పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - తృతీయాశ్వాసము
అలంబసుఁడు దుర్యోధన ప్రేరితుండై యభిమన్యునిపైఁ గవియుట (సం. 6-96-24)
క. అనవుడు నతండు దుర్దమ | దనుజావలి మున్ను గాఁగఁ దఱిమెం గుంతీ
తనయబలము గారాకులు | పెనుగాలిం దూలునట్లు భీతిం జెదరన్‌.
196
ఉ. అప్పుడు ద్రౌపదేయులు రయంబున నడ్డము సొచ్చి దైత్యులం
గుప్పలుగా మహిం బెలుచఁ గూల్చిన దానవనాథుఁ డమ్ములం
గప్పెఁ గడంగి వారల నఖండపరాక్రమలీల వారు వాఁ
డొప్పఱి తేరి కూబరమయూఁతగ వ్రాలఁగనేసి యార్చినన్‌.
197
క. ఆలోనన తెప్పిఱి లయ కాలుండును | బోలె నసుర గన్నుల నిప్పుల్‌
రాలఁగ వారలసిడములు | నేలం బడనేసి చాపనికరము ద్రుంచెన్‌.
198
వ. త్రుంచి నవ్వుచు. 199
తే. ఒకని నొకని నైదైదు మహోగ్ర భాసు | రాస్త్రముల నేసి నొంచిన నతనిమదము
సొంపు సోదరవ్యథయును జూచి | యడరె నప్పు డాతనిపై సుభద్రాత్మజుండు.
200
వ. అప్పు డుభయ సైన్యంబులవారును వెఱఁగంది. 201
క. ‘దనుజుఁడు మాయాధికుఁ డ | ర్జునతనయుండు దివ్యశరధరుం డెట్లగునో?
యనుచుండఁగ నయ్యిరువురు | ననిసేసిరి వృత్రవాసవాకృతి దోఁపన్‌.
202
క. ఇతరేతరశరకృతశో | ణిత ధారలు నిగుడ నపుడు నిర్భరదావ
ద్యుతు లడరఁ బొలుచునగముల | గతిఁ బొలిచిరి వార లప్రకంపోన్నతు లై.
203
క. దనుజేశ్వరుండు మాయం | బొనరించినఁ దమము గవిసె భూనాయక! ఫ
ల్గున సుతుఁడు భాస్కరాంబక | మున వెలుఁ గొనరించె సురసమూహము వొగడన్‌.
204
తే. అసుర వెండియుఁ బెక్కు మాయలు ఘటింప | శక్ర పౌత్రుండు దివ్యాస్త్రజాల మడరఁ
జేసి యన్నింటి నడఁగించి చెలఁగి నొంప | రథము డిగి పాఱెఁ బెలుచ నా రాక్షసుండు.
205
క. రక్కసుఁడు విఱిగినం గడు | నుక్కున సౌభద్రుఁ డడరునురవడి గని న
ల్దిక్కులఁ బఱచెం దమలోఁ | జిక్కువడుచుఁ గౌరవేంద్రుసేనలు భీతిన్‌.
206
వ. అప్పుడు పెక్కండ్రు రథికులతోడం గూడి గాంగేయుం డభిమన్యు పయిం గవిసిన. 207
తే. అతఁడు దానికిఁ దలఁకక యందఱకును | నన్నిరూపు లై పోరంగ నర్జునుండు
సరభసంబుగ భీష్ముపై నురవడింపఁ | బొంగి యిరువాఁగు నిరువురఁ బొదివె బెరసి.
208
వ. అట్టి సంకులసమరంబున నభిమన్యుపై నడరు కృపాచార్యుం దాఁకి సాత్యకి బెడిదంపునారసంబు లేసిన వాని నన్నింటిని నశ్వత్థామ తునిమి యతని విల్లు ద్రుంచినం గోపించి. 209
క. ఆ సాత్యకి వేఱొక వి | ల్లాసురగతి నెత్తి యుగ్రమగు నారాచం
బేసిన నాతఁడు కేతు | వ్యాసక్తుండయ్యె మూర్ఛవచ్చి నరేంద్రా!
210
క. ఆలోనన తెలిసి మెఱుఁగు | వాలిక తూ పాతఁ డతని వక్షమునడుమం
గీలించి సిడము గ్రక్కున | నేలం బడనేసి యార్చె నింగి వడంకన్‌.
211
వ. దానికిం గినిసి శినిమనుమండు పొగరు మిగులునారాచనిచయంబులం బొదివిన నశ్వత్థామ రాహుగ్రస్తుం డగు నుగ్రగభస్తియుంబోలె నైనం గనుంగొని. 212
క. ద్రోణాచార్యుండు సుత | త్రాణపరత్వమునఁ గృష్ణుతమ్ముని పై న
క్షీణోద్ధతిఁ గవియుడు గీ | ర్వాణాధిపసుతుఁడు వచ్చి వడి నెడఁ జొచ్చెన్‌.
213
చ. అనవుడు నాంబికేయవసుధాధిపుఁ డిట్లనుఁ ‘ద్రోణుఁ డాత్మ న
ర్జునునకుఁ గూర్చునాతఁడు గురుంగని యెంతయు భక్తి సేయు వా
రనిఁ దమలోన నట్లు వెస నప్పుడు దార్కొని యెట్లు వోరిరో
వినఁగల దేర్పడం జెపుమ విశ్రుతభంగిగ నాకు సంజయా!’
214
వ. అనిన నా సూతనందనుం డతని కి ట్లనియె. 215
క. క్షాత్త్రము దలకొని సంగర | ధాత్రికి నేతెంచి గురులు దండ్రులు దమ్ముల్‌
పౌత్త్రులు శిష్యులు మామలు | పుత్త్రులనం గలదె? తాడరి పోరన వలయున్‌.
216
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )