| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
తాఁకి యుజ్జ్వల బాణతతి గవియించిన నవ్వుచు బెడిదంపు నారసములు గురుఁడు శైనేయుపైఁ గురిసిన నొచ్చియుఁ దెరలక యాతండు తీవ్రభంగిఁ బెనఁగంగఁ జూచి పావని యేచి గురునిపై నిశితాస్త్రసంతతి నించి నొంచె నంత శల్యుండును శాంతనవుండును నతనికిఁ దోడ్పడి యడరి భీము |
|
| ఆ. |
నేయఁ దొడఁగుటయును నేడ్తెఱ ద్రౌపదే | యులును దానుఁ గవిసి యుగ్రలీలఁ బటురయంబుమై సుభద్రాసుతుండు దు | ర్వార విశిఖతతుల వారిఁ బొదివె. |
284 |
| చ. |
కడువడితోడ నప్పుడు శిఖండి ధనుర్గుణ నిస్వనంబు పె ల్లడరఁగ బాణజాలము వియత్తటిఁ గప్పఁగ నీదు సైన్యముల్ సుడివడ భీష్ముఁ దాఁకుటయుఁ జూచి మనంబున నాఁటదానితోఁ బొడుతునె? యంచు మార్కొనక పోయెఁ దొలంగి యతండు భూవరా! |
285 |
| క. |
కనుఁగొని కురుపతి యాచా | ర్యునిఁ బురికొలుపుటయు నాతఁ డుద్దామగతిం జని కడిమి మెఱయ నుజ్జ్వల | ఘనమార్గణపుంజముల శిఖండిఁ దెరల్చెన్. |
286 |
| క. |
అమ్మెయిఁ గౌరవులును ద | ర్ప మ్మలరఁగఁ జెలఁగుటయును బాండవబలముల్ సమ్ముఖమునఁ దలఁపడినను | సమ్మర్దం బుగ్ర మయ్యె సంగ్రామమునన్. |
287 |
| క. |
ధూళుల మేఘంబులుఁ గర | వాలాదినిశాతహేతివర్గాంశుతటి న్మాలయు గుణరవగర్జలుఁ | గీలాలపువృష్టికిం దగియె నట్టియెడన్. |
288 |
| క. |
ప్రోవులు గట్టిన గుఱ్ఱపుఁ | బ్రేవులు నేనుఁగుల తఱచుఁబీనుంగులు ర క్తావిలత వెల్లచీరలుఁ | గావులు నై భటనికాయకాయంబులునై. |
289 |
| క. |
సమరాంగణంబు కడుఘో | రముగా నిరువాఁగుఁ బోరురభసంబున ది క్సమితి వడఁకాడెఁ బొగడెడు | నమరులయులి వడరెఁ జదల నతినిబిడముగాన్. |
290 |
| క. |
అనిలజభీష్ములు దమతమ | మొనలకుఁ గన్నాకు లగుచు మునుకొని వడి న ర్జునకుంభసంభవుల ప్రా | పునఁ జూపిరి విక్రమంబు భూరిబలంబున్. |
291 |
| క. |
భీమునిదెసఁ గాళింగో | ద్దామగజానీక సంగతత్వస్ఫురణా భీమగతిం దఱిమెం గురు | భూమీశుఁడు భీష్మగురులు పోరెడు బలిమిన్. |
292 |
| చ. |
అఱిముఱి నీ కుమారవరు ల | త్తఱి నందఱు నాబకారిపై నుఱక రథంబులం బఱప నుజ్జ్వలశైలము మేఘబృందముల్ గిఱికొనఁ గప్పిన ట్లయినఁ గ్రీడి గుణస్వన ముల్లసిల్ల నే డ్తెఱ విశిఖప్రతాప మనుతీవ్రసమీరము నేపు సూపినన్. |
293 |
| క. |
ఆరథనివహంబులు న | వ్వారణములుఁ దెరలి మరలి వడిఁ బఱచుటయుం గౌరవబల మెల్లను రణ | శూరుఁడు గాంగేయుమఱువు సొచ్చె వికలమై. |
294 |
| వ. | ఇట్లు సేన మొగతిరిగినం గని సుయోధనుండు బరవసంబునం బురికొల్పి చేయి వీచుచు నగ్గలిక నడచినం గాంభోజ గోపాల సింధుగాంధార సౌవీర త్రిగర్త కళింగ ప్రముఖ బలసంగతు లై శకుని సైంధవులు దుశ్శాసనుం బురస్కరించికొని యురవడించి భీమపార్థులం బొదివిన ధర్మనందనుండు వెన్నుదన్ని యదల్చినం జేది కాశకరూశపాంచాల సైన్యంబులతో ధృష్టద్యుమ్నపురోగములగు రథికముఖ్యులు గడంగి కవిసి రప్పుడు విందానువిందులు గాశిరాజును సైంధవుండు భీమసేనుని వికర్ణుండు సహదేవునిఁ జిత్రసేనుండు శిఖండిని దుర్యోధనుండు విరటునిఁ ద్రిగర్తులు నకులుని ద్రోణుండు చేకితానసాత్యకులను గృపహార్దిక్యులు ధృష్టద్యుమ్నుని సౌభద్రుండు సాల్వకేకయులను ధృష్టకేతుఘటోత్కచులు నీకొడుకులం దలపడిరి యుధిష్ఠిరుండు దాను మద్రేశ్వరుందాఁకె నిట్లు సంకులసమరం బైన నస్త్రశస్త్ర సంఘట్టనంబున వెడలుమంటలు మింట నడరి మధ్యాహ్నప్రచండంబు లై యున్న చండకిరణుకిరణంబుల మగిడింప నరదంబులు దాఁకి పడి పొరలు కరులును కరిహస్తాకర్షణవిధ్వస్తంబు లగు రథంబులును దురగఖురపుటవిఘట్టితగాత్రు లగు పదాతులును బదాతి వర్గానర్గళప్రహారధారాళ రక్తసిక్తంబు లగు ఘోటకంబులు నై చూచుఖేచరులకు వెక్కసం బయ్యె నట్టియెడ. | 295 |
| క. |
భీముని పోరుట గడును | ద్దామం బై మెఱయుటయుఁ బితామహుఁడు శర స్తోమవిదారితుఁ జేసె మ | హామర్షోత్కర్షుఁ డగుచు నతనిం బెలుచన్. |
296 |
| క. |
కనుఁగొని సాత్యకి యేనుం | గునకు సిడులు సూపినట్లు కోపంబున భీ ష్మునిమీఁదఁ గవిసి యుజ్జ్వల | సునిశిత భల్లంబు లేసె సురలు నుతింపన్. |
297 |
| ఆ. |
అలిగి యతఁడు సూతుతలఁ దెగనేసిన | నధిప! వృష్ణివీరునరద మిట్టు నట్టుఁ దిగిచె నప్పు డాకుల గతి ఘోట | కములుఁ దద్బలంబు గలఁగఁ బడఁగ. |
298 |
| క. |
మరలుపుఁడు పట్టుఁ డిట తెం | డరదమునకు వేగవేగ యడ్డము సనుఁ డా తురుఁ డయ్యెను సాత్యకి సె | చ్చెరఁ జొరుఁ డనునులివు వారిసేనఁ జెలంగెన్. |
299 |
| తే. |
వికలరథుఁడగు నావృష్ణివీరు మీఁద | నేయ నొల్లక మీ తండ్రి యెసక మెసఁగ బాహుబలమునఁ బాండవవ్యూహవిదళ | నంబు సేయఁ దొడంగె భూనాథముఖ్య! |
300 |
| క. |
అంత విరాటుఁడు లయకా | లాంతకుఁడుం బోలెఁ బేర్చి యతిరభసమునన్ శాంతనవుఁ గదిసి యేసెం | గుంతీసుతు లలర మూఁడు క్రూరాస్త్రములన్. |
301 |
| క. |
ఏసి తురంగంబుల నో | నేసినఁ గోపించి భీష్ముఁ డిషుదశకమునం జేసె నతని రక్తజలో | ద్భాసితగాత్రుఁడుగ రెండుబలములుఁ బొగడన్. |
302 |
| వ. | అట్టి యెడ. | 303 |
| శా. |
గంగానందనుఁ దాఁక నర్జునుఁడు వోఁగా నడ్డమై రాజు మె చ్చం గేలీగతి యుల్లసిల్లఁ జని యశ్వత్థామ షడ్బాణవి ద్ధాంగుం జేసెఁ గిరీటి నవ్వుచుఁ దదీయంబైనచాపంబు ద్రుం చెం గోదండము వే ఱొకండు గొని యేసెన్ ద్రౌణి పె క్కమ్ములన్. |
304 |
| క. |
గురుసుతు బెడిదపుటంపఱ | నరనారాయణులు నొచ్చినన్ నరుకడ క న్నరుణం బగుటయుఁ దద్రుచి | పరంపరలతోన నిగిడె బాణచయంబుల్. |
305 |
| క. |
ఉఱక నరుఁ డట్టు మైమఱు | వఱువుళ్ళుగఁ జేసి లీల నంగము లెల్లం బఱియలుగఁ జేయ నాతం | డఱుమెడలక మఱియు నేసె నధికరయమునన్. |
306 |
| క. |
నొచ్చియుఁ బెనఁగినఁ గృపయును | మెచ్చు గదిరి విప్రుతోడ మెయికొని పో రి ట్లచ్చుపడ నేటి కని వి | వ్వచ్చుఁడు గ్రేడించి యొండువలనికి నడచెన్. |
307 |
| వ. | తదనంతరంబ. | 308 |
| ఉ. |
భీముఁ డుదగ్రదర్పమున భీష్మునిపైఁ జన నడ్డమై కురు గ్రామణి భల్లపంచకయుగంబున నాతని మేను సించుడున్ భీమదృఢక్షురప్రచయభిన్నతనుండుగఁ జేసె నాతఁ డా భూమిపు నిట్లు నీదు ప్రియపుత్రకు లొండొరుతోడఁ బోరఁగన్. |
309 |
| వ. | కనుంగొను జనంబులు. | 310 |
| క. |
‘చండవిరోధితిమిరమా | ర్తాండు లనఁగఁదగినవీరు దమలో ని ట్లు ద్దండతఁ బెనఁగుట ధృతరా | ష్ట్రుండవినయలోభముష్కరుం డగుటఁ జుమీ!’ |
311 |
| వ. | అని రట్టియెడ. | 312 |
| క. |
కురుపతికిఁ జిత్రసేనుఁడుఁ | బురుమిత్త్రుఁడు వేల్పుటేటి పుత్త్రుఁడుఁ బ్రా పై యురవడిఁ దఱిమిన వారికి | నరనందనుఁ డెదురుపడె గుణధ్వని సెలఁగన్. |
313 |
| క. |
పురుమిత్త్రుని నే డుజ్జ్వల | శరముల గంగాతనూజు సప్తతి బాణ స్ఫురణమునఁ జిత్రసేనునిఁ | బరమాంబకదశకమున విపాటితుఁ జేసెన్. |
314 |
| తే. |
ఎన్ని శరముల నభిమన్యుఁ డేసెఁ దమ్ముఁ | దారు నన్నియు శరములఁ దఱిమి చిత్ర సేనపురుమిత్త్రు లతని నేసిరి నవోగ్ర | విశిఖములు నాటె భీష్ముఁ డవ్వీరు మేన. |
315 |
| ఉ. |
ఆతఁడు చిత్రసేనుని శరాసన మేడ్తెఱఁ ద్రుంచి ఘోటక వ్రాతము నొంచి మైమఱువు వ్రచ్చి శరంబులు మేనఁ గ్రుచ్చి యు ద్ద్యోతితుఁ డైనఁ జూచి కర ముద్ధతి రాజతనూజవర్గముల్ వే తఱియంగఁ జొచ్చి పొదివెం బటుమార్గణవృష్టి నాతనిన్. |
316 |
| క. |
ఆ సౌభద్రుం డుగ్రపు | వేసవి దావాగ్ని శుష్కవిపినమ్ము నిరా యాసంబుగ దరికొనుగతి | భాసితశరశిఖలు వారిపైఁ బరగించెన్. |
317 |
| క. |
రంగత్ప్రథనస్తుత్య తు | రంగముఁ డై తాండవాభిరతుఁ డగు హరులీ లం గడఁగి వీరనృత్యము | సంగరరంగమునఁ జేసె శత్రులు మెచ్చన్. |
318 |
| వ. | ఇట్లు పేర్చి కురుబలంబు నేర్చు నభిమన్యుఁ జూచి జనితమన్యుండై శుభలక్షణుండగు లక్ష్మ ణుండు. | 319 |