర్జుననందనుసూతుఁ గేతుదం
డము నిరు మూఁడు దూపులఁ బడం గడు బెట్టిదమేసి యుజ్జ్వలా
స్త్రము లడరింపఁ గూడికొని తక్కటి యేవురుఁ బెక్కులమ్ము లొ
క్కమొగి రయంబునం గురియఁగా గిరి వోలె నతం డుదగ్రుఁడై.
273
క. వారల శరవర్షంబులు | వారించుచు వేఱవేఱ వాలంపగముల్‌
వారలపైఁ గురియుచుఁ గురు | వీరుని తాలధ్వజంబు విఱుగఁగ నేసెన్‌.
274
ఆ. తాటిసిడము విఱిగి ధరణిపైఁ గూలినఁ | బాండురాజ సుతుల బలము లెల్ల
నొక్కపెట్ట యార్చె నుక్కఱి కౌరవ | సేన జోదుపిండు చిన్నఁబోయె.
275
తే. సింహనాదంబుతో భీమసేనుఁ డప్పు | డనుజ తనయునిఁ జేకొని యరిబలంబు
దరలఁ దాఁకిన నతని యుత్తాల సింహ | కేతనముఁ గూల్చె సురనదీసూతి యలిగి.
276
క. పవనజుఁడు మూఁడు శరముల | దివిజనదీసూను నేసి దృఢగతిఁ గృపు మే
నవియ నొకటఁ గృతవర్ముని | యవయవతతి నెనిమిదింట నార్చుచు నేసెన్‌.
277
వ. మఱియు నమ్మారుతతనయుండు. 278
శా. మద్రేశున్‌ వెగడొంద నేసె; నతనిన్‌ మన్నించు జోదుల్‌ ప్రతా
పోద్రేకంబున నొక్కపెట్ట రథవేగోద్దీప్తులై తాఁకినన్‌
రౌద్రం బాకృతిఁ బొంద సూతహయగాత్రంబుల్‌ వెసం ద్రుంచి చం
చద్రక్తోదకవీచులం దడిపె నాశ్యర్యంబుగా నందఱన్‌.
279
వ. తదనంతరంబ సాత్యకియు ధృష్టద్యుమ్నుండును గేకయ పంచకంబును విరాటుండు నతని కొడుకులుం దలకడచి యురవడించిన. 280
క. అందఱ మేనుల గంగా | నందనుఁడు శరత్రయములు నాటించెను; శ
ల్యుం దాఁకె నుత్తరుఁడు గరి | సందోహముతోడ నధిక సంరంభమునన్‌.
281
క. నిజ ఘటకు మిగిలి, యుత్తరు | గజ మమ్మద్రేశు రథము గదిసి తురంగ
వ్రజము పయి కడరి కడు న | క్కజముగ వెస నేలఁ బెట్టి కాలం జమరెన్‌.
282
తే. శల్యుఁ డుగ్రకోపంబున శక్తి యెత్తి | రయము మెఱయ వైరాటి యురఃస్థలంబు
దూఱ వైచిన నంకుశ తోమరములు | విడిచి నడుమన చచ్చుచుఁ బుడమిఁ బడియె.
283
క. మద్రేశుఁ డంత నిలువక | రౌద్రంబున వాలు వెఱికి రయము మెఱయ న
త్యుద్రేకత డాసి యుఱికి | భద్రకరిం గరముఁ దునిమి పదవైచె నిలన్‌.
284
క. తన విక్రమంబు సేనలు | వినుతింపఁగ నిట్లు సేసి వేగమ కృతవ
ర్ముని రథము పైకి లంఘిం | చెను శల్యుఁడు గిరికి దాఁటు సింగము భంగిన్‌.
285
చ. అనుజుఁడు వడ్డ శంఖుఁడు మహాగ్రహవృత్తిఁ గడంగి శల్యుపైఁ
దన రథరాజితోఁ గవియు దారుణ దర్పముఁ జూచి దంతి ము
ట్టినఁ బరికాఱ మొత్తము వడిం బఱతెంచిన మాడ్కి నాపగా
తనయుఁడు లోనుగా రథికదంబము బిట్టడరెన్‌ సముద్ధతిన్‌.
286
తే. భీష్మునంపఱ కోర్వక పెల్లగిల్లి | శంఖుతోడి రథావళి జలదపంక్తి
భూరిమారుతహతిఁ దూలపోవునట్లు | వఱచెఁ గని క్రీడి యడ్డంబు వఱపెఁ దేరు.
287
క. కొఱవియుఁ గొఱవియుఁ దాఁకిన | తెఱఁగున నర్జునుఁడు సురనదీ సూనుఁడుఁ జూ
పఱు వొగడఁ దాఁకుటయు ని | ద్దఱ దిక్కుల సైన్యములును దలపడియె వడిన్‌.
288
వ. అంత నపరాహ్ణం బయ్యె నట్టియెడ; 289
క. కృతవర్మ రథము డిగి యు | ద్ధతుఁ డై మద్రపతి ఘనగదామండితహ
స్తత మెఱయఁ గవిసి రథ్య | ప్రతతిన్‌ ధరఁ గూల్చె శంఖుబలము దలంకన్‌.
290
క. విరథుఁడయి మాత్స్యపుత్రుఁడు | గరవాలము గొని రథంబు గ్రక్కున డిగి యా
తురత సురరాజనందను | నరదము మాటునకు నతిరయంబున నరిగెన్‌.
291
క. దిక్కులఁ దనబాణంబులు | పిక్కటిలఁగ నుల్లసిల్లి భీష్ముఁడు నరు తే
రక్కడ డించి ద్రుపదవిభుఁ | డుక్కఱఁ దత్సేనమీఁద నురవడిఁ గవిసెన్‌.
292
వ. ఇట్లు గవిసి. 293
క. ఎండిన యడవిన్‌ దరికొని | మండెడు కార్చిచ్చు మాడ్కి మారి మసఁగిన
ట్లొండొండ నేచి హయవే | దండ స్యందన పదాతి తతిఁ బొడ వడఁచెన్‌.
294
క. కేకయు లేవుర బలములు | నాకులతం బొంద మార్గణాసారమునం
జీకాకు పఱిచె భీష్ముఁ డ | నేక గతులఁ దన రథంబు నేడ్తెర మెఱయన్‌.
295
క. ఉఱక విరాటుబలముపై | గొఱియల పిండునకుఁ గవియు కోల్పులిక్రియ బి
ట్టఱఁ గవిసి నదీసూనుఁడు | నుఱుమాడె వియచ్చరులు వినుతి సేయంగన్‌.
296
తే. ఇట్లు పాండవ సైన్యంబు లెల్లఁ గలఁగి | యిక్కడక్కడఁ బడుచుండ నక్కజంపుఁ
గడిమి కచ్చెరువడి యొక్క కడకు వచ్చి | పాండుసూనులు నివ్వెఱపాటు నొంద.
297
క. శాంతనవుఁడు దేజోదు | ర్దాంతుం డై నావెలుంగు ధరకెల్లను జా
లింతు నినుఁ డస్తశైలో | పాంతమునకుఁ జనిన నేమి యనిన ట్లుండెన్‌.
298
క. సోమాన్వయ ప్రదీపకుఁ | డీ మెయి దేజో విశేష మెసకం బెసఁగం
గా మెఱయుట గనుఁగొని సి | గ్గై మఱువడుమాడ్కిఁ గ్రుంకె నర్కుం డంతన్‌.
299
తే. జలరుహంబులు పాండవసైనికుల మొ | గంబు లట్టుల విన్ననై కాంతి దఱిఁగె;
వారి మనముల భీత్యంధకార మడరు | కరణిఁ జీఁకటి యెడనెడఁ గవియుఁదెంచె.
300
వ. అప్పుడు గయ్యంబు సాలించి. 301
తే. ఉభయసేనలుఁ దమతమ యునికిపట్ల | కరిగెఁ దాత పరాక్రమ స్ఫురణమునకుఁ
గురువిభుండును దమ్ములుఁ బరమహర్ష | భరితహృదయులై యుండిరి భరతముఖ్య!
302
వ. అని సంజయుండు భీష్మాటోపంబు సెప్పెనని పలుకుటయుఁ ‘దొలునాఁటి కయ్యంబున గాంగేయుచేత నట్లయినఁ బాండునందనులు పదంపడి యేమి సేసి?’రని యడిగిన 303
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )