| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అప్పు డా కళింగపతియనుజుం డగు భానుమంతుండు దంతి నికరంబుతో నగ్రజునకుం దలమిగిలి పవమాన సూనుపై నడరి నిజఘటలకుం దలకడచి యతనిమేన నారాచంబులు నాటించుచుఁ గదిసి తన యెక్కిన యేనుంగు నేపునం బురికొల్పిన. | 67 |
| శా. |
కుంతీసూనుఁడు సింహనాదమున దిక్కుల్ పిక్కటిల్లంగ దు ర్దాంతస్ఫారగతిం గరిం గదిసి రౌద్రస్ఫూర్తి లంఘించి త ద్దంతంబుల్ వెస నెక్కి త్రొక్కి తునిమెన్ ధారాళరక్తచ్ఛటా క్రాంతంబై నభమొప్ప వానిఁ బటుఖడ్గస్ఫారధారాహతిన్. |
68 |
| వ. | ఇట్లు భానుమంతు నంతకుపురికిం బనిచి. | 69 |
| తే. |
మలఁగి గజకంధరము ద్రుంచి తొలఁగ నుఱికి | కెంపు దళుకొత్త వాలుతోఁ గ్రేళ్ళువాఱు నా వృకోదరుపైఁ గవియంగఁ జేయి | వీచె సేనకుఁ గాళింగవిభుఁడు గడఁగి. |
70 |
| వ. | ఇట్లు శ్రుతాయువు సేయి వీచినఁ దచ్చతురంగంబులు వొదివినం బవనతనయుండు నిజభుజశిఖరంబులు వెఱుగం దాను బాదచారి యగుటయు నొంటియైన తెఱంగునుం దలంపని దర్పంబునం బేర్చి రణక్రీడకుం జొచ్చి కరవాలంబు శుండాలకుంభస్థలంబులు పగుల వ్రేసిన మెదడంటి మొదుక నైనం గేతుదండంబులు నఱికి, చులుకం జేయుచు రథికసారథి సహితంబుగా నరదంబులు చక్కడంచి, మొక్కలు వోయిన నస్థి సారంబులగు నశ్వశరీరంబులు గోసి, పాఱవైచి, వాఁడి సేయుచు నుబ్బున గుఱ్ఱంబుల కుఱికి బడలుపడ నఱిముఱి విసరిన నోర వోయిన సురియం జెరివి, యవలీలం గాలుబలంబులపైఁ బడి చక్కంజేయుచు మఱియు నానాప్రకారంబులగు చిత్రవధవిహారంబుల నమ్మోహరంబు విఘటితవిభ్రాంతపలాయితంబు గావించి యపరాహ్ణంబునం గళింగపతిం గవియు నవసరంబున. | 71 |
| తే. |
వివిధ సన్నాహయుతముగాఁ బవనతనయు | తేరు దగురథ్యములఁ బూన్చి తెచ్చి సూతుఁ డతనిముందట నిలిపిన నతఁడు వాని | నాదరంబునఁ గనుగొని యరదమెక్కె . |
72 |
| ఉ. |
చాపము వేడ్కఁ బుచ్చికొని సజ్యము సేయునెడం గళింగుఁ డ ష్టాపద దీప్తపుంఖనవశాతశరంబులు నాట నేసినం గోపితుఁడై కడంగి బరిగోలలపోటుల నుగ్రవారణా టోపము పేర్చునట్లుగఁ గడున్ వెస డగ్గఱి భీముఁ డుద్ధతిన్. |
73 |
| ఆ. |
అయిదు నారసముల నాతనిఁ జదికిలఁ | బడఁగ నేసి మూర్ఛపాలు సేసి యతని చక్రరక్షు లైన సత్యుని సత్య | దేవుఁ జంపి నభము దివుర నార్చె. |
74 |
| వ. | అట్లు శ్రుతాయువు మూర్ఛిల్లినం దదీయ సారథి రథంబు దొలంగం దోలికొనిపోయినఁ గర్ణధారుండు లేని యానపాత్రంబునుం బోలెఁ దద్బలంబు దిరుగుడు వడియె నప్పుడు కిమ్మీరవైరి శంఖంబు పూరించిన. | 75 |
| క. |
విని గాంగేయుం డడరినఁ | గని ధృష్టద్యుమ్నుఁడును శిఖండియు నరిభం జనుఁ డగు సాత్యకియు మరు త్తనయుఁ | గడచి యతనిఁ దాఁకి దర్ప మెలర్పన్. |
76 |
| తే. |
బెడిదముగ నేయ రథములపిండు మఱియుఁ | గవిసి తోడ్పడ నతఁడు శిఖండి యొకడు దక్క నందఱ తనువులఁ బెక్కు నిశిత | విశిఖములు నాటి బకరిపు వెగడుపఱిచి . |
77 |
| వ. | అతని యరదంబు గుఱ్ఱంబులం గూల నేసిన నతండు కోపించి. | 78 |
| క. |
ఘనశక్తి వైవ నది శాం | తనవుఁడు ముత్తునియ సేయ దానం గోపం బినుమడిగా నుజ్జ్వలగదఁ | గొని యరదము డిగ్గి కవిసె ఘోరాకృతియై. |
79 |
| క. |
తదవసరంబున సాత్యకి | మదమునఁ గౌంతేయుఁ గడచి మంత్రంబున బె ట్టిదముగఁ బడవైచిన యొ | ప్పిదమున నస్త్రమునఁ గూల్చె భీష్ముని సూతున్. |
80 |
| వ. | ఇట్లు సారథి వడుటయు. | 81 |
| తే. |
వాయువేగంబు లైన తద్వాహనములు | భీష్ముతే రెత్తికొని పాఱెఁ బృథివి యద్రువ నపుడు మనసైనికులు గీచకారి నెదుర | నలికి పాసిన బయలయ్యె నతని మునుము. |
82 |
| వ. | అట్టియెడ ధృష్టద్యుమ్నుండు గారవంబున నమ్మారుతిం దనరథం బెక్కించుకొనియె నంతఁ గృష్ణానుజుండు దన తేరు సేరం దెచ్చి యా వృకోదరు నుపలక్షించి. | 83 |
| ఆ. |
‘ఒంటిమైఁ గళింగు నురవడిఁ దలపడి | పుత్రసోదరాప్త భూరిసైన్య హీనుఁ జేసి కౌరవానీకములు సూడ | నుఱక భంగపెట్టి పఱపు టొప్పె.’ |
84 |
| వ. | అని యగ్గించె నంతఁ గడంగి వచ్చు శల్యకృపాశ్వత్థామలం గని పార్షతుండు దనయరదంబున నున్న భీమసేనుని సవినయంబుగా డించి ‘నీవు నన్ను వెన్ను దన్ని చూడు’ మని పలికి యద్దెసం దేరు వఱపి యశ్వత్థామరథ్యంబులం బదిబాణంబులం బడ నేసిన నతండు శల్యుని రథంబుపైకిం బోయి పాంచాలపతి సూనుమేన నిశితాస్త్రంబులు నినిచెఁ దక్కటి యిరువురు నట్ల చేసి రివ్విధంబున నమ్మువ్వురచేత నతం డొక్కరుండును బొదువం బడియుంట దవ్వులంజూచి విజయనందనుండు నిజ స్యందనంబు దోలికొని వచ్చి కృపాశ్వత్థామలం దొమ్మిదేసి యమ్ముల నొప్పించి మద్రపతి యంగమునఁ బంచవింశతి విశిఖంబులు నాటించె వారును నతనిఁ బండ్రెండు శరంబు లేసి రా సమయంబున భవదీయపౌత్త్రుం డగులక్ష్మ ణకుమారుం డయ్యభిమన్యుం దలపడి మర్మభేదులయిన నారాచమ్ముల నొప్పించిన నతం డక్కుమారుఁ బంచాశత్సాయకంబులం గప్పి తన హస్తలాఘవంబు ప్రకటించిన. | 85 |
| తే. |
లస్తకంబున కొలఁదికి లక్ష్మ ణుండు | వెడఁదయమ్మున నభిమన్యువిల్లు దునియ నేసి యార్చినఁ గౌరవు లెల్ల నార్వ | నతఁడు వేఱొకబలువింట నతని నొంచె. |
86 |
| క. |
తనయుఁడు నొచ్చిన దుర్యో | ధనుఁ డర్జునతనయుమీఁదఁ దనతే రలుకం జన నిచ్చుట గనుఁగొని శాం | తనవద్రోణముఖ రథికతతి వెసఁ గవిసెన్. |
87 |
| క. |
అఱిముఱి నడరిన రథికుల | తఱచునకు సుభద్ర కొడుకు దలఁకక తా నం దఱ కన్నిరూపులై యే | డ్తెఱ నవ్వుచు నేటులాడె ధీరత మెఱయన్. |
88 |
| వ. | తదవసరంబున. | 89 |
| మ. |
కని తే రుప్పరవీదిఁ దోలుకొని యాకౌరవ్యసైన్యంబు న జ్జననాథుం దటినీతనూజు గురుఁ జంచద్బాణ వర్షంబులన్ మునుఁగం జేయుచు దేవదత్త మెలమిన్ మ్రోయించుచున్ సంగరా వని యల్లాడ వియచ్చరుల్ వొగడ వివ్వచ్చుండు వచ్చెన్ వడిన్. |
90 |
| వ. | అంతయుఁ గనుంగొని యుధిష్ఠిరుండు గడంగి సేనల కెల్లను జేయివీచిన నొక్కపెట్ట యురవడించి కురుసైన్యంబు దలంకం దలపడియె నప్పు డాదిత్యుం గప్పి ధరణీరేణువులు చీఁకట్లు గవియింపం గరితురగనరగాత్ర గళితరుధిరధారాసారం బది యడంగునట్లు సేసె నంత నర్జును వివిధ బాణపాతంబులఁ గౌరవానీకంబునం దునియ లైన శరాసనశరకరవాలపరిఘపరశ్వధాదులును బఱియ లయిన హరిశిరః కుంభికుంభపదాతి కపాలప్రభృతులును దుమురు లైన రథాంగధ్వజచ్ఛత్త్రచామర ప్రముఖంబులుం గలిగి కయ్యంపునేల కరంబు ఘోరం బయ్యె నట్టియెడఁ దమమీఁది మానుసులు వడినం జెడి తిరిగెడు హయగజస్యందనంబులును దురంగమాతంగస్యందనంబులు రూపఱిన నేపఱి మెలంగునయ్యై యారోహకులును నై యాకులతం బొంది మనబలంబు దెరలి మరల వెఱచఱచి కనుకనిం బఱచినం గృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తంబులు పూరించిన మందాకినీనందనుండు గుంభసంభవున కిట్లనియె. | 91 |
| తే. |
‘కృష్ణసారథ్యమున నొప్పుక్రీడి యిపుడు | కౌరవానీకముల నెల్లఁ గసిమసంగి కృష్ణసారథ్యమున నొప్పుక్రీడి యైన | నెట్లు సేయంగవలయుఁ దానట్లు సేసె. |
92 |
| క. |
విను మలుక వొడమి మిక్కిలి | కనుదెఱచిన త్రిపురవైరి కైవడి యీ య ర్జునునందుఁ దోఁచుచున్నది | మనమొనలున్ వశముగావు మరలుపు మింకన్. |
93 |
| వ. | పోక నిలిచిన బలు మానుసులుం బెద్దయు డస్సి యోహటించినయట్లున్నవారు వారిజ మిత్త్రుండు నపరగిరిశిఖరంబునకుం జేరె’ నేఁటికిఁ గయ్యంబు సాలింత మని చెప్పి యతం డియ్కకొన నెల్లవారలం దివియ నియమించి నడపించె నప్పుడు పాండవులు పాంచాల మాత్స్యాది పరివార సహితంబుగా నార్పులు సెలంగి నింగి ముట్ట మరలి రిట్లు రెండవనాఁటి సంధ్యాసమయంబున రెండుదెఱంగులవారును దమతమ శిబిరంబులకుం జనిరి; మఱునాఁడు. | 94 |