| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
భూపోత్తమ! విను పాండు | క్ష్మా పాలతనూభవులును గౌరవులును నా టోపంబున సంగరకే | ళీపరులై వెడలి రుగ్రలీలలు మెఱయన్. |
68 |
| వ. | అట్టియెడం గురుపితామహుండు గూర్మవ్యూహంబు దీర్చినం గనుంగొని ధర్మతనయుండు ధృష్టద్యుమ్ను నాలోకించి ‘కౌరవవ్యూహంబు సూచితే? దీనికిఁ బ్రతివ్యూహం బెయ్యది దాని సంఘటింపు’మనిన నతండు శృంగాటకవ్యూహంబు వన్నె నిట్లు రెండుసైన్యంబులు మోహరించి యుత్సాహంబులు మెఱయ భేరీ మృదంగాదితూర్యంబులు మొరయం దలపడినఁ బటుహేతివ్రాతపరస్పరసంఘట్టనంబులం బొగ లేని మంట లెగయం జటులస్యందనమాతంగతురంగభటకదంబకంబుల గమనవేగంబున నెగయుపరాగపటలంబు లంబరంబునం బరఁగనీక తత్తదనీకానేకరక్తధారాసారంబు లడరి యడంగించిన నతిరౌద్రంబునఁ బెనంగు నాసమయంబున. | 69 |
| క. |
మీ తండ్రి సింహనాద | స్ఫీతముఖుం డగుచు నాత్మసేన గడచినన్ భీతిం బాండవయోధ | వ్రాతము మార్కొనక యొదిఁగె వసుధాధీశా! |
70 |
| చ. |
అనిలతనూజుఁ డొక్కరుఁడు | నార్చుచు భీష్మునెదిర్చి సూతుఁ జం పిన రథ మీడ్చికొంచుఁ గురు | బృందము గొందల మంద నశ్వముల్ వెనుకకుఁ బాఱె నప్డు పృథి | వీవర! పాండవ సేన యుబ్బె నీ తనయుఁడు భీముఁ గట్టెదురఁ | దాఁకె సునాభుఁడు విక్రమోద్ధతిన్. |
71 |