పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము
భీష్ముని చతుర్థ దివస యుద్ధము (సం. 6-56-1)
క. వేగుటయు సత్వరంబుగ | నా గాంగేయుండు మించి యనికి నడచినన్‌
సాగరతరంగములగతి | వేగమ తరతరమ మొనలు వెడలఁ దొడంగెన్‌.
167
క. అతిరయమున గురుఁడు భవ | త్సుతుఁడును బాహ్లికుఁడు నెయిది తోడ్తో బలసం
తతి గూడికొనఁగఁ బటుబృం | హితహేషానేమి రవము లెసఁగెం దఱచై.
168
క. కారుకొని మేఘమాలా | కారంబునఁ జాల నొప్పెఁ గౌరవసైన్యం
బారూఢవీరరసవి | స్ఫారం బై యంతఁ దోఁచెఁ బాండవ బలమున్‌.
169
క. కురుసేనఁ జూచి యప్పుడు | నర నారాయణులు దమ మొనకు మిగిలి సము
ద్ధురలీల సూర్య చంద్ర | స్ఫురణము లొక్కెడన మెఱయుపోలిక నమరన్‌.
170
క. వెలిఁగిరి; బలములు దూర్యం | బులు నార్పులుఁ జెలఁగ రెండుఁ బురికొని చతురం
గలసద్గతు లొప్పఁగ వడిఁ | దలపడియెం గైదువులు నదరు లెగయంగన్‌.
171
వ. ఇట్లు దాఁకి తోమరప్రాసప్రముఖంబులం డొల్లవైచుచుఁ గుంతక్షురికాదులఁ గూలం బొడుచుచుం గరవాల పరశ్వథ ప్రభృతులం దునియవ్రేయుచు గదాముసలముద్గరంబులఁ జదియ మోఁదుచు నఖర ప్రాసంబులం బగులవ్రచ్చుచు. 172
క. పురికొనుచుం దెరలుచు నో | హరిసాహరి నొక్కచోట నలవడు నొకచో
విరియు నొకచోటఁ దిరుగుం | దిరుగక యొకచోట రెండుదెఱఁగులు నొచ్చున్‌.
173
క. పలుచోటులఁ బలుభంగులఁ | బలుమొన లిమ్మాడ్కిఁ బోరఁ బార్థునిపై న
గ్గలిక నడరెఁ దాటిసిడము | తలతల మని మెఱయఁ గురుపితామహుఁ డధిపా!
174
క. పతియును ద్రోణుండు వివిం | శతియుం గృపసోమదత్తశల్యులు గంగా
సుతుతోడఁ గడఁగి రర్జున | సుతుఁ డయ్యేడ్వురను దాఁకె సురలు నుతింపన్‌.
175
క. వారల శరనిచయము దు | ర్వార విశిఖపంక్తిఁ దునిమి వాసవపౌత్రుం
డారూఢతేజుఁడై వెలుఁ | గారెను హుతవహ్ని క్రియ రణాంగణవేదిన్‌.
176
తే. భీష్ముఁ డభిమన్యుఁ గడచి యాభీలబాణ | జాలములు దీవ్రతరముగ సవ్యసాచి
మీఁదఁ గురియంగ నాతఁ డమేయభల్ల | తతుల నన్నింటిఁ దునుమాడెఁ దరతరంబ.
177
వ. ఇట్లు దొడంగి యుద్భటప్రకారంబునఁ బెల్లు సెల్లు భీష్మార్జునులకయ్యం బయ్యిరువాఁగును గొండొకసేపు నివ్వెఱపడి చూచుచుండె నశ్వత్థామభూరిశ్రవశ్శల్యపుత్రచిత్ర సేనులు మత్తమాతంగంబులు సింగంబు కొదమం బొదువుపోలిక నభిమన్యుం బొదివిన నతండు. 178
క. కని యల్లన నవ్వుచు గురు | తనయుని యుర మేసి శల్యతనయుని సిడముం
దునిమి వెస నీదుతనయుని | ధనువు నఱకి సోమదత్తతనయుని నొంచెన్‌.
179
క. వారును ముందటి యార్వురు | నీరసమున నొక్కపెట్ట యేయఁగఁ బటుదో
స్సారుండగు సౌభద్రుఁ డు | దార స్ఫురణమున నద్భుతంబుగఁ బోరెన్‌.
180
ఆ. హస్తలాఘవమున నతులబలంబున | శౌర్య మహిమ నధికధైర్యమునను
సవ్యసాచితనయు సరి గార యమ్మహా | వీరు లంతవట్టుఁ గౌరవేంద్ర!
181
వ. ఇట్లు పెక్కండ్రతోడం బెనంగుపుత్రుం గనుంగొని యర్జునుం డంట నార్చి యడరి యందఱ కన్నిరూపులై నొప్పించి చిక్కువఱిచె నప్పుడు నీ కొడుకు పంపునం ద్రిగర్తులుఁ గృతవర్మయుఁ గేకయులును ముప్పదేనువేల రథంబులవారునుఁ గవిసి కిరీటిం గొడుకునుం బొదివి రట్టియెడ. 182
మ. తఱికిం జొచ్చి కడంగి పోరు విజయున్‌ దౌదవ్వులం జూచి యే
డ్తెఱఁ బాంచాలసుతుండు సత్వరగతిం దే రద్దెసన్‌ సారథిం
బఱపం బంచి నిశాతబాణపటలీపాతంబునన్‌ వైరు లు
క్కఱఁ దాఁకెం దమసైన్యముల్‌ సెలఁగ శౌర్యస్ఫూర్తి శోభిల్లఁగన్‌.
183
వ. ఇట్లు ధృష్టద్యుమ్నుండు పురందరనందనునకుం దలకడచి తాఁకి. 184
క. శరములు మూఁటం గృపుఁ బది | శరముల మద్రేశు నొంచి శరమొక్కట ను
ద్ధురగతి యగు కృతవర్ముని | యరదముఁ దురగముల నొకట నవనిం గూల్చెన్‌.
185
వ. అప్పుడు శల్యనందనుండు. 186
క. పదిటన్‌ ధృష్టద్యుమ్నునిఁ | బదియమ్ముల నతని సూతుఁ బటురయమున ను
న్మదుఁడై నొప్పించినఁ గెం | పొదవిన మో మలఁతి నవ్వు నొప్పున నొప్పెన్‌.
187
క. ఆ పృషతపౌత్రుఁ డుద్ధత | కోపానలుఁ డగుచు శల్యుకొడుకుధనువు నా
టోపమునఁ దునిమి ఫణిరా | జోపమితాస్త్రంబు లతనియొడలం జొనిపెన్‌.
188
వ. ఇవ్విధంబున. 189
క. నోనేసి సూతు హయసం | తానముఁ జంపుటయు శల్యతనయుఁడు విరథుం
డై నిరుపమాన మగు తన | మానమ వాహనము గాఁగ మద మెలరారన్‌.
190
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )