| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము |
| మ. |
మన సేనం గలగంగఁ జేయుచు మదిన్ మందాకినీ నందనుం డు ననుం గైకొనకున్నవాఁ; డితని యాటోపం బడంగించెదన్; నిను మెప్పించెదఁ జూడు! ఖేచరులు వర్ణింపన్; విజృంభించెదన్ దనుజధ్వంసి! రథంబు వే పఱపు ముద్యద్విక్రమప్రక్రియన్.’ |
31 |
| క. |
అనిన విని విష్ణుఁ డా జి | ష్ణునిఁ గనుఁగొని ‘యేను నీ మనోరథము తెఱం గునకుఁ దగ రథముఁ గడపెద | విను! తిరమై నాదు పలుకు వీరవినోదీ! |
32 |
| చ. |
‘గజిబిజి లేక, యుబ్బక, యఖండిత శౌర్యము నస్త్రవిద్యయున్ భుజబలముం బొగడ్త వడ, భూరిపరాక్రమశాలి భీష్ము న క్కజముగఁ దాఁకి యద్దెస నకంపితులై నడతెంచు శల్య కుం భజ కురురాజు లచ్చెరువుపాటు భయంబును బొందఁ జేయుమీ!’ |
33 |
| వ. | అని పలికి యచ్యుతుం డుచితరయంబున రథంబు నడప ధనంజయుండు తన కడ్డం బైన శూరసేన సేనా కాననంబు పటుబాణ పరంపర యను మహావాతవేగంబున బడలుపడం జేయుచుఁ గవిసినం గని గాంగేయుం డెదిర్చి పేర్చి డెబ్బదేడు క్రూర నారాచంబు లేసిన నప్పుడు గూడుకొని ద్రోణుం డిరువదేనింటను శారద్వతుం డేనూటను వికర్ణుండు మూఁటను శల్యుండు తొమ్మిదింటను దుర్యోధనుం డఱువది నాల్గింటను రభసోల్లాసంబున నేసిన. | 34 |
| క. |
అవి యెల్లను బైఁ గురియఁగ | నవికలమూర్తి యగు ననిమిషాధిపతనయుం డవిరళ వర్షము మీఁదం | గవియంగా నొప్పు నగము కరణిం బొలిచెన్. |
35 |
| వ. | ఇట్లు సుస్థిరుండై. | 36 |
| సీ. |
ఇరువదేనమ్ముల సురనదీనందను, | ద్రోణుని నఱువది బాణములను, తొమ్మిది సునిశితాస్త్రమ్ములఁ గృపుని, | వికర్ణశల్యుల విశిఖత్రయముల, రారాజు నైదు నారసముల నొప్పించె | నప్పుడు గడఁగి సాత్యకియు మత్స్య జనపాలకుండు ధృష్టద్యుమ్నుఁడును ద్రౌప | దీ సూనులును సుభద్రాసుతుండు |
|
| తే. |
భీష్మునకుఁ దోడుపడువారి బెట్టుదాఁక | నతఁడు ఫల్గును నేఁబది శితశరముల నేసి పేర్చినఁ గౌరవు లెల్ల నార్వ | నుఱక యాతఁడు కురుసేనఁ దఱియఁ జొచ్చె. |
37 |
| వ. | ఇట్లు క్రేడించి గాంగేయు డించి గాండీవి దనయరదంబు రయంబున. | 38 |
| క. |
పఱపి రథికులను సూతుల | నఱకిన మ్రోడుపడియుండె నానారథముల్ వెఱచఱచిరి కురువీరులు | పఱిపఱి యై మనబలంబు భయముం బొందెన్. |
39 |
| వ. | అట్టియెడ నీ కొడుకు నీ తండ్రితో నిట్లనియె. | 40 |
| చ. |
తన భుజసార మేర్పడఁగ దర్పితుఁడై మనయందుఁ జేయఁగ ల్గిన నృపకోటి నెల్ల నవలీలమెయిన్ మును మించి త్రుంచె న ర్జునుఁ డదె నీవు సూడ ననురూపమె నీ కిది? మున్ను కర్ణు భం డనము దొలంగఁ జేసి తకటా! యిటు లొప్పరికింపఁ బాడియే?’ |
41 |
| వ. | అనిన విని యనిమిషనదీ నందనుం ‘డితం డింత యొప్పని పల్కు వల్కునే ?’ యని మనంబునం గుత్సించుచు బీభత్సు దెసకు నడరుటయు, దుర్యోధన వికర్ణులు వలపటను గురుపుత్రుండు దాపటను గూడుకొని యా క్రీడిపైఁ బటు శరపరంపరలు పరఁగించి; రతనికి నన్నలుఁ దమ్ములు బాసట యయి కడంగి కవిసి రిట్లు దొరలు దలపడిన నిరువాఁగును జిందమ్ములు గర్జిల్ల సందడికయ్యంబుగాఁ బెనంగిన గాండీవి గాంగేయు లొండొరుల చండబాణంబులఁ ద్రుంచుచు వర్మంబులు సించుచు నొకళ్ళొకళ్ళ వెలిమావులం బడగలం దాఁక నేయుచుం జేరి పోరు సమయంబున. | 42 |
| తే. |
ఆపగానందనుండు మురారి యురము | బాణవితతిని భేదింప శోణితమునఁ దోఁగి యతఁ డొప్పెఁ దలిరాకు దుఱఁగలింప | మెఱయు నవపారిజాతంబు తెఱఁగు దాల్చి. |
43 |
| క. |
కనుఁగొని కోపంబున న | ర్జునుఁ డమరనదీ తనూజు సూతుని నొప్పిం చిన నాతఁ డతని య | రదము మునుగంగాఁ జేసె బాణముల వెల్లువలన్. |
44 |
| క. |
ఆ వెల్లువ శరజిహ్వలఁ | ద్రావి ధనంజయ మహాగ్ని దరికొని కవియం గా వెగ డొందెడు కురుబల | దావము శాంతనవుఁ డంబుదము క్రియఁ గాచెన్. |
45 |
| వ. | ఇత్తెఱంగున నెక్కువ దక్కువలు లేక యక్కజంబుగాఁ బోరువారిం జారణ సిద్ధ గంధర్వాదులు గనుంగొనుచుండి తమలో నిట్లనిరి: | 46 |
| ఉ. |
ఒండొరు చండవిక్రమము లోర్తురు వీరల కాక వీరితో నొండొకరుండు మార్కొనఁగ నోపునె? పూని కృతాంతుఁడైన నా ఖండలుఁ డైన నివ్విధపుఁ గయ్యము లెక్కడ నైనఁ గంటిమే! పాండవ కౌరవోత్తముల బాహు విలాసము లిట్టులుండునే!’ |
47 |