పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము
భీష్ముని పంచమదివసయుద్ధక్రమము (సం. 6-65-1)
క. వేగినఁ గౌరవసేనలు | వేగమ కైసేసి యనికి వెడలెం దీవ్రో
ద్యోగత భీష్ముని మున్నిడి | సాగరములు మేరదప్పుచందం బొందన్‌.
274
వ. ఇట్లు వెడలి మకరవ్యూహం బమర్చుకొని నిలిచె నంతఁ బాండవులును శ్యేనవ్యూహంబుగా మోహరించి రందు ముఖంబున భీమసేనుండును నయనంబుల ధృష్టద్యుమ్న శిఖండులును శిరంబున సాత్యకియును గంఠంబునం గిరీటియు వామపక్షంబున విరాటద్రుపదులును దక్షిణపక్షంబునఁ గేకయులును వీఁపున నభిమన్యు ద్రౌపదేయులును బుచ్ఛంబున నకులసహదేవసహితుం డయి యుధిష్ఠిరుండును నిలిచి రివ్విధంబున సన్నద్ధంబు లయిన యుభయవ్యూహంబులు మేదురతూర్యనినాదంబులు రోదసీకుహరంబు నిండ నొండొంటిం గదిసిన. 275
క. మకరవ్యూహం బనియెడు | మకరాలయ మపుడు దర్పమహిమోజ్జ్వలుఁడై
మకరక్రీడం జండత | మకరాభీలముగఁ జొచ్చె మారుతి యధిపా!
276
ఉ. చొచ్చి పితామహుంగని యిషుప్రచయంబునఁ గప్పె నాతఁడుం
జిచ్చున నేయి వోసినవిశేషము దోఁపఁగ భీము నొంచి ము
చ్చిచ్చున నేర్చునట్టులుగఁ జేసెఁ దదూర్జితసేన నంత వి
వ్వచ్చుఁడు వచ్చి దివ్యశరవర్గనిరర్గళవిక్రమంబునన్‌.
277
క. భీష్ముని గర్వం బుడిపి మ | హోష్మలుఁడై కౌరవేంద్రుయోధుల కెల్లన్‌
గ్రీష్మాదిత్యుని క్రియ న | ర్చిష్మత్త్వము సూపి యడరె సేనలు దెరలన్‌.
278
వ. అట్టియెడ నీకొడుకు గురునిం గదిసి యతని కి ట్లనియె. 279
తే. ‘పట్టి పాలార్చెదరు మీరు పాండుసుతుల | నీవు భీష్ముండు నలిగిన దేవతలకు
నైన మార్కొనవచ్చునే? సేన నరుఁడు | నొంపఁగా నిట్టు లొప్పరికింపఁ దగునె?’
280
వ. అనిన విని కుంభసంభవుండు గటకటం బడి యతనితో ని ట్లనియె. 281
తే. ‘ఎన్నఁడును మున్నువారలయేపు నోపఁ | గానమెట్లు సముద్రంబులోన బుఱ్ఱ
వైవఁ గొన్నంత గొనుఁగాక వారిగెల్వ | మాకు శక్యంబె చవిగాని మాటలేల?’
282
క. అనుచు మొన గడచి నడచినఁ | గని పాండుతనూజు సైనికవ్రాతంబుల్‌
గనుకని విచ్చిన సాత్యకి | యనిలజవం బెసఁగఁ దాఁకె నస్త్రాచార్యున్‌.
283
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )