| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
‘అనిన విని యర్జునుం డి | ట్లను ‘నీ విం తనఁగ నేల? యాతనిమీఁదన్ మనరథముఁ బఱపు మిప్పుడ | సునిశితబాణముల నతని సొం పడఁగింతున్.’ |
139 |
| చ. |
అనుటయు ‘నట్లకాక’ యని యచ్యుతుఁ డుద్ధతిఁ దేరు వోవని చ్చినఁ గని పొంగి యా రథికసింహుఁ డుదంచితసింహనాదుఁడై నినిచెఁ దురంగదేహముల నీరజనాభునిమేనఁ బాండునం దను నొడలం బ్రదీప్త ఘనదారుణమార్గణపుంజముల్ వడిన్. |
140 |
| తే. |
తనదు నొవ్వున కలుకక ధైర్యవృత్తి | నయ్యుపేంద్రుండు నొచ్చిన హయచయంబుఁ దడవి తేర్పి యుదగ్రతఁ దఱుముటయును | గుణరవం బుల్లసిల్ల ఫల్గునుఁడు గడఁగి. |
141 |
| క. |
భల్లంబొకటఁ బితామహు | విల్లు దునుమ వేఱొకండు వెస నెత్తిన న వ్విల్లును దునిమినలాఘవ | ముల్లంబునఁ బొగడి యేసె నొండొకవింటన్. |
142 |
| తే. |
ఇట్లు గాంగేయుఁ డేయుననేక విశిఖ | వితతి యసురారి రథచిత్రగతుల దప్పి పోవఁ జేయంగ నతఁ డంతఁ బోక నొంచె | నరుని నారాయణుని బలునారసముల. |
143 |
| క. |
నొచ్చియు భీష్మునిపై వి | వ్వచ్చుఁడు బెడిదముగఁ గురిసె వాలమ్ము లతం డచ్చెరువుతోడ వెసఁ గా | ర్చిచ్చు గవిసినట్లు పొదివె శితవిశిఖములన్. |
144 |
| వ. | అంత నపరాహ్ణం బయ్యె నట్టియెడ. | 145 |
| క. |
హరి దాను నొచ్చి నొచ్చిన | నరునితెఱం గెఱిఁగి భీష్మునకు నించుకయుం గరలాఘవ మెడలమియుం | దిర మై పరికించి తనమదిం దలపోయున్. |
146 |
| ఉ. |
‘పాండవసైన్యముల్ గలఁగి పాఱెడు సిగ్గఱి వీరిలోన నొ క్కండును భీష్ముమార్కొని మగంటిమి సూపఁగ లేఁడ యింద్ర పు త్త్రుండును జాల నొవ్వడరి తూఁగెడు నిట్టిద యైన నేఁడ తీ ర్పండె? యితండు కౌరవనృపాలుసమస్తమనోరథంబులున్ |
147 |
| క. |
యాదవకేకయ పాంచా | లాదులు వాఱుటలు సూచి యస మెక్కి జయో న్మాదంబునఁ గురుసైన్యము | లే దిక్కునఁ దామ యగుచు నేడ్తెఱఁ బొదివెన్. |
148 |
| వ. | ఇప్పు డే నూరకున్నం బోవ దీ దేవవ్రతుం జంపి ధర్మతనయు గెలిపింపవలయు’ నని యిట్లు దలపోయునెడ మఱియు మందాకినీనందనుండు బెట్టిదమ్ములగు నారసమ్ములు గురియం దేఁకువ సెడి క్రీడి యున్నంగని కృప కృతవర్మాశ్వత్థామలును భూరిశ్రవస్సైంధవ వికర్ణులును నొక్క మొగంబై రథమ్ముల మొత్తమ్ములతోడం గడంగి వచ్చి కవ్వడిపయిం బడి రాసమయంబున సాత్యకి సామజఘటలతో నురవడించి యిరుగెలంకుల యోధుల నాలోకించి. | 149 |
| క. |
‘మఱతురె? యాడిన మాటలు | పిఱుసనిపోఁ దగునె? మీకు బెదరక యెదురై తఱుముఁడు భీష్ముని గీష్ముని | నెఱుఁగరె? ము న్నేను గలుగ నేలా వెఱవన్?’ |
150 |
| వ. | అనుచు నేచి యెదిరిన బలంబుల నిలునిలుమని యదల్చుచు నర్జును తేరికిం దలకడచి వచ్చునతనికి దనుజాంతకుండిట్లనియె: | 151 |
| క. |
‘తిరిగినపందల నేటికిఁ | బురికొల్పఁగనున్నవారు వోదురు గా; కేఁ గురుపతి జయంబు గొని యి | ద్ధరయేలం జూడ నేర్చెదనె? విను నన్నున్. |
152 |
| శా. |
గంగానందనుఁ గూల్చి ద్రోణుపని సక్కంజేసి కౌరవ్య వీ రాంగమ్ముల్ నుఱుమాడి తత్ప్రబలసైన్యం బెల్ల మాయించి యి త్తుం గౌంతేయుల కిమ్మహీవలయమున్ దుర్దాంతచంచద్భుజా సంగస్ఫూర్జితచక్రవిక్రమకళాసంక్రీడనోన్మాది నై.’ |
153 |