పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము
ధృష్టద్యుమ్న ద్రోణాచార్యుల యుద్ధము (సం. 6-49-1)
వ. అని యగ్గించి రంత మార్తాండుండు గగనమధ్యవర్తి యయ్యె ; నప్పుడు ధృష్టద్యుమ్నుండు ద్రోణాచార్యు పయిం గవిసిన నతండు. 48
తే. సూతు నొక్క వాలమ్మున స్రుక్క నేసి | యశ్వముల నాలుగింట నుబ్బడఁగఁ జేసి,
సిడము నడిమికి వెసఁ ద్రుంచె వెడఁదవాతి | దొడ్డ తూపునఁ గురుసేన దొంగలింప.
49
క. ఆ ధృష్టద్యుమ్నుఁడు స | క్రోధుండై బాణవితతి గురిసిన దృఢ సం
వేధం బగు నారస మ | య్యోధాగ్రణి యేసి నఱకె నుఱక యతండున్‌.
50
క. ఆచార్యుఁ దీవ్ర ఘన నా | రాచము లేయంగఁ ద్రుంచె గ్రక్కున; నవి వ
మ్మై చెడిపోయిన నార్చెం | జూచి భవద్బలముఁ బాండుసుతసైన్యంబున్‌.
51
వ. ద్రోణుండలిగి శరాసనంబు ద్రుంచిన . 52
ఆ. పార్షతుండు శక్తిఁ బరఁగింప నతఁడు ము | త్తునియఁ జేసె మఱియు ద్రుపదసుతుఁడు
పెక్కుశక్తు లొక్కపెట్ట వైచినఁ దును | మాడె రయము మెఱయ నగ్గురుండు.
53
తే. పృషతపౌత్రుండు గద వైవఁ బిడుగుఁ బోలె | నడరునెడఁ బొడిగాఁ జేసె నస్త్రగురుఁడు
భల్లముల గట్టి మైమఱు వెల్లఁ జించి | యతని నెత్తుటిలో ముంచె శితశరముల.
54
ఉ. ఒండొక చాప మెత్తికొని యుగ్రత నా పృషతాన్వయాగ్రగ
ణ్యుం డడరించు నారసము లుచ్చి చనంగ గురుండు గ్రొవ్విరుల్‌
నిండిన కింశుకంబు రమణీయతఁ జూడఁగ నొప్పి వాని వి
ల్వెండియు రెండు సేసి యవలీల హయంబుల సూతుఁ జంపినన్‌.
55
మ. విరథుండై పొలివోని బంటుతనమున్‌ వేగంబు నొప్పంగ బి
ట్టరదంబున్‌ డిగునప్డు చేతిగద నుగ్గైరాల నేసెన్‌ ధను
ర్గురుఁ డవ్వీరుఁడు వాలునుం బలుకయున్‌ ఘోరాకృతిం బుచ్చికొం
చు రయంబారఁ గడంగి బె ట్టడర సంక్షోభించె నీ సైన్యముల్‌.
56
క. గురుఁడను నురుతర గిరి ని | ష్ఠుర భంగిం బుట్టి వచ్చు సునిశితబాణో
త్కరచండవేగనదికి నె | దురు చన రాదయ్యె నపుడు ద్రుపదసుతునకున్‌.
57
క. గతి గుందియుఁ బైఁ దొరఁగెడు | శితశరములు పలక జడియఁజేయుచు ద్రుపద
క్షితిపతిసుతుండు మెఱయఁగ | నతిరయమున ననిలతనయుఁ డడ్డము సొచ్చెన్‌.
58
వ. ఇట్లు సొచ్చి వృకోదరుండు గురుం గ్రూరాస్త్రసప్తకంబున నొప్పించి పాంచాలపతిసుతు నొండొకయరదం బెక్కించుటయుఁ గనుంగొని నీకొడుకు కళింగపతికిం జేయి వీచి వాయుతనయుం దలపడ నియోగించిన నతండు మహాసైన్యసహాయత్వంబునం బేర్చి భీమసేనుపై నురవడించి నడచెఁ గుంభసంభవుండును విజృంభితుం డై విరాటద్రుపదులం దాఁకె ధర్మతనయుండు ధృష్టద్యుమ్నుం గలిసికొని వెన్నుదన్ని నిలిచెఁ జేదికరూశదేశంబులబలంబులు మహాబలనందను ముందటికి వచ్చె నట్టియెడ. 59
తే. అడరెఁ గాళింగనాయకుం డగు శ్రుతాయు | వునకుఁ దో డయి వీఁకమైఁ దననిషాద
సైన్యమును దాను భీముపై సరభసముగఁ | గేతుమంతుండు ఫణిరాజకేతుఁ డలర.
60
క. భీమునిముందటి బల ము | ద్దామతఁ గాళింగసేనఁ దలపడి హేతి
స్తోమావృత మై వ్రాలెను | భూమిపయిన్‌ సగముసగము పొలుపఱి విఱిగెన్‌.
61
ఆ. మదము మిగిలి కేతుమంతుఁడు గౌంతేయు | పైకిఁ గవిసి యతని బాణశిఖల
మ్రందిపోయెఁ గడఁగి మంటలో నుఱికిన | మిడుతవోలె మెలఁగ మిడుక లేక.
62
చ. పవనసుతుం గళింగనరపాలసుతుం డగు శక్రదేవుఁ డు
గ్రవిశిఖవృష్టిఁ దేల్చి తురగంబులఁ గూల్చినఁ గ్రోధదీప్తుఁ డై
యవిహతభంగి భూరిగద నాతఁడు వైచినఁ గూలె వాఁడు వ
జ్ర విహతిఁ గూలు శైల మన సారథికేతుయుతంబుగా నిలన్‌.
63
వ. ఇవ్విధంబున నద్భుతభయావహం బగు పరాక్రమంబునం బేర్చి భీమసేనుండు ఘటితకాంచన బిందు సందోహసుందరంబును దృఢవిశాలంబును నగు పలకయుం గల్పాంతకృతాంతజిహ్వాభీలం బగు కరవాలంబును బుచ్చికొని హతహయం బగు నరదంబు డిగ్గిన. 64
ఆ. కొడుకుపాటుఁ జూచి కోపించి కాళింగ | పతి రయమునఁ దేరు వఱపి భీముఁ
బొదివి పిడుగుఁ గొదమ వోని నారసము బి | ట్టేసె నది యతండు వేసెఁ దునియ.
65
క. మదమున శ్రుతాయు వొక్కటఁ | బదునాలుగు తోమరములు వరఁగించిన నే
ర్పొదవఁగఁ బవనజుఁ డన్నిటిఁ | జిదురుపలుగఁ జేసె ఖడ్గచిత్రనిహతులన్‌.
66
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )