పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము
ధృష్టద్యుమ్నుఁడు ద్రోణునితో యుద్ధము సేయుట (సం. 6-73-67)
తే. అంత నొం డొకసారథి యతిరయమునఁ | జటులహయములఁ బూన్పఁ బాంచాలసుతుఁడు
దన రథమునకు గ్రక్కునఁ జని పరాక్ర | మాభిరాముఁడై గురునిపై నడరెఁ బెలుచ.
385
వ. ఇట్లు ధృష్టద్యుమ్నుండు గడంగి యెప్పటియట్ల కుంభసంభవుతోడం బెనంగుచుండ భీమసేనుండును. 386
క. తనయరదంబు విశోకుఁడు | గొనివచ్చిన నెలమి నెక్కి క్రూరోత్సాహం
బునఁ దనుఁ బొదివిన దుర్యో | ధనుమీఁద నిశాతవిశిఖతతి నిగిడించెన్‌.
387
క. కురుపతి యొక నారాచం | బురమున నాటింప భీముఁ డుగ్రత నేసెన్‌
గురుతరశరత్రయంబున | గరములు వక్షమును నాటఁ గౌరవనాథున్‌.
388
వ. దాని కతండు చలింపక వృకోదరుపై వివిధశరంబులేసె నతనితమ్ములు దలకడచి యాభీమసేనుం బట్టికొన నుత్సహించి యెప్పటియట్ల బెట్టిదంబుగాఁ గవిసినం గని యక్కుమారుల నభిమన్యు ద్రౌపదేయులును ధృష్టకేతు కేకయులునుం దాఁకి రట్లు వారును నమ్మారుతియుం గూడి దారుణభంగిం దఱుముట సైరింపం జాలక. 389
క. విఱిగి భవత్సుత నివహం | బఱిముఱిఁ గనుకనిఁ జనంగ ననిలసుతుం డే
డ్తెఱ నెగచి వగచె వారం | దఱుఁ దనచేఁ జచ్చుటపుడు దప్పుటకుఁ గడున్‌.
390
క. తమ్ములఁ దోలిన నతిరౌ | ద్రమ్ముగఁ గోపించి యన్నదలపడియెను సై
న్యమ్ముఁ బురికొలిపికొని రభ | సమ్మున భీమాదియోధసంఘముతోడన్‌.
391
క. అపరాహ్ణ సమయమున న | ట్లుపమాతీతాతిఘోరయుద్ధం బయ్యెన్‌
రిపుభయదభుజుఁడు భీమున | కపరిమితబలుండు గురుధరాధీశునకున్‌.
392
సీ. తదవసరంబునఁ బొదివి వికర్ణుండుఁ జిత్రసేనుఁడుఁ బార్థుపుత్త్రుమీఁదఁ
గవిసిన నతఁడు వికర్ణురథ్యంబులఁ గూల్చి యాతనిపయిఁ గుప్పెకోల
లిరువది నాటింప నరదంబు డిగి భీతి యూన నాతఁడు చిత్రసేనురథము
పై కేఁగె ద్రౌపదిపట్టు లేవురు భీమునకు నడ్డపడి కురునాథుఁ దాఁకి
 
తే. మేనునెత్తురు వఱ్ఱుగా మెఱుఁగుటమ్ము | లేయ వారలఁ దలపడి యేనునార
సముల రారాజు నో నేసి సరభసముగఁ | దఱిమె గాంగేయుఁ డరిసేనఁ దఱియఁ జొచ్చె.
393
క. చొచ్చి చతురంగ వితతులు | విచ్చునటులు సేయుటయును వివ్వచ్చుఁడు వే
వచ్చి తలపడినఁ బురికొని | యచ్చట నిరువాఁగు నట్టలాడం బోరెన్‌.
394
ఆ. రక్తనదులలోన రథయానపాత్రముల్‌ | వఱపి యోధవరులు బాహుబలము
వెలయ సమరకేళి సలిపిరి శూరత | నేచి కడఁగి యోల రాచి రాచి.
395
వ. అంత నరుణకిరణుం డన్వర్థాభిధానుం డగుచు వచ్చిన వేగిరపడి వాయునందనుండు సుయోధను నేఁడ సమయింతు ననుసంరంభంబున నతనికి సమ్ముఖంబుగాఁ దేరు వఱపించి కదిసి క్రోధమోదంబులు మనంబునం పెనంగొన నతనిం గనుంగొని. 396
సీ. కడుఁ బెద్ద కాలంబు గాంక్షించి యున్నయుత్సవ మిప్డు సమకూర దైవ మిచ్చె
గొంతిసంకటపాటుఁ గోడలిబన్నంబుఁ దీర్చెదఁ గృష్ణుండు దెలుప నీవు
సరకు సేయమియును సభలో నులూకునిఁ బంచి యాడించిన పరుసములును
గక్కించి బీరంబు దక్కించుకొననీక తెగఁ జూడఁగాంచితి మగతనంబు
 
తే. గలిగి మగుడక నిలు మని పలికి యుగ్ర గతి నెదుర్కొని రథతురంగముల సూతుఁ
జంపి చాపంబు ద్రుంచి విస్ఫారకేతు | దండ మేడ్తెఱ నఱకె భీముండు సెలఁగి.
397
ఉ. వేఱొక విల్లు పుచ్చికొను వేగములోనన కౌరవేంద్రు మైఁ
దూఱ వృకోదరుండు పదితూపులు పాములు పుట్టలోనికిం
దూఱినయట్లుగాఁ బ్రబలదోర్బల మేర్పడ నేయ నెమ్ములన్‌
గీఱిన మూర్ఛ వచ్చి యొఱగెం దఱచై రుధిరంబు గ్రమ్మఁగన్‌.
398
వ. అట్టియెడ జయద్రథుండు రథికవరులతోడం గడంగి వడముడిపై నడరె నప్పుడు కృపాచార్యుండు దుర్యోధనుఁ దనరథంబుమీఁదం బెట్టికొని తొలంగం గొనిపోయె నభిమన్యుండును ద్రౌపదేయులును గేకయులును మారుతిని మీఱి సైంధవుం దలపడినఁ జిత్రసేనుండును జిత్రుండును జిత్రాక్షుండును జారుచిత్రుండును సులోచనుండును నందుండును నుపనందుండును రౌద్రంబుగా సౌభద్రుం బొదివిన. 399
క. బలియుఁ డగు పార్థపుత్త్రుఁడు | వలనేర్పడ నొకనినొకని వడి నైదైద
మ్ముల నేసి నొంప వారలు | దలఁకక వెస ముంచి రస్త్రధారల నతనిన్‌.
400
వ. సహోదరులకు సహాయత్వంబు సేయంబూని మున్ను విరథుండై పోయినవాఁడగుటం జేసి. 401
చ. తఱిమి వికర్ణుఁ డప్డు తనుఁ దాఁకిన నా యభిమన్యుఁ డల్గి బి
ట్టఱ విలుద్రుంచి సారథి వడం దురగంబులఁ జావ నేసి క్రొ
మ్మెఱుఁగులతోడఁ దద్ధ్వజము మేదినిఁ గూలఁగఁ జేసి యంగముల్‌
గిఱికొన బాణముల్‌ నినిచెఁ గేలిమెయిం బటు దర్ప మేర్పడన్‌.
402
వ. ఇట్లు నొచ్చినవికర్ణుం గనుంగొని కురుకుమారు లొక్కపెట్ట కవ్వడి కొడుకుపై నురవడించిన. 403
ఉ. ఏవురు ద్రౌపదేయులును నేడ్తెఱ నాతని కడ్డమై తురం
గావళి నొంచియుం బడగ లన్నియుఁ ద్రుంచియు నంపవానలం
జేవ సెడంగ ముంచియునుఁ జేడ్పడఁ జేయఁగ నీతనూభవుల్‌
వోవక వారితో మఱియుఁ బోరిరి సిగ్గున బీర మెక్కఁగన్‌.
404
వ. అట్టియెడ నకులనందనుం డగుశతానీకుండు బహుప్రకారబాణంబుల వివిధ విక్రమక్రీడ సలుపు బలుపుఁ గనుంగొని కేకయపాంచాలపతులు బాసటయై చటులతరతురంగమాతంగస్యందనసందోహంబులం బఱపి కడిమి నెఱపి రిప్పరుసునం బ్రతివీరుల నఱుముటయు నప్పుడు పతంగుండు పశ్చిమాచలశృంగంబు మఱుంగుపడుటయుం జూచి గాంగేయుం డంత్య కాలకాలాకృతిం గడంగి పటు విశిఖవితానంబుల వేఁడిమి సూపి యమ్మోహరంబు దెరల్చి తనమొనల మరల్చికొని సమరంబు సాలించి శిబిరంబున కరిగెఁ బాండుసూనులును మేనులు వెడవెడ చెమర్ప విడిదలకుం జని రని సంజయుం డాఱవ దివసంబు నాహవంబు తెఱం గెఱింగించె నప్పుడు. 405
క. ‘కిమ్మీరమర్దనునిచే | నిమ్మెయి నోటాఱఁ బెక్కు లేటులు వడి ద
ర్ప మ్మెడలి మూర్ఛ మునిఁగియుఁ | గ్రమ్మఱఁ గురునాథుఁ డెట్లు గడఁగెనొ యనికిన్‌?’
406
వ. అని సకౌతుకంబుగాఁ బలికిన. 407
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )