| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అని పలికి సుదర్శనంబుం దలంచినం దత్‌క్షణంబ యది సన్నిహితం బగుటయుం బద్మనాభుండు సునాభంబగు నా చక్రంబు గైకొని దక్షిణకరంబున నమర్చి పేర్చి యుగ్యంబుల పగ్గంబులు నొగల ముడిచి యరదంబు డిగ్గ నుఱికి. | 154 |
| తే. |
అవని గంపింప లలిత పీతాంబరంబు | చెఱఁగు దూలఁ జక్రాంశులు దుఱఁగలింప సింహనాదంబు క్రోధరంజితభయంక | రాననంబునఁ జెలఁగంగ నడరుఁ బెలుచ. |
155 |
| శా. |
అంహోమర్దనుఁ డాజనార్దనుఁడు మాద్యద్భీష్మకుంభీంద్రుపై సింహోల్లాసవిలాసి యై కవియు నుత్సేకంబు నాటోపమున్ రంహఃస్ఫూర్తియు దీప్తమూర్తియును సంరంభంబుఁ జూడన్ జగ త్సంహారోన్ముఖుఁ డైన రుద్రుగతి రౌద్రప్రక్రియం బొల్చినన్. |
156 |
| చ. |
పులిఁ బొడగన్న లేళ్ళగమివోలె సుయోధను నగ్రసైనికుల్ దలఁకి కలంగి నివ్వెఱఁగు దక్కినఁ జేష్టలు దక్కి చిత్రరూ పులక్రియ నుండి రక్కురువిభుండును మాఱు దలంపలేని కొం దలమునఁ బొందుడెందమునఁ దానును రూపఱియుండె వెల్ల నై. |
157 |
| ఉ. |
అప్పుడు భీష్ముఁ డెంతయుఁ బ్రియంబున నిట్లను సంభ్రమంబు లే కప్పరమేశుతో నిటు కృతార్థునిఁ జేయుదెఁ నీవు వచ్చి న న్నిప్పుడు నీకుఁ బోలినటు లెల్లను జేయుదు గాని వేగ ర మ్మొప్పదె నాకు నిట్టి తెఱఁ గుజ్జ్వలఫుల్లసరోజలోచనా?’ |
158 |
| వ. | అను నట్టియెడ నర్జునుండు రయంబున రథంబు డిగ్గనుఱికి పఱచి పురుషోత్తము పిఱిందిదెసం గ్రుచ్చి పట్టిన నతండు దీర్ఘబాహుం డగునతని నాయతశాఖం బగువిపులశాఖిం గొనిపోవు మహావాతంబునుం బోలెఁ గొనిపోవ నాతండు పదియడుగులకొలఁది నిలాతలంబు చిక్కం ద్రొక్కి యీడిగిలంబడి నిలువం బట్టి యి ట్లనియె. | 159 |
| ఉ. |
కోపము సంహరింపు యదుకుంజర! పాండవకోటి కెల్లనుం దేపవు గావె నీ విటు లధీరతఁ బూనికి దప్పినం బ్రతి జ్ఞాపరుఁడైన ధర్మసుతు శౌర్యము ధైర్యము బాహువీర్యమున్ రూపఱిపోక కాదె యనురూపమె నీకిది లోకనాయకా! |
160 |
| చ. |
ఇటు దగునయ్య? కృష్ణ! శమియింపుము సాత్యకిఁ జంపినాఁడ విం కట చనితేని నీదగు సహాయతఁ గౌరవసేన రూపు మా పుట యవలీల నాకు ననుఁ బొల్లుగఁ జేయుట నీకుఁ బాడియే? కటకట! నా పరాక్రమము గాసిగ చక్రము చేతనంటితే! |
161 |
| వ. | అనిన సవ్యసాచి సమయనిష్ఠకు శౌరి సంతోషించి రోషం బుడిపికొని యతనికిం బ్రియంబుగా మగిడి నొగలపైకి వచ్చి దిక్కులు పిక్కటిల్లఁ బాంచజన్యంబు పూరింప నాధనంజయుండును దేవదత్తం బొత్తి గాండీవ గుణ చండనిస్వనం బొండొండ నిగిడించుటయుం గౌరవబలంబులు భేరీమృదంగాదితూర్యనాదంబులు సెలంగ మార్కొని కడంగిన. | 162 |
| క. |
అగ్గలిక దూది దరికొను | నగ్గి తెఱం గమర నప్పుడర్జునుఁడు గడున్ డగ్గఱి మెఱుంగుటమ్ముల | మ్రగ్గించె వియచ్చరోత్కరం బగ్గింపన్. |
163 |
| వ. | ఆ సేనకుం దలకడచి భీష్మ భూరిశ్రవశ్శల్యదుర్యోధను లడరి యర్జునుపై శక్తిగదాసప్తనారాచతోమరంబులు ప్రయోగించిన నతండు శక్తియు గదయును దోమరంబును నొక్కొక్కభల్లంబునను నేడునారాచంబు లేడింటను దునిమి పేర్చి యైంద్రాస్త్రంబు ప్రయోగించిన నది నానా ప్రకారక్రూరశరకలాపరూపంబునం గవిసి కౌరవ సైన్యంబు నొప్పింపమఱియును దాను మందాకినీనందను నిశిత నారాచజాలంబునం బొదివి భూరి శ్రవసుని చాపంబు ద్రుంచి తొమ్మిదివాలమ్ములు శల్యుమేనం గీలించి కురుపతి వక్షంబు వెడందవాతి యమ్మున ఛేదించె నప్పుడు పాంచాలపతివిరాటప్రముఖులగు జోదులు గోలుతల సేసిరి మన బలంబులు గాండీవ గుణనిష్ఠుర నినదంబునం జేడ్పడి యొల్లంబోయి వెల్ల నయి యుండ భవదీయ సుతులు శౌర్యోద్రేకంబున నాకేశనందను నరదంబుఁ బొదివి రట్టి సంకులసమరంబున మహేంద్రబాణంబుచేత మనదిక్కున. | 164 |
| ఆ. |
కెడసె హయము లొడ్డగెడ వయ్యె రథములు | చాఁపకట్టు వడియె సామజములు చదిసెఁ గాలుబలము చామరచ్ఛత్రకే | తువులు నాయుధములుఁ దునియలయ్యె. |
165 |
| వ. | అప్పు డర్జునుండు కేశకలాపంబు శైవాలంబును బ్రేవుల ప్రోవులు ఫేనపుంజంబులును మేదోమాంసమస్తిష్క పటలంబు పంకంబును నగురక్త నదీ ప్రవాహంబు భవదీయ సేనామధ్యంబునం బఱపి బేతాళక్రవ్యాది భూతంబుల నోలలార్చె నతండు దేవదత్తంబును దామోదరుండు పాంచజన్యంబును బూరించి సింహనాదంబులు సేసి రంత నరుణగభస్తి యస్తగిరి మస్తకాంతరితుం డయ్యె నాసంధ్యాసమయంబున నిజసైన్యంబు నొవ్వునుం గవ్వడి దివ్యబాణజాలంబుల దుర్నివారత్వంబును విచారించి భీష్మద్రోణబాహ్లికదుర్యోధనులు బలంబులఁ దివియం బంచి మరలి కరదీపికలు వెలుంగ విడిదలకు వచ్చిరి పాండవులును గృష్ణసహితంబుగా నుబ్బునం బొంగుచు వందిజనకీర్తనంబులు సెలంగ మగిడి శిబిరంబునకుంజని రమ్మూఁడవనాఁటి రాత్రి గురుపతివీటి జనంబులు గిరీటి పరాక్రమప్రకారంబులం దమదెస నానాదేశంబులచతురంగంబులు వొలిసినపెల్లును నంతంతం గుములుగట్టి చెప్పికొనుచుండ. | 166 |